భారత్ లో రోజు రోజుకి పెరుగుతున్న ఒమిక్రాన్

భారత్ లో రోజు రోజుకి పెరుగుతున్న ఒమిక్రాన్

భారత్ లో ఒమిక్రాన్ విస్తరణ పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే  దేశంలో 69 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 530కి చేరింది. మహారాష్ట్రలో కొత్తవేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ 141 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 79 కేసులు, కేరళలో 57 కేసులు, గుజరాత్ లో 49 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది. ఏపీలో ఆరు ఒమిక్రాన్ కేసులు ఉండగా.. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో తొలిసారి కేసులు నమోదయ్యాయి. 

ఇక కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యయి. ఢిల్లీలో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి 11గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. కర్ణాటకలో కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. హోటళ్లు, బార్లు, పబ్,రెస్టారెంట్లలో 50 శాతం సీటింగ్ కే అనుమతి ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించారు. హర్యానాలో నైట్ కర్ఫ్యూ విధించారు. గుజరాత్ లోనూ కర్ఫ్యూ వేళలను పెంచారు. రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. యూపీలోనూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

మరోవైపు దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది.. ఇప్పటి వరకు 145 కోట్ల మందికి టీకా డోసులు పంపిణీ చేశారు. జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పిల్లలకు గోవాగ్జిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇది పిల్లల్లో ఇమ్యునిటీని పెంచుతుందని నిపుణులు తెలిపారు. వృద్ధులకు బూస్టర్ డోస్.. తొమ్మిది నెలల విరామ సమయంలో ఇవ్వాలని నిర్ణయించారు. 

మరోవైపు ప్రపంచాన్ని ఒమిక్రాన్ వణికిస్తోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా లక్షా 85 వేల 832 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 31 మంది మరణించారు. బ్రిటన్ లో ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉంది.. అక్కడ రోజూ వేల  సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ లక్షా 14 వేలకుపైగా ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. డెన్మార్క్ లో 32,877 కేసులు, యూఎస్ లో 7,355 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.