50 శాతం సెంట్రల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

50 శాతం సెంట్రల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్‌ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయాలకు రావడంపై మినహాయింపు ఇచ్చింది. అదే సమయంలో సిబ్బంది ఆఫీస్ కు వచ్చేందుకు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు రెండు సమయాలను నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు వచ్చినవారు సాయంత్రం 5.30 గంటలకు, పొద్దున పదింటికి వచ్చినవారు సాయంత్రం 6.30 గంటలకు వెళ్లాలని ఆదేశించింది.

రాకపోకల సమయంలో రద్దీని నివారించేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు కేంద్రం పేర్కొంది. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో ఉండేవారు కూడా ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అండర్‌ సెక్రటరీ, అంతకంటే ఎక్కువ ర్యాంకుల్లో ఉన్న అధికారులు కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని పేర్కొంది. కార్యాలయాల్లో జరిగే సమావేశాలను వీలైనంత మేరకు వీడియో సమావేశం విధానంలో నిర్వహించాలని సూచించింది. ఆఫీసులకు వచ్చే సందర్శకులతో భేటీ అవడం అత్యవసరం, తప్పనిసరి అయితే తప్ప విరమించుకోవాలని తెలిపింది. మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం సహా కార్యాలయాల్లో కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు అంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

మరిన్ని వార్తల కోసం: 

పంజాబ్‌లో స్కూళ్లు, కాలేజీలు క్లోజ్

మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు

సంక్రాంతికే రాధేశ్యామ్ రాక