తమిళనాడులో వీధి కుక్క హల్చల్..ఇంట్లోకి వచ్చి మరి తండ్రి కొడుకుల పై దాడి..

తమిళనాడులో వీధి కుక్క హల్చల్..ఇంట్లోకి వచ్చి మరి తండ్రి కొడుకుల పై దాడి..

వీధి కుక్కలకు కొందరు రోడ్డుపై, బస్టాండుల్లో  బికెట్లు, బ్రేడ్ వేస్తుండటం చూస్తుంటాం.. ఒకోసారి అవి ఎంతో విశ్వాసాన్ని కూడా చూపిస్తుంటాయి.. కానీ అదే వీధి కుక్కలు మీపై ఎగబడి కరిస్తే.. తమిళనాడులోని మధురైలో ఇలాంటి ఘటనే  ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. ఒక వీధి కుక్క ఇంట్లోకి వచ్చి మరి ఓ ఎనిమిదేళ్ల బాలుడు, అతని తండ్రిపై దాడి చేసింది. సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటన వీధి కుక్కలపై  తీవ్ర కోపాన్ని తెప్పిస్తుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 40 ఏళ్ల  ముత్తుసామి ఇంట్లో ఉన్నప్పుడు 3వ తరగతి చదువుతున్న అతని కుమారుడు సెంథిల్ స్కూల్ వెళ్లే ముందు బాత్రూం వైపు వెళ్ళాడు. ఎక్కడి నుండి వచ్చిందోగాని కాంపౌండ్ గేటు తెరిచి ఉండటంతో ఒక వీధి కుక్క లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి బాలుడిపైకి ఎగిరి అతని చేతులు, కాళ్ళు, తొడను కొరికింది. అతని అరుపులు విని ముత్తుసామి, కుటుంబికులు బయటకు వచ్చారు.

1 నిమిషం 38 సెకన్లు ఉన్న వీడియోలో ముత్తుసామి కొడుకును కాపాడటానికి  ప్రయత్నిస్తుండగా వీధి కుక్క అతని కాలుపై కొరికినట్లు కనిపిస్తుంది. చివరకు మధురై కార్పొరేషన్ జంతు నియంత్రణ బృందం ఈ కుక్కను దాదాపు గంటసేపు ప్రయిత్నించి పట్టుకుంది. 

తరువాత తండ్రీ కొడుకులిద్దరినీ మధురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించి, యాంటీ రేబిస్ వాక్సిన్ ఇచ్చారు. బస్టాండ్ సమీపంలోని హోటళ్లలో చేపల వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం వల్ల వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని అక్కడ ఉండేవాళ్ళు  చెబుతున్నారు.