మహబూబ్నగర్లో అభయహస్తం దరఖాస్తుల వెల్లువ

మహబూబ్నగర్లో  అభయహస్తం దరఖాస్తుల వెల్లువ

వెలుగు, నెట్​ వర్క్​ : ప్రజా పాలన కార్యక్రమంలో తొలిరోజు అభయహస్తం దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దరఖాస్తులు అందించారు. ఆయా సెంటర్లలో అధికారులు, ఎమ్మెల్యేలు, లీడర్లు పరిశీలించారు. 

గద్వాల: జోగులాంబ గద్వాల మండలం బీరెల్లి, లత్తి పురం, జమ్మిచేడ్, వెంకం పేట , ప్రజా పాలన కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ సరిత ప్రారంభించి అప్లికేషన్లను స్వీకరించారు. కాంగ్రెస్​ ఇచ్చిన హామీల్లో రెండు పథకాలు అమలు చేశామన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రజా పాలన కార్యక్రమం లో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీల పథకం దరఖాస్తు ఫారాన్ని లబ్ధిదారులకు అందించారు.  కలెక్టర్ అపూర్వ్ చౌహాన్ మాట్లాడుతూ.. వచ్చే నెల 6  వరకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు.  

సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ జి.రవినాయక్ 

మహబూబ్ నగర్ కలెక్టరేట్: ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరుగ్యారంటీ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ కోరారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని షాషాబ్ గుట్ట తాండాలో నిర్వహించిన వార్డు సభకు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పథకాల అమలుకు  ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుందని అన్నారు. జిల్లాలో 17 మండలాలు, మూడు మున్సిపల్ ప్రాంతాల్లో 48 టీంలను ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. అనంతరం ఆయన వార్డు సభల తీరు, కౌంటర్లు, ప్రజల దరఖాస్తులను, ఏర్పాట్లను పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీఓ అనిల్ కుమార్ , మున్సిపల్ కమీషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
కోస్గి: అభయహస్తం గ్యారంటీల దరఖాస్తులను పకడ్బందీగా స్వీకరించాలని అడిషనల్​ కలెక్టర్ మయాంక్ మిట్టల్ అధికారులకు సూచించారు. కోస్గి పురపాలికలో నిర్వహించిన ప్రజాపాలన సభకు హాజరై పలువార్డులలో లబ్ధిదారుల నుంచి ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అధికారులు దరఖాస్తులను పరిశీలించాలన్నారు. గుండుమాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో సభను రెవెన్యూ అడిషనల్​ కలెక్టర్ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వేణుగోపాల్, తహసీల్దార్ శ్రీనివాసులు, పుర కమిషనర్ సి. హెచ్ శశిధర్, విద్యుత్ ఏఈ పర్వతాలు పాల్గొన్నారు. 
 

చిన్నచింతకుంట: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం అడిషనల్ కలెక్టర్ శీలేంద్ర ప్రతాప్ మండల కేంద్రంతో పాటు ఉంద్యాల గ్రామంలో జరిగిన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. మండలంలో మొత్తం 1200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తహసీల్దార్​ కృష్ణయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

పకడ్బందీగా నిర్వహించాలి : 

మక్తల్: ప్రజా పాలనను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ చైర్​పర్సన్​ వనజ అన్నారు. మండలం లోని మంథన్ గోడ్ లో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెతోపాటు సర్పంచ్ మాదేవమ్మ స్పెషల్ ఆఫీసర్ జాన్ సుధాకర్, తహసీల్దార్ సువర్ణ రాజు ఉన్నారు.