బీజేపీ బిగ్ టార్గెట్.. ఒకే రోజు 35 లక్షల ఫ్యామిలీస్ ను కలిసేలా ప్లాన్

బీజేపీ బిగ్ టార్గెట్.. ఒకే రోజు 35 లక్షల ఫ్యామిలీస్ ను కలిసేలా ప్లాన్

బీజేపీ బిగ్ టార్గెట్
ఒకే రోజు 35 లక్షల ఫ్యామిలీస్ ను కలిసేలా ప్లాన్
22న ఇంటింటికీ బీజేపీ పేరిట కార్యక్రమం
27 నుంచి మేరా బూత్ సబ్ సే మజ్బూత్
ఒక్కో బూత్ ప్రెసిడెంట్ 100 కుటుంబాలు కలిసే ప్లాన్
కరీంనగర్ లోని రెండు కాలనీల్లో బండి సంజయ్ పర్యటన

హైదారబాద్ : ఈ నెల 22న బీజేపీ ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను కలిసేందుకు సిద్ధమవుతున్నది. ఈ బృహత్తర కార్యక్రమంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు భాగస్వాములు కానున్నారు. ఇంటింటికీ బీజేపీ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. ప్రధాని నరేంద్ర మోడీ తన 9 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ఒక్కో బూత్ కమిటీ అధ్యక్షుడు కనీసం వంద కుటుంబాలను కలవాలని లక్ష్యంగా నిర్దేశించారు.

రాష్ట్ర స్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లోని ప్రజల వద్దకు వెళ్లాలని రాష్ట్ర కమిటీ సూచించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన సొంత నియోజకవర్గ కేంద్రమైన కరీంనగర్ లో పర్యటించనున్నారు. నగరంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లోని కుటుంబాలను కలిసి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను, చేసిన అభివృద్ధిని వివరించారు. కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తదితర ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. 

"మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’

దేశంలోని అన్ని పోలింగ్ బూత్ లను శక్తిమంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ ‘‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’కార్యక్రమాన్ని ఈ నెల 27 నుంచి జూలై 5వ తేదీ వరకు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 27న ప్రధాని మోడీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి సెగ్మెంట్ కు 10 మంది చొప్పున 170 మంది కార్యకర్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. ఈ నెల 27న తెలంగాణకు సైతం 900 మంది కార్యకర్తలు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడి వారితో మమేకం అవుతారు.