ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో తెలంగాణకు 3వ ర్యాంక్

ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో తెలంగాణకు 3వ ర్యాంక్

న్యూఢిల్లీ: పర్యాటక రంగంలో దేశంలోనే ఉత్తమ రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవార్డును దక్కించుకొంది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా  కేంద్ర ప్రభుత్వం నేషనల్ టూరిజం అవార్డులను ప్రదానం చేసింది.  ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి అజయ్ భట్ ముఖ్య అతిథిలుగా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రం నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2018–19 సంవత్సరానికి కేంద్ర పర్యాటక శాఖ అవార్డులను ప్రకటించగా... తెలుగు రాష్ట్రాలకు పలు విభాగాల్లో అవార్డులు లభించాయి. ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో తెలంగాణకు 3వ స్థానం దక్కింది.

హైదరాబాద్‌లోని అపోలో హెల్త్ సిటీ ‘బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ’ అవార్డు దక్కించుకోగా.. హైదరాబాద్ గోల్ఫ్ కోర్సుకు ఉత్తమ గోల్ఫ్ కోర్స్ అవార్డు దక్కింది. ఏపీ టూరిజం ప్రచురించిన ‘సీసైడ్’ (కాఫీ టేబుల్ బుక్)కు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఇంగ్లిష్ అవార్డు దక్కగా... విజయవాడలోని ది గేట్ వే హోటల్ ‘బెస్ట్ 5స్టార్ హోటల్’ అవార్డు దక్కించుకుంది. విదేశీ భాషల్లోనూ ‘సీసైడ్’ (రష్యన్, స్పానిష్ జర్మన్) అవార్డును పొందింది.