సీఎం కేసీఆర్ సంతకాలు పెట్టినా ఫైల్స్ ముందుకు కదలట్లే

సీఎం కేసీఆర్ సంతకాలు పెట్టినా ఫైల్స్ ముందుకు కదలట్లే
  • కొత్త సెక్రటేరియెట్ ఓపెనింగ్ నాడు పాత ఫైళ్లపై సంతకాలు
  •   15 రోజులు గడిచినా ముంగటపడని పనులు  
  •     దళితబంధు, పోడుపట్టాలు, న్యూట్రిషన్ కిట్.. ఏదీ పట్టా ఎక్కలే  
  •     ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ తిరుగుతున్న దళితబంధు లబ్ధిదారులు

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ సంతకాలు పెట్టినా ఫైల్స్ ముందుకు కదలడం లేదు. పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో సీఎం సంతకానికీ విలువ లేదా? అన్న చర్చ సెక్రటేరియెట్ వర్గాల్లో నడుస్తోంది. గత నెల 30న బీఆర్  అంబేద్కర్ కొత్త సెక్రటేరియెట్ ఓపెనింగ్ తర్వాత పలు ఫైళ్లపై సీఎం సంతకాలు పెట్టారు. ఆయనతో పాటు మంత్రులు కూడా వివిధ స్కీములకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేశారు. ఈ సంతకాలు చేసి 15 రోజులు గడుస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది. పాత ఫైళ్లపై సంతకాలు పెట్టి, ఇప్పుడే ఇచ్చేస్తున్నాం అన్నట్లు హడావుడి చేసిన ప్రభుత్వం.. రోజులు గడుస్తున్నా వాటిని పట్టాలు ఎక్కించడం లేదు. ఒకటి, రెండింటిలో కదలిక వచ్చినా వాటినీ అసంపూర్తిగానే వదిలేశారు. దీంతో నామ్ కే వాస్తే అన్నట్లు సంతకం చేసి చేతులు దులుపుకున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై ఉన్నతాధికారులను అడిగితే.. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇంకా రాలేదనే సమాధానం వస్తోంది. లక్షల మంది పేదలతో ముడిపడిన దళిత బంధు, పోడు పట్టాలతో పాటు న్యూట్రిషన్ కిట్​అమలు కావడం లేదు.

ఏడాదిగా ఊరిస్తున్నరు 

దళితబంధు, పోడు పట్టాల పంపిణీపై రాష్ట్ర సర్కారు ఎప్పటి నుంచో ఊరిస్తోంది. ఏడాది కాలంగా అదిగో.. ఇదిగో అంటూ ప్రకటనలు చేయడమే తప్ప అమలులో మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయింది. ఆ ఫైళ్లపై సీఎం సంతకం పెట్టిన తరువాత కూడా ముందుకు కదలడం లేదు. ఒక్కో నియోజకవర్గంలో1,100 మంది చొప్పున దళితబంధు ఇవ్వాల్సి ఉండగా, స్కీం అమలు ముంగటపడటంలేదు.. ఇప్పుడు సీఎం సంతకం పెట్టిన తరువాత  కూడా గైడ్​లైన్స్ ఇవ్వడం లేదు. లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టడం లేదు. సీఎం సంతకంతో ఇక దళితబంధు వచ్చినట్లేనని ఆశపడిన దళితులు.. ఇపుడు ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే  పోడు పట్టాలను గత మార్చిలోనే పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. అప్పుడు చేయకపోగా సెక్రటేరియెట్ ప్రారంభించిన రోజు పట్టాల పంపిణీ రేపో మాపో అన్నట్లు హడావుడి చేశారు. కానీ ఇంతవరకు ఒక్క పట్టా కూడా పంపిణీ చేయలేదు. పోడు పట్టాల కోసం 1.35 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అలాగే గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఉద్దేశించిన న్యూట్రిషన్ కిట్ కు సంబంధించిన ఫైలుపైనా సీఎం సంతకం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో ఈ స్కీమ్  అమలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి అవసరమైన కిట్ల పంపిణీ కొన్ని నెలలుగా వాయిదా పడుతూనే ఉంది. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్​చేయాల్సి ఉండగా ఇంకా 5 వేల మందికి  ఉత్తర్వులు రాలేదు. 

మంత్రుల ఫైల్స్ కూడా అట్లనే 

మంత్రులు సంతకాలు చేసిన కొన్ని ఫైల్స్ కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. డిస్కంలకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.958 కోట్లు చెల్లించే ఫైల్ పై జగదీశ్‌‌ రెడ్డి, కొత్త మండలాలకు ఐకేపీ భవనాల అనుమతి ఫైలుపై ఎర్రబెల్లి ద‌‌యాక‌‌ర్ రావు, జీహెచ్ఎంసీ పరిధిలోని 4 జిల్లాల్లో 100 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేసే ఫైల్ పై ఇంద్రకరణ్ రెడ్డి సంతకం చేశారు.  కానీ ఈ ఫైల్స్ అన్నీ సంతకాలకే పరిమితం అయ్యాయి. అంగన్​వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీతో పాటు రాంజీ గోండు మ్యూజియానికి రూ.10  కోట్లు మంజూరు చేస్తూ మంత్రి సత్యవతి రాథోడ్  కూడా సంతకం చేసినా పెండింగ్​లో పెట్టారు. 

పైనుంచి ఆదేశాలు వస్తేనే ముందుకు 

సీఎం, మంత్రులు సంతకాలు పెట్టినంత మాత్రాన పనులు ముందుకు కదలవని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిదీ నిధులతో కూడుకున్నదని, అందుకు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి డిపార్ట్​మెంట్ల ఖాతాల్లోకి వచ్చి చేరాలని వారు అంటున్నారు. దాంతో పాటు వాటిని డ్రా చేసుకునేందుకూ అవకాశం ఇస్తేనే స్కీ ములు ముందుకు కదులుతాయని చెబుతున్నారు. సంతకాలు చేసినప్పటికీ పై నుంచి మళ్లీ ఆదేశాలు రావాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. ఇక ఫండ్స్​తో సంబంధం లేకుండా పోడు పట్టాల పంపిణీ చేపట్టేందుకు అవకాశం ఉన్నా.. రాజకీయ లబ్ధి కోసమే ఆలస్యం చేస్తున్నారని తెలిసింది.