
న్యూఢిల్లీ: దేశీయంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల బండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్యకాలంలో 2.07 లక్షల వెహికల్స్‌ను ఎగుమతి చేసింది. సెప్టెంబర్‌లో కంపెనీ 42,204 యూనిట్లు ఎగుమతి చేసి, గత ఏడాది ఇదే నెలలోని 27,728 యూనిట్లతో పోలిస్తే 52శాతం వృద్ధి సాధించింది. క్యూ1 (ఏప్రిల్–జూన్) లో 1.10 లక్షల యూనిట్లు ఎగుమతి కాగా, రెండో క్వార్టర్‌లో కూడా 1 లక్షకు పైగా ఎగుమతులు సాధించింది.
కంపెనీ ఎలక్ట్రిక్ మోడల్ ఈవీటారాకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో 6,068 యూనిట్లను ఎగుమతి చేసింది. ఫ్రాంక్స్, జిమ్నీ, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి సబ్ 4 మీటర్ మోడల్స్ అత్యధికంగా ఎగుమతి అయ్యాయి. దక్షిణాఫ్రికా, జపాన్, సౌదీ అరేబియా, చిలీ, కొలంబియా వంటి దేశాలు మారుతికి ప్రధాన ఎగుమతి మార్కెట్లుగా నిలిచాయి. ఇటీవల భారత్ చేసిన ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కూడా ఈ వృద్ధికి తోడ్పడ్డాయని కంపెనీ పేర్కొంది.