Layoffs :ఫేస్ బుక్ లో మరోసారి ఉద్యోగుల తొలగింపు

Layoffs :ఫేస్ బుక్ లో మరోసారి ఉద్యోగుల తొలగింపు

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.. ఇలా ఒక్కటేమిటి.. చాలా టెక్ దిగ్గజాలన్నీ ఎంతో సింపుల్ గా ఓ మెయిల్ పంపి మీ సేవలు చాలు అనేస్తున్నాయి. క్షణాల్లో సెటిల్ మెంట్లు చేసేసి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి. తాజాగా మరోసారి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా (Meta) మరింత మంది ఉద్యోగులను తొలగించే (Layoffs) ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీకి అన్ని అనుకూలించినట్లైతే వచ్చే వారంలోనే కొంతమంది ఉద్యోగులకు సమాచారాన్ని అందజేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది నవంబరులోనే మెటా (Meta) 11,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.

పెద్ద ఎత్తున సిబ్బందిని తగ్గించుకునే యోచనలో మెటా (Meta) ఉన్నట్లు తెలుస్తోంది. అవసరం లేని బృందాలన్నింటినీ తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మధ్య మెటాకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం చాలావరకూ తగ్గింది. దీంతో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే వ్యయ నియంత్రణ చర్యలు అనివార్యమయ్యాయి. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని భావిస్తోంది. 

మరోవైపు వర్చువల్‌ రియాలిటీ వేదిక మెటావర్స్‌పై మెటా భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. దీని పరిశోధన, అభివృద్ధిపై పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను వెచ్చిస్తోంది. దీని నుంచి ఆదాయం రాబట్టుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వనరులను జాగ్రత్తగా వినియోగించుకొనేందుకు ఖర్చులను తగ్గించుకుంటోంది.

దిగ్గజ టెక్ కంపెనీల్లో కొన్ని నష్టాల్లో లేవు. కొన్ని నెలల్లో నష్టపోతాయనే అంచనాలూ లేవు. పైగా గడిచిన కొన్నేళ్లలో భారీ లాభాలను ఆర్జించాయి. ఇప్పుడు కూడా వాటి దగ్గర భారీగానే నగదు నిల్వలు ఉన్నాయి. అయినా సరే... ఉద్యోగుల సంక్షేమం గురించి అస్సలు ఆలోచించడం లేదు. తాజా పరిస్థితుల్లో కాస్త ఆదాయం తగ్గుతుందనే హెచ్చరికలతో ఎడాపెడా ఉద్యోగాలు పీకేస్తున్నాయి దిగ్గజ ఐటీ కంపెనీలు.