సుక్క, ముక్కకే వంద కోట్లు! ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా ఖర్చు

సుక్క, ముక్కకే వంద కోట్లు! ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా ఖర్చు
  • రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా ఖర్చు
  • డైలీ ప్రచారంలో ఏకంగా 3 లక్షల మంది
  • రోజూ బ్రేక్ఫాస్ట్లు.. నాన్వెజ్తో లంచ్, డిన్నర్లు
  • లిక్కర్, స్టఫ్, కూల్డ్రింక్స్ బిల్లులు అడిషనల్
  • గ్రాడ్యుయేట్లకు గ్రాండ్ పార్టీలిస్తున్న క్యాండిడేట్లు
  • ఫంక్షన్ హాల్స్, లాడ్జీల్లో సిట్టింగులు
  • ఓటర్లను బట్టి ఆకట్టుకునేలా విందులు

హైదరాబాద్, వరంగల్ రూరల్, వెలుగు: గ్రాడ్యుయేట్ల ఓట్లను రాబట్టేందుకు పార్టీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. గ్రాండ్ విందులతో గాలం వేస్తున్నాయి. ఫంక్షన్ హాల్స్, బాంకెట్ హాల్స్, రెస్టారెంట్లు, లాడ్జీల్లో సిట్టింగ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ప్రచారంలో సుక్క, ముక్క, తిండి ఖర్చే రూ.100 కోట్లు దాటుతోంది. రెండు సీట్లకే ఇంత ఖర్చా? అని అనిపించినా.. క్యాంపెయినింగ్ తీరు చూస్తే ఇంతకు ఎక్కువే ఉండొచ్చని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. 20 జిల్లాల్లోని 60 అసెంబ్లీ స్థానాల పరిధిలో రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతుండడం, అన్ని పార్టీల క్యాండిడేట్లు, ఇండిపెండెంట్లు ఎలాగైనా గెలవాలనే కసితో ఉండటంతో లెక్కకు మించి ఖర్చు పెడుతున్నారు. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా రోజూ వందల సంఖ్యలో సభలు, సమావేశాలు, సిట్టింగులు పెడుతున్నారు. అక్కడికొచ్చే కేడర్, జనాల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం చికెన్ ముక్కతో లంచ్ అరేంజ్ చేస్తున్నారు. ఇక రాత్రిళ్లు వందల్లో ఉండే సెకండ్ కేటగిరీ లీడర్లు, బల్క్ ఓట్లు ఉండే ఇన్స్టిట్యూట్ల సిబ్బందితో సుక్క, ముక్క డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు.

వందల్లో సభలు..
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ సీటు నుంచి 93 మంది, ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం సీటు నుంచి 71 మంది బరిలో ఉన్నారు. ఎన్నికలు జరిగే 20 జిల్లాల పరిధిలో 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అభ్యర్థులు వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి డైరెక్ట్గా పాల్గొనే సమావేశాలతో సంబంధం లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు తమ నియోజకవర్గాల్లో పెద్ద మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికివారుగా ఒక్కో నియోజకవర్గంలో 7 నుంచి 10 సభలు పెడుతున్నారు. వేల మందిని పిలుస్తున్నారు. ఈ సమావేశాల్లో 1.2 లక్షల మంది అధికార పార్టీ నుంచే డైలీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే తరహాలో బీజేపీ అభ్యర్థులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాంచందర్రావు, కాంగ్రెస్ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డి, లెఫ్ట్ పార్టీల నుంచి జయసారథిరెడ్డి, నాగేశ్వర్రావు వేలమందితో పోటాపోటీగా ప్రచార సభలు పెడుతున్నారు. వీరి సభలకు కనీసం లక్ష నుంచి లక్షన్నర మంది మీటింగులకు వస్తున్నారు. వరంగల్ సీటు నుంచి ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న, రాణీరుద్రమ, చెరుకు సుధాకర్తో పాటు వందల మందితో గ్రాండ్ ప్రచారం చేసే సత్తా ఉన్న అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి సభలకు వచ్చేవారు మరో 30 వేల మంది నుంచి 40 వేల మంది ఉంటున్నారు. అంటే రోజూ 3 లక్షల మంది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

బిల్లంతా డిన్నర్లలోనే..
రోజూ 3 లక్షల మంది ప్రచారానికి హాజరవుతుండటంతో.. ఆ లెక్కన రోజుకు రూ.3 కోట్ల చొప్పున 30 రోజులకు 90 కోట్లు ఖర్చు అవుతోంది. ఇందులో పావువంతు మందికి డైలీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, టీ, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్సప్లై చేస్తున్నారు. అందరు అభ్యర్థులకు 30 రోజుల్లో ఇవి తక్కువలో తక్కువ రూ.10 కోట్లు. మొత్తంగా ఇక్కడికే రూ.100 కోట్ల ఖర్చు కనపడుతోంది. అసలైన బిల్లంతా డిన్నర్లలోనే  పెడుతున్నారు. వందలకొద్దీ గ్రాడ్యుయేట్ ఓట్లున్న కాలేజీలు, ఇన్స్టిట్యూషన్లలో 100 నుంచి 200 మందికి చొప్పున సుక్క, ముక్క డిన్నర్లు నడుస్తున్నాయి. సొంత పార్టీలోనూ పొద్దంతా కష్టపడి నైట్ రిలాక్స్ అయ్యే టీంలకు రోజూ రాత్రి సిట్టింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. స్థాయిని బట్టి పార్టీలను దగ్గర్లోని రెస్టారెంట్లలో అరేంజ్ చేస్తున్నారు. లిక్కర్, స్టఫ్, ఇతర డ్రింక్స్ కలిపి ఈ ఖర్చు రూ.20 కోట్ల నుంచి 30 కోట్లు దాటుతోంది. అంటే ప్రచారంలో 30 రోజుల తిండి ఖర్చు రూ.100 కోట్ల నుంచి 130 కోట్లు దాటుతోందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

ఇన్‘చార్జ్’లే ఎక్కువ!
ఓటర్ల కంటే సొంత పార్టీ కేడర్కే ఎక్కువ ఖర్చు అవుతోందని క్యాండిడేట్లు వాపోతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ స్థానంలో 5,31,268 మంది, వరంగల్ సీటులో 5,05,565 మంది ఓట్లర్లు ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ ప్రతి 25 మంది ఓటర్లకు ఒకరిని, కాంగ్రెస్ ప్రతి 30 మందికి ఒకరిని, బీజేపీ ప్రతి 50 మందికి ఒకరిని ఇన్చార్జ్లుగా నియమించాయి. ప్రతి 10 మంది ఇన్చార్జ్ల మీద మరో లీడర్ను పెట్టాయి. మొత్తంగా ఇన్చార్జ్ల అందరి మీద మరో పెద్ద లీడర్ను అపాయింట్ చేశాయి. ఈ లెక్కన సుమారు లక్ష మంది వరకు ఇన్చార్జ్లే ఉంటున్నారు. వీరికి 30 రోజులపాటు ఈజీగా రూ.30 కోట్లు అవుతుందని చెబుతున్నారు.

గెట్ టు గెదర్ మాదిరి విందులు
వరంగల్ సీటుకు సంబంధించిన ఓ పోలింగ్ కేంద్రం పరిధిలో 900 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో గ్రూపుకు 30 మంది చొప్పున మొత్తం 30 గ్రూపులుగా విభజించారని సమాచారం. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇతర ప్రొఫెషన్లలో ఉన్న ఓటర్లకు అనుగుణంగా విడతల వారీగా విందులు నిర్వహించేందుకు అధికార పార్టీ నేతలు షెడ్యూల్ చేసినట్లుగా తెలిసింది. దీని కోసం హైదరాబాద్ శివారులోని ఏసీ బ్యాంకెట్ హాల్ లో 6 గ్రూపుల్లో ఉన్న ఓటర్లను ప్రొఫైల్ వారీగా ఆదివారం లావిష్ డిన్నర్ ఇచ్చారని సమాచారం. ఈ ఎన్నికల విందులను ‘గెట్ టు గెదర్’ పార్టీల మాదిరి ఫీలయ్యేలా ఆర్గనైజ్ చేశారు. ఇక మేడ్చల్ జిల్లాకు చెందిన టీచర్ల కోసం ఘట్ కేసర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఖరీదైన విందు ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది. లిమిటెడ్ మెంబర్లతో సాగిన ఈ పార్టీని విమెన్స్ డే వేడుకల్లో భాగంగానే జరిపించేశారు.

రూ.70 లక్షలు, 10 వేల లీటర్ల లిక్కర్ సీజ్
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత 3 రోజుల్లోనే అక్రమంగా తరలిస్తున్న రూ.70 లక్షల నగదు పట్టుబడింది. మంగళవారం నాటికి 10,352 లీటర్ల లిక్కర్ను పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్సర్వేలెన్స్ టీమ్స్ స్వాధీనం చేసుకున్నాయి. ఈ లిక్కర్ విలువ రూ.34 లక్షలు ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

వాట్సాప్, టెలిగ్రాం గ్రూపులు
ఓటర్ల సంఖ్యను బట్టి పార్టీలన్నీ ప్రత్యేకమైన వాట్సాప్, టెలిగ్రాం గ్రూపులను మెయింటేన్ చేస్తున్నాయి. ఆ గ్రూపుల్లో ఉన్న ఓటర్లకు కావాల్సినవన్నీ గ్రూపు అడ్మిన్లే చూసుకుంటున్నారు. స్టూడెంట్ ఓటర్ల కోసం స్థానిక అధికార పార్టీ నేతకు బాధ్యతలు అప్పగిస్తే, ఉద్యోగులు, ఇతర ప్రొఫెషన్లకు చెందిన గ్రూపుల్లో వారికి ఆ వర్గానికి చెందిన వారే వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. ఓవైపు ఎన్నికల ప్రచారం నడుస్తున్నా.. రహస్యంగా సాగే ఇలాంటి విందులకే పార్టీలన్నీ ప్రాధాన్యం ఇస్తున్నాయి.

200 ఓట్లకు 10 లక్షల ఆఫర్!
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో స్టూడెంట్ యూనియన్లు కీలకంగా మారాయి. ఓట్లు వేయిస్తే లక్షలు ముట్టజెప్పేందుకు లీడర్లు రెడీ అయినట్లు సమాచారం. కాకతీయ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ లీడర్కు 200 ఓట్లు వేయించేందుకు రూ.10 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఉస్మానియా, ఎంజీ యూనివర్సిటీ లీడర్లకు కూడా ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయి. ‘‘ప్రచారానికి రాకున్నా పర్లేదు.. ఓట్లు వేయించండి.. ఏం కావాలో చెప్పండి చాలు’’ అని ఫోన్లు వస్తున్నాయని ఒక స్టూడెంట్ లీడర్ తెలిపారు.