
ములుగు, వెలుగు: నాటుబాంబు పేలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంటమల్ల సాంబయ్య వ్యవసాయంతో పాటు వడ్రంగి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. తన పంట పొలాన్ని అడవి పందులు ధ్వంసం చేస్తుండడంతో వాటిని తరిమేసేందుకు నాటు బాంబు తెప్పించి ఇంట్లో పెట్టాడు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న వస్తువులను సర్దుతుండగా.. నాటుబాంబు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో సాంబయ్య కాలు నుజ్జునుజ్జయింది.
గమనించిన స్థానికులు సాంబయ్యను ములుగు జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనతో కేసు అవుతుందని భయపడిన బాధితుడు మొదట పొలానికి గడ్డి మందు కొడుతుండగా నాటు బాంబు పేలిందని ప్రచారం చేయడంతో విషయం తెలుసుకున్న ములుగు సీఐ సురేశ్, ఎస్సై వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకొని బాధితుడి ఇంటిని పరిశీలించగా రక్తం ఆనవాళ్లు కనిపించాయి. అనంతరం సాంబయ్య కుటుంబ సభ్యులను విచారించి.. బాంబు ఇంట్లోనే పేలిందని గుర్తించారు.