
- స్కూళ్ల మూతతో రోడ్డునపడ్డ లక్షన్నర మంది
- బతుకుదెరువు కోసం తండ్లాట
- ఏడాది ఫీజు వసూలు చేసి జీతాలివ్వరా అని ఆవేదన
- సర్కార్ ఆదుకోవాలని డిమాండ్
- ఎమ్మెల్సీ ఎన్నికలకు పనికొచ్చిన మేం.. ఇప్పడు అక్కరకు వస్తలేమా?
- అన్నీ ఓపెన్ ఉంచి బడులు బందా?
- కోర్టుకు వెళ్లే ఆలోచనలో బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్లు
హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు మూత పడడంతో ప్రైవేట్ టీచర్ల బతుకులు మళ్లా ఆగమైనయ్. మంగళవారం (మార్చి 23న) రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను తాత్కాలికంగా మూసేస్తున్నామని ప్రకటించగానే మేనేజ్మెంట్లు టీచర్లను ఉద్యోగాలకు రావొద్దని చెప్పేశాయి. దీంతో లాక్డౌన్ తర్వాత ఉద్యోగంలో చేరి నెలన్నరోజులు కూడా కాకుండానే వాళ్లు మళ్లీ రోడ్డునపడ్డారు. మాపై సర్కార్ కనీసం జాలి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలకు పనికొచ్చిన తాము ఇప్పుడు పనికిరాని వాళ్లమైపోయామని బాధపడుతున్నారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది దాకా ప్రైవేటు టీచర్లున్నరు. వీరిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లక్షకు పైగా టీచర్లు పని చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 53.7% మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. హైదరాబాద్ పరిధిలో అయితే 82% మంది ప్రైవేటు కార్పొరేట్, బడ్జెట్ స్కూళ్లలో చదువుతున్నారు. లాక్డౌన్ టైమ్‌లో ఆన్లైన్ క్లాసులు మాత్రమే ఉండడంతో మేనేజ్మెంట్లు తమ స్టాఫ్‌లో 20 నుంచి 50% మందిని కేవలం సగం జీతంతో పనిలో పెట్టుకున్నాయి. ఫిబ్రవరిలో ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు క్లాస్లులు స్టార్ట్ అవడంతో హైస్కూల్ సెక్షన్లో 70 శాతం నుంచి వంద శాతం స్టాఫ్‌ను పిలిపించాయి. సగమే ఉన్న జీతాలు కొంత పెంచాయి. కానీ సర్కార్ మళ్లీ స్కూళ్ల బంద్ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగాలకు రావొద్దని చెప్పాయి. దీంతో మళ్లీ దిక్కులేని వాళ్లమైపోయామని టీచర్లు బాధపడుతున్నారు. పేరెంట్స్ నుంచి ఏడాది ఫీజు వసూలు చేసుకున్న మేనేజ్మెంట్లు మాకు మాత్రం జీతాలివ్వట్లేదని ఆవేదన వ్యక్త ంచేశారు. ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయిన తమను సర్కారే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. లాక్డౌన్ టైమ్‌లో చాలా మంది వేరే పనులు చూసుకున్నారు. ఏదీ దొరకని వాళ్లు ఆర్థిక భారంతో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో అని ప్రైవేటు టీచర్ల యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఫీజులన్నీ కట్టించుకున్నంక మూసేస్తరా?
స్కూళ్లు తెరిచామని చెప్పి మేనేజ్మెంట్లు తమ నుంచి ఫీజులన్ని కట్టించుకొన్నాయనీ, ఇపుడు మళ్లీ మూసేయాలని ప్రభుత్వం చెప్పడం ఎంత వరకు కరెక్టని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. కరోనా టైమ్‌లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడి ఆన్లైన్ ఫీజులు, స్కూళ్లు తెరిచాక పూర్తి ఫీజులతోపాటు మెటీరియల్, ఎగ్జామ్ ఫీజు కూడా చెల్లించామని చెబుతున్నారు. ఎంత కాలానికి ఎంత ఫీజు కట్టాలని సర్కారు నిర్ణయించి ఉంటే తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గేదని వాపోతున్నారు. ‘‘ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయో లేదో తెలీదు. కానీ వచ్చే ఏడాదికి ప్రమోట్ చేయాలంటే ఫీజు మొత్తం పే చేయాలని మేనేజ్మెంట్లు కండిషన్లు పెట్టాయి. 65 శాతం పేరెంట్స్ అనేక ఇబ్బందులు పడి ఫీజులు కట్టేశారు. చాలా స్కూల్స్ నెక్ట్స్ ఇయర్ కోసం కూడా ఇప్పుడే బుక్ లు, యూనిఫామ్ లు కొనాలని డబ్బులు వసూలు చేశాయి’’ అని హైదరాబాద్ స్టూడెంట్, పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ వెంకట్ అన్నారు.
మాకు తీవ్ర నష్టం: బడ్జెట్ స్కూళ్లు
సర్కార్ నిర్ణయంతో తమకు తీవ్ర నష్టమని బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్లు అంటున్నాయి. తమ స్కూళ్లలో దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి పిల్లలు చదువుతారనీ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ల పిల్లలుంటారని అంటున్నాయి. వీళ్ల నుంచి మామూలు రోజుల్లోనే కష్టంగా ఫీజులు వసూలవుతాయనీ, కరోనా టైమ్‌లో చాలా వరకు ఫీజులు రాలేదని చెబుతున్నాయి. స్కూళ్లు తెరిచాక పేరెంట్స్ ఇప్పుడిప్పుడే ఫీజులు పే చేయడం మొదలుపెట్టారు. అంతలోనే సర్కార్ ప్రకటనతో తమ పరిస్థితి దారుణంగా మారిందంటున్నారు. పార్కులు, హోటళ్లు, సినిమా థియేటర్లు, బార్లు.. అన్నీ ఓపెన్ చేశారు. మార్కెట్లు కిటకిట లాడుతున్నాయి. మరీ స్కూళ్లనే ఎందుకు మూసేస్తోందని మేనేజ్మెంట్ అసోసియేషన్లు ప్రశ్నిస్తున్నాయి. ఈళ్లను, ప్రవేటు టీచర్లను ఇద్దరని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
బంద్ పెట్టి బతుకుల మీద కొట్టిన్రు
ఇంట్ల ఎలుకలు ఉన్నయని ఇల్లు కాలవెట్టినట్లుంది సర్కార్ తీరు. అటు మేనేజ్మెంట్లు, ఇటు పిల్లలు ఈ నిర్ణయంతో ఆగమైపోతరు. జీతాలు ఇవ్వలేక, రెంట్లు కట్టలేక, ప్రాపర్టీ ట్యాక్స్ చెలించలేక అవస్థలు పడ్డాం. స్కూళ్లు తెరిచిన్రని సంతోషిస్తే, మళ్లా బందువెట్టి మాపై దెబ్బ కొట్టిన్రు. పేరెంట్స్‌కు కూడా ఇది ఇష్టం లేదు. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది.-నర్సిరెడ్డి, ట్రస్మా ట్రెజరర్, కరస్పాండెంట్, స్వామి వివేకానంద స్కూల్, కుత్బుల్లాపూర్
రోడ్డున పడ్డాం
‘‘సర్కార్ నిర్ణయంతో అందరం మళ్లా రోడ్డునపడ్డం. స్కూళ్లు బంద్ అయితే మేనేజ్మెంట్లకు తప్ప ఎవరికీ లాభం లేదు. ఫిబ్రవరిలో స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాక పేరెంట్స్ నుంచి ఫుల్ ఫీజులు వసూలు చేశారు. టీచర్లుకు సగం జీతం కూడా ఇవ్వలేదు. నెక్ట్స్ అకడమిక్ ఇయర్ ఉంటుందో లేదో తెలియదు. ప్రభుత్వానివి పద్ధతి, ప్లానింగ్ లేని ఆలోచనలు. ఎన్నికల కోసమే ఓపెన్ చేసి క్లోజ్ చేసినట్లు ఉంది’’ - ‑షబ్బీర్ అలీ , టీపీటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్