ఉక్రెయిన్–రష్యా వార్ ఆగేదెన్నడో..?

ఉక్రెయిన్–రష్యా వార్ ఆగేదెన్నడో..?

ఉక్రెయిన్-రష్యా నెలరోజుల నుంచి యుద్ధం కొనసాగుతోంది. రాజధాని కీవ్ పై పట్టుకోసం పుతిన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ ను సులభంగానే చేజిక్కించుకోవచ్చని భావించిన రష్యా బలగాలకు.... జెలెన్ స్కీ సేనల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు.. వేలాదిగా తరలివచ్చిన రష్యా ట్యాంకర్లకు ముందుకు కదలనీయకుండా ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. దీంతో పుతిన్ సేనలు యుద్ధ రీతిని మార్చుకుంటూ అణువిద్యుత్ కేంద్రాలు, ప్రభుత్వ భవనాలపై బీకర దాడులు చేస్తోంది. అయినా ఉక్రెయిన్ పై పూర్తిస్థాయిలో ఇప్పటికీ పట్టుసాధించలేకపోయింది. 

గత నెల 24న ప్రారంభమైన రష్యా దండయాత్ర.. మిసైళ్లు, బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్ కు అపారనష్టం జరిగింది. అక్కడి ప్రజలు ప్రాణభయంతో దేశాన్ని వీడి వెళ్తున్నారు. ఇప్పటి వరకు 35 లక్షల మంది దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది. దేశంలోనే చెల్లాచెదురైన వాళ్లు 65 లక్షల మంది ఉన్నారు. ఇండ్లు విడిచి వెళ్లిన వారు దాదాపు కోటి మంది ఉంటారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇక అందమైన నగరాలు బాంబుల దాడికి మొండిగోడలుగా మారాయి. సుమారు 8 లక్షల 42 వేల కోట్లు ఉక్రెయిన్ కు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో 691 మంది పౌరులు చనిపోయారు. గాయపడ్డ వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇటు రష్యా కూడా భారీగా నష్టపోయిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇప్పటి వరకు 15 వేల మందికిపైగా రష్యా సేనలను మట్టుబెట్టామని జెలెన్ స్కీ ఆఫీసర్స్ ప్రకటించారు. 

డిమాండ్లపై కాస్త వెనక్కి తగ్గిన ఉక్రెయిన్.... రష్యాను శాంతి చర్చలకు ఆహ్వానిస్తోంది. నేరుగా పుతిన్ తోనే మాట్లాడుతా అంటూ జెలెన్ స్కీ ప్రకటించారు. అయినా రష్యా దూకుడుగా ముందుకెళ్తోంది. యుద్ధనేరాలకు పాల్పడుతున్న రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచదేశాలు ఆందోళనలు చేయాలని జెలెన్ స్కీ కోరారు. ఈ విపత్కర సమయంలో ఉక్రెయిన్ అండగా ఉండాలని ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశారు. అమెరికా సహా...నాటో, ఈయూలు కఠిన ఆంక్షలు విధించినా రష్యా దూకుడు తగ్గలేదు. ఉక్రెయిన్ పై మాస్కో దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి, సాధారణ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఓటింగ్ కు చైనా, భారత్ దూరంగా ఉంటూ వస్తున్నాయి. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం అంటూ ఉభయదేశాలు పిలుపునిచ్చాయి. 

రష్యా సహనం నశిస్తోందని.. మరింత బీకరదాడులు చేసే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. రాజధాని కీవ్ ను కొల్లగొట్టి, జెలెన్ స్కీ సర్కార్ స్థానంలో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్ భావిస్తున్నారు. అయితే ఇవేవి సాకరమయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో....ప్లాన్ –బీ ని రష్యా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ దేశాలు-రష్యా పట్ల ఉక్రెయిన్ తటస్థ వైఖరిని అనుసరించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదు. దక్షిణ, తూర్పు భూ భాగాల విషయంలో రష్యా వాదనలను కీవ్ అంగీకరించాలి.. లాంటి డిమాండ్లను ఉక్రెయిన్ ముందు ఉంచింది. 

వాణిజ్య నిషేధం విధించటం ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.... జపాన్ కు విజ్ఞప్తి చేశారు. ఇక నాలుగు రోజుల పర్యటనకు ఐరోపా వెళ్లారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రష్యా దురాక్రమణపై తమ భాగస్వామ్య దేశాల అధినేతలతో చర్చించనున్నారు. ఉక్రెయిన్పై రష్యా రసాయనిక ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని, అదే నిజమైన ముప్పు అని పేర్కొన్నారు బైడెన్.... ఉక్రెయిన్  కాన్సులేట్ ను బెలారస్  మూసివేసింది. తమ దేశం వదిలి వెళ్లిపోవాలంటూ పలువురు ఉక్రెయిన్  దౌత్యవేత్తలకు సూచించింది. ఉక్రెయిన్ పై  దాడిలో రష్యాకు మద్దతుగా బెలారస్ కూడా త్వరలో రంగంలోకి దిగే అవకాశం ఉందని నాటో, అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ పై అణు, రసాయన ఆయుధాల్ని ప్రయోగిస్తామంటూ రష్యా బెదిరిస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో నాటో అండగా నిలిచింది. అణు, రసాయన దాడుల నుంచి రక్షణపొందేలా సామాగ్రిని సరఫరా చేయనున్నట్టు నాటో సెక్రటరీ జనరల్  తెలిపారు.

ఉక్రెయిన్ పై మాస్కో దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఓటింగ్ కు భారత్ మరోసారి దూరంగా నిలిచింది. యుద్ధాన్ని వెంటనే విరమించాలని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా అన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

నువ్వా–నేనా!: అంబానీ–అదానీల మధ్య ముదురుతున్న పోటీ

సమ్మర్‌‌‌‌లో సమంత సిటాడెల్‌!