ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా?

ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా?

శాసన సభలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. పదే పదే ఎన్నికల్ని ఫేస్‌‌ చేయడంవల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది. అందుకే ‘ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు’ అనే ప్రపోజల్​ను రాజకీయ పార్టీల ముందు పెడుతున్నాను.-  ప్రధాని మోడీ

దేశంలో 29 రాష్ట్రాలు, ఏడు యూనియన్‌‌ టెర్రిటరీలు… ఏటా ఏదో ఒకచోట అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇవిగాక, జనరల్‌‌ ఎలక్షన్స్‌‌ అదనం. జమ్మూ కాశ్మీర్‌‌ మినహా మిగతా అన్నింటికీ అయిదేళ్ల కాల పరిమితిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. పదే పదే ఎన్నికల్ని ఫేస్‌‌ చేయడంవల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ‘ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు’ అనే ప్రపోజల్‌‌ తెచ్చారు. అయితే, దేశంలో కొయిలేషన్‌‌ ప్రభుత్వాలేర్పడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ సామంత రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రతిపాదన అమలు కావడం సాధ్యమేనా?!

ఇంత పెద్ద దేశంలో అసెంబ్లీలకు లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మామూలు విషయం కాదని పొలిటికల్ పండితుల అభిప్రాయం. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం చాలా సమస్యలకు ఇదే పరిష్కారమని బలంగా నమ్ముతున్నారు. ఒకేసారి ఎన్నికలు దేశానికి మంచి చేస్తాయని ప్రధాని మోడీ గట్టిగా నమ్మారు. అందుకే ఈ విషయంలో మూడేళ్లుగా ఆయన రాజకీయ పార్టీలను ఒప్పించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ కలిసికట్టు ఎన్నికల అజెండాతో అన్ని రాజకీయ పార్టీలతో ఒక మీటింగ్ కూడా పెట్టారంటే ఆయన ఈ విషయంలో ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మీటింగ్ కు వచ్చిన 21 పార్టీల్లో కేవలం మూడు రాజకీయ పార్టీలు మాత్రమే ఈ జంట ఎన్నికలకు ‘ నో ’ చెప్పాయి. 19 పార్టీలు సరేననడంతో  ప్రధానికి గట్టి మద్దతు వచ్చినట్లే లెక్క. అసలు ఇలా ఒకసారి అసెంబ్లీలకు, లోక్ సభకు ఎన్నికలు జరిపించడం సాధ్యమేనా ? అనే విషయం తేల్చడానికి ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసి మరో అడుగు ముందుకేసింది. లోక్‌‌సభతో పాటు అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్న వారంతా తమ వాదనను బలపరుస్తూ నాలుగు  అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

1 వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో పని. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే  ఖర్చులు తగ్గుతాయి. ఎన్నికల పేరుతో జరిగే దుబారాను తగ్గించవచ్చు. దీంతో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటున్నారు ఈ ప్రక్రియను సమర్థిస్తున్న వారు.

2 మొత్తం 29  రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎప్పుడూ ఏదో ఒక మూల  ఎన్నికలు జరుగుతుంటాయి. 2014లో 16వ లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. 2015 జనవరి – ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది సెప్టెంబర్ – నవంబర్ లో బీహార్ అసెంబ్లీకి, 2016  ఫిబ్రవరి – మార్చిలో అసోం, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. 2014 మార్చి నుంచి 2017 మార్చి వరకు మొత్తం 19 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో  రాజకీయ నాయకులు, అధికారులు అందరూ ఎన్నికలపైనే దృష్టి పెడుతుంటారు. పరిపాలనను ఎవరూ పట్టించుకోరు.  అతి ముఖ్యమైన గవర్నెన్స్  గాడి తప్పుతుంది.

3 ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కోడ్ అమల్లో ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా చాలా రకాల అభివృద్ధి పనులు, పథకాలు ఆగిపోతాయి. ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడానికి ప్రభుత్వానికి కోడ్ అడ్డంకిగా మారుతుంది. దీని వల్ల ప్రజలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు సకాలంలో అందవు.

4 మానవ వనరుల ఆదా. దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా భద్రతా బలగాలను అక్కడకు తరలించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఫోర్స్‌‌ని, సంబంధిత సిబ్బందిని ఆయా రాష్ట్రాలకు పంపాల్సి ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే బెటర్ అనే అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు.

డేంజర్‌‌లో ఫెడరలిజం

ఒకేసారి ఎన్నికలు జరపడమనేది ఫెడరలిజం స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. లోక్‌‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల మైండ్‌‌సెట్ డిఫరెంట్‌‌గా ఉంటుందన్నారు వీళ్లు.  లోక్‌‌సభ ఎన్నికలప్పుడు ప్రజలు జాతీయ అంశాలపై రియాక్ట్ అవుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలే హై లెట్ అవుతాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల లోకల్ ఇష్యూస్ మరుగున పడి కేవలం నేషనల్ ఇష్యూసే హై లెట్ అయ్యే  ప్రమాదం ఉందన్నది ఒకేసారి ఎన్నికల ప్రక్రియను వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్న మాట. ఎన్నికల్లో లోకల్ ఇష్యూస్ కనుమరుగైతే ఆ ప్రభావం ఆయా రాష్ట్రాల ప్రయోజనాల కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీలపై పడుతుందన్నది వారి అభిప్రాయం. ప్రాంతీయ పార్టీల మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయన్నారు. చివరకు ఒకే ఒక రాజకీయ పార్టీ లేదా కూటమి మాత్రమే మిగిలే పరిస్థితులు వస్తాయన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఫెడరలిజానికి ఇది పూర్తిగా విరుద్ధమని వాదించారు.

సంకీర్ణ ప్రభుత్వాల సంగతేంటి?

1970ల నుంచి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు మొదలయ్యాయి. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు కేంద్రంలో యూపీఏ పేరుతో సంకీర్ణ ప్రభుత్వాలే నడిచాయి. బీజేపీ 2014, 2019  ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించినా నడుస్తున్నది ఎన్డీయే ప్రభుత్వమే. ఒకేసారి ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి ఆ తర్వాత అవి పడిపోతే పరిస్థితి ఏంటి?  రాజ్యాంగ సంక్షోభం ఏర్పడదా? మనదేశంలో రాజకీయ వాతావరణం ఎప్పుడూ ఎత్తులు, వ్యూహాలతోనే ఉంటుంది. అవకాశం వస్తే ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్ష పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పొట్టుకోవడం కూడా మామూలు విషయం. రాజకీయాలు ఇంత కాంప్లికేటెడ్‌‌గా ఉండే మన దేశంలో ఒకేసారి ఎన్నికలు ప్రాక్టికల్‌‌గా ఆచరణ సాధ్యం కాదంటున్నవారు ఈ కాన్సెప్ట్‌‌ని వ్యతిరేకించేవారు.

2016 నుంచి ‘ జంట ఎన్నికల ’ సందడి

మూడేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఒకే  ఎన్నికల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. లోక్ సభకు, శాసన సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఎన్నికల ఖర్చు తగ్గుతుందన్నారు. అప్పటి నుంచీ ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

30 నెలలకొకసారి ఎన్నికలు?

గతంలో ‘దేశమంతా ఒకేసారి ఎన్నికలు’ అనే అంశం తెరమీదకు వచ్చినప్పుడు ఇందుకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఓ సూచన చేసింది. ప్రస్తుతం అయిదేళ్లకొకసారి అంటే 60 నెలలకొకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అనుకోని పరిస్థితులు ఎదురైతే తప్ప, గడువు వరకు చట్టసభలు కొనసాగుతున్నాయి. ఇకమీదట ప్రతి 30 నెలలకు అంటే, రెండున్నరేళ్లకొకసారి ఓసారి ఎన్నికలు పెట్టుకోవచ్చన్నది ఆ సూచన  సారాంశం. గడువు ముగియక ముందే కేవలం ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి పెంచడం లేదా తగ్గించడం రాజ్యాంగ హక్కులను దెబ్బతీయడమే అవుతుంది.

అదే నమ్మకంతో ముందుకెళ్తారా!

మోడీ ప్రపోజల్‌‌ ప్రకారం ముందుకెళ్తే… లోక్‌‌సభ సహా చాలా అసెంబ్లీలకు ముందస్తు ఎన్నికలు జరగాలి.  అధికార పార్టీ తిరిగి అధికారంలోకి రావడమనేది అదృష్టాన్నిబట్టి ఉంటుంది.  2019లో వచ్చినట్లుగా ముందస్తు ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా? 1977, 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009 సం.ల్లో జరిగిన ఏ ఒక్క లోక్‌‌సభ ఎన్నికలోనూ సంపూర్ణ మెజారిటీతో ఏక పార్టీ ప్రభుత్వం ఏర్పడలేదు. మొరార్జీ దేశాయ్‌‌, చరణ్‌‌ సింగ్‌‌, వి.పి. సింగ్‌‌, చంద్రశేఖర్‌‌, పి.వి.నరసింహారావు, వాజపేయి, హెచ్‌‌.డి.దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌‌, మన్మోహన్‌‌ సింగ్‌‌, నరేంద్ర మోడీ నడిపిన ప్రభుత్వాలన్నీ వివిధ పార్టీలను కూడగట్టుకుని సాగిన సంకీర్ణ ప్రభుత్వాలే. ఒక్క పి.వి.నరసింహారావు మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని తట్టుకుని మైనారిటీ ప్రభుత్వాన్ని 1991-–96 నడుమ పూర్తిగా అయిదేళ్లపాటు నడపగలిగారు!

కలిసొచ్చేవాళ్లు ఎందరు?

ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ-కాశ్మీర్‌‌, జార్ఖండ్‌‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. ఆపైన 2020 మొదటి ఆర్నెల్లలో ఢిల్లీ, పుదుచ్చేరిలకు, చివరి ఆర్నెల్లలో బీహార్‌‌కి ఎన్నికలు జరపాలి. ఉదాహరణకు ఈ ఏడు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్నా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. ఇదే ఏడాది చివరలోనే నాలుగు రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, పుదుచ్చేరి, బీహార్‌‌లకుకూడాఎలక్షన్స్‌‌ నిర్వహించాలంటే వాటిని బాగా ముందుకు జరపాలి. అలా కాకుండా మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్‌‌, జార్ఖండ్‌‌లకు ఢిల్లీ, పుదుచ్చేరిలతోపాటే ఎలక్షన్‌‌ పెట్టాలంటే  ఆ నాలుగింటి  అసెంబ్లీ కాలపరిమితిని కనీసం మూడు నెలలు పెంచాలి. అసెంబ్లీలకు ముందస్తు తప్ప, గడువు పెంచడానికి వీలు లేదు. రాష్ట్రపతి పాలన విధించినప్పుడే సాధ్యపడుతుంది. ఇటువంటి పితలాటకాలు చాలా ఉన్నాయి.  కాదూ కూడదు 2020లో బడ్జెట్‌‌కి ముందే  ‘దేశమంతా ఒకటేసారి ఎన్నికలు’ జరపాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లయితే…లోక్‌‌సభకుకూడా మధ్యంతర ఎన్నికలు జరపాల్సి వస్తుంది.  అంటే దాదాపు నాలుగేళ్లకు ముందే 17వ లోక్‌‌సభకు కాలం చెల్లిపోతుంది. అలాగే, నాలుగు రాష్ట్రాలకు గడువు పెంచాలి. ఇక ప్రి–మెచ్యూర్డ్‌‌ అసెంబ్లీలలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌‌, హిమాచల్‌‌ ప్రదేశ్‌‌, ఉత్తరప్రదేశ్‌‌, అస్సాం, ఛత్తీస్‌‌గఢ్‌‌, గోవా, త్రిపుర, ఉత్తరాఖండ్‌‌; ప్రతిపక్ష కాంగ్రెస్‌‌ అధికారంలో ఉన్న పంజాబ్‌‌, మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్‌‌,లు; ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రపదేశ్‌‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌‌, ఒడిశాతోపాటుగా, ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలు ఉన్నాయి. మోడీతో నిత్యం యుద్దం చేస్తున్న మమతా బెనర్జీ (తృణమూల్‌‌), అరవింద్‌‌ కేజ్రీవాల్‌‌ (ఆప్‌‌), వామపక్షాలు ససేమిరా ముందస్తు ఎన్నికలను అంగీకరించే అవకాశాలు లేవు

అమెరికా పద్ధతి వేరే

అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు తావులేని ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. అక్కడ నాలుగేళ్లకొకసారి మాత్రమే ప్రెసిడెంట్‌‌ కోసం సంక్లిష్టమైన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. ఒకవేళ ప్రెసిడెంట్‌‌ చనిపోయినా, లేక వివిధ కారణాలతో దిగిపోయినాగానీ ఎలక్షన్‌‌ జరగదు. వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ ప్రమోషన్‌‌ పొందుతారు. జాన్‌‌ ఎఫ్‌‌ కెన్నడీ అమెరికా 35వ ప్రెసిడెంట్‌‌గా 1961లో బాధ్యతలు చేపట్టి, 1963 నవంబర్‌‌లో హత్యకు గురయ్యారు. వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ లిండన్‌‌ జాన్సన్‌‌ అధ్యక్షుడిగా ప్రమోట్‌‌ అయ్యారు. కెన్నడీ కాలపరిమితి ప్రకారం 1964 వరకు ఎన్నికలు జరగలేదు .ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జాన్సన్‌‌ గెలిచి 36వ ప్రెసిడెంట్‌‌గా బాధ్యతలు స్వీకరించారు. రిచర్డ్‌‌ నిక్సన్‌‌ 1972లో రెండోసారి గెలిచాక,  వాటర్‌‌గేట్‌‌ స్కాంతో అర్ధంతరంగా 1974లో తప్పుకోవలసి వచ్చింది. అప్పుడుకూడా వైస్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్న గెరార్డ్‌‌ ఫోర్డ్‌‌ ప్రెసిడెంట్‌‌ అయ్యారు. మన దగ్గర అటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రపతి మొదలుకొని గ్రామ సర్పంచ్‌‌ వరకు ఎవరైనా ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలో ఎన్నిక కావలసిందే.  అప్పటివరకు తాత్కాలిక బాధ్యతలు నిర్వహించేవారిని ఆపద్ధర్మ లేదా యాక్టింగ్‌‌గానే వ్యవహరిస్తారు.

 ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే… మన దేశంలో ప్రజలు ‘హంగ్‌‌’ తీర్పునిచ్చినపుడు, రాష్ట్రపతి లేదా గవర్నర్‌‌ ఏకైక పెద్ద పార్టీ లేదా ఫ్రంట్‌‌ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తారు. గడువులోగా మెజారిటీని నిరూపించుకోలేని పక్షంలో తదుపరి పెద్ద పార్టీకి లేదా ఫ్రంట్‌‌కి అవకాశం దక్కుతుంది. అప్పటికీ స్థిరత్వం సాధ్యం కాకపోతే అనివార్యంగా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. 1980లో జనతా పార్టీ, 1991లో నేషనల్‌‌ ఫ్రంట్‌‌, 1998లో యునైటెడ్‌‌ ఫ్రంట్‌‌, 1999లో ఎన్‌‌డిఏ ప్రభుత్వాలు అన్ని అవకాశాలను జారవిడుచుకున్న తర్వాతనే మధ్యంతర ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇది ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా పొలిటికల్‌‌ లీడర్‌‌షిప్‌‌ వ్యవహరించడానికి చేసుకున్న ఏర్పాటు. ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకుపోతున్న తరుణంలో సంకీర్ణ ప్రభుత్వాలకు మనుగడ కష్టసాధ్యం. అన్ని వేళల్లోనూ మన్మోహన్‌‌ (యూపీయే), మోడీ (ఎన్డీయే)లకు సహకరించినట్లుగా అలయెన్స్‌‌ భాగస్వాములు సహకరించకపోవచ్చు. ప్రభుత్వాలు నిలబడడానికి ఎన్ని చాన్స్‌‌లున్నాయో, కూలిపోవడానికి అంతకుమించిన అవకాశాలున్నాయి. అందువల్ల ‘జంట ఎన్నికల విధానం’వల్ల అయిదేళ్ల కాలపరిమితి సాధ్యం కాదు. మోడీ ఆశిస్తున్నట్లుగా అభివృద్ధి వేగం పుంజుకోవడానికి ఇది శాశ్వత పరిష్కారం కాబోదంటున్నారు ఎనలిస్టులు.