జమిలిపై కమిటీలో.. అమిత్‌‌ షా, ఆజాద్​

జమిలిపై కమిటీలో.. అమిత్‌‌ షా, ఆజాద్​
  • కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్
  • చైర్మన్‌‌గా కోవింద్, సభ్యులుగా ఏడుగురు
  • అధిర్​ రంజన్​, హరీశ్ సాల్వేకు చోటు
  • కమిటీలో సభ్యుడిగా ఉండనన్న అధిర్​

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై ఏర్పాటైన హై లెవెల్ కమిటీకి సభ్యులను కేంద్రం నియమించింది. కమిటీ చైర్మన్‌‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్, సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్‌‌కే సింగ్, లోక్‌‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కఠారీ వ్యవహరించనున్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. కమిటీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ కమిటీకి సెక్రటరీగా లీగల్ అఫైర్స్ సెక్రటరీ నితేన్ చంద్ర వ్యవహరించనున్నారు. శనివారం ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

హంగ్ వస్తే ఏం చేయాలి?

8 మందితో కూడిన కమిటీ వెంటనే పని ప్రారంభించనుందని నోటిఫికేషన్‌‌లో కేంద్రం తెలిపింది. ‘‘లోక్‌‌సభ, అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయ తీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై వీలైనంత త్వరగా సిఫార్సులు చేయనుంది. రాజ్యాంగానికి, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేయాల్సిన సవరణలను పరిశీలించి సిఫార్సు చేయనుంది. ఇతర చట్టాలు, రూల్స్‌‌కు ఏవైనా సవరణలు చేయాల్సి న అవసరం ఉంటే తెలియజేయనుంది” అని పేర్కొంది. సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరమా? అనేది పరిశీలించనుందని చెప్పింది. ‘‘ఎన్నికలు జరిగిన తర్వాత హంగ్ వస్తే ఏం చేయాలి? అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందినప్పుడు ఎలా ముందుకెళ్లాలి? పార్టీ ఫిరాయింపులు జరిగితే ఏం చర్యలు తీసుకోవాలనే దానికి కమిటీ పరిష్కారాలను కనుగొని, విశ్లేషణ జరిపి, రికమండ్ చేయనుంది. తమ రికమండేషన్స్‌‌ను ఖరారు చేసే ముందు ఈ కమిటీ అందరి నుంచి అభిప్రాయాల ను తీసుకోనుంది” అని నోటిఫికేషన్‌‌లో వివరించిం ది. ‘‘ఒకేసారి ఎన్నికలను నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఏం చేయాలి. ఎంత టైంలో, ఎన్ని దశల్లో నిర్వహించాలి? వంటి వాటికి సంబంధించిన ఫ్రేమ్‌‌ వర్క్‌‌ను కమిటీ సూచించనుంది. ఈవీఎంలు, వీవీప్యాట్‌‌లతో సహా అవసరమైన లాజిస్టిక్స్, మ్యాన్‌‌పవర్‌‌ను కూడా పరిశీలించనుంది” అని తెలిపింది.

జమిలి కొనసాగేలా..

దేశంలో చివరిసారి 1967లో జమిలి ఎన్నికలు జరి గాయి. తర్వాత 1970లో లోక్‌‌సభ రద్దు కావడంతో ఆ తర్వాత సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల సైకిల్ డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు కమిటీ సూచనలు చేయనుంది. జమిలి ఎన్నికలకు చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణలను సిఫార్సు చేయనుంది. లోక్‌‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికల్లో ఓటర్లను గుర్తించేందుకు ఒకే ఎలక్టోరల్ రోల్, ఒకే ఎలక్టోరల్ ఐడెంటిటీ కార్డు ఉండేందుకు అవసరమైన రికమండేష న్స్ చేయనుంది. కమిటీ హెడ్​ ఆఫీస్​ ఢిల్లీలో ఉంటుంది. సమావేశాలు, ఇతర కార్యకలాపాలను కమిటీ సొంతంగా చేపట్టనుంది.

కేంద్రం ఆహ్వానాన్ని తిరస్కరించిన అధిర్ రంజన్

జమిలి ఎన్నికల అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీలో సభ్యుడిగా ఉండేందుకు కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత అధిర్ రంజన్ చౌధురి నిరాకరించారు. సభ్యుడిగా ఉండాలన్న కేంద్రం ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ అమలు సాధ్యం కాని అంశమని అన్నారు. కమిటీలో రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేకు చోటు కల్పించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు.

కమిటీ ఫోకస్ చేసే అంశాలు..

  • కమిటీ ఫోకస్​ చేసే అంశాలు  జమిలి ఎన్నికల్లో హంగ్ వస్తే ఏం చేయాలి?
  • అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే ఎలా ముందుకెళ్లాలి?
  • జమిలి ఎన్నికల సైకిల్ డిస్టర్బ్ కాలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి?