అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు అల్లూరి ఏజెన్సీ ఏరియాలో సోమవారం (సెప్టెంబర్ 9) కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరి కొందరు గిరిజనులు గల్లంతయ్యారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతుండగానే.. తాజాగా ఏపీలో మరో ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 10) విజయావాడలోని మాచవరంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టారు. మృతుడిని రాము అనే వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.