చెత్త సమస్యకు చెక్ పెట్టేలా వన్​ వీక్ యాక్షన్ ప్లాన్

చెత్త సమస్యకు చెక్ పెట్టేలా వన్​ వీక్ యాక్షన్ ప్లాన్
  • రోడ్లపై చెత్త పోస్తున్న వారిపై అధికారులు ఫోకస్
  •     స్వచ్ఛ ఆటోలతో 100 శాతం చెత్త సేకరించేలా చర్యలు 
  •     జీవీపీలు ఎత్తి వేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధం

హైదరాబాద్, వెలుగు: గార్బేజ్​ఫ్రీ సిటీ చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు(జీవీపీ) ఎత్తి వేసేందుకు సిద్ధమైంది. సిటీ వ్యాప్తంగా వన్​వీక్​(వర్కింగ్ డేస్) యాక్షన్ ప్లాన్ అమలుచేస్తోంది. మహిళా సంఘాలు, శానిటేషన్ సిబ్బంది పాల్గొని సక్సెస్​చేయాలని, స్వచ్ఛ హైదరాబాద్ కు పాటుపడాలని కమిషనర్ రోనాల్డ్​రోస్​పిలుపునిచ్చారు. 

జీవీపీలు తొలగింపుతోపాటు జనం రోడ్లపై చెత్త వేయకుండా స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లకు అందించేలా చూడడం యాక్షన్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా అధికారులు మొదటి రోజైన శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీలు, ఎస్ఎఫ్ఏ, లోకల్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లతో వార్డు లెవల్​మీటింగ్స్​నిర్వహించారు. కాలనీలు, స్లమ్​ఏరియాల్లో గార్జేజ్ కలెక్షన్​లోని ఇబ్బందులపై చర్చించారు. శనివారం జీవీపీ టీమ్స్ బస్తీల్లో పర్యటించనున్నాయి. స్వచ్ఛ ఆటోలకు చెత్తవేయని వారితోపాటు బహిరంగ ప్రదేశంలో చెత్త పోస్తున్నవారి ఇండ్లను అధికారులు గుర్తించనున్నారు. అలాగే స్వచ్ఛ ఆటోలను డోర్ టు డోర్ ట్యాగ్ చేస్తారు. 

మూడో రోజు  స్థానికులతో కలిసి బస్తీల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. నాలుగో రోజు స్వచ్ఛ ఆటోలకు ట్యాగ్ చేశాక కూడా చెత్తను రోడ్లపై వేసే ఇండ్లను అధికారులు గుర్తిస్తారు. ఇండ్ల ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తారు. ఐదో రోజు రంగోలి కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా బస్తీలు, కాలనీల్లోని జీవీపీ పాయింట్ల వద్ద చెత్త వేయకుండా ముగ్గులు వేయనున్నారు. ఆరో రోజు చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులను గుర్తించి చెత్తను తీసుకెళ్లేవారికి, స్వచ్ఛ ఆటోలకు అనుసంధానం చేయడంతోపాటు టౌన్ వెండింగ్ కమిటీల సమావేశం నిర్వహించనున్నారు. ఏడో రోజు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్న యాక్టివ్ పార్టిసిపెంట్లను అభినందిస్తారు. బస్తీల్లో జీవీపీల తొలగింపునకు సంబంధించి ప్రతిజ్ఞ చేయిస్తారు.

492 జీవీపీలు తొలగింపు

గ్రేటర్ లో 2,541 జీవీపీ పాయింట్లు ఉన్నట్లు బల్దియా గుర్తించింది. ఇప్పటికే 492 జీవీపీలను ఎత్తివేసింది. తొలగించిన సర్కిళ్లలోని సిబ్బందికి అవార్డులు అందించడంతోపాటు సన్మానాలు చేశారు. త్వరలో మిగిలిన 2049 జీవీపీలను కూడా ఎత్తివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే స్వచ్ఛ ఆటోలు రాకపోతుండడంతో రోడ్లపై చెత్త వేస్తున్నామని కొన్ని కాలనీల వాసులు చెబుతున్నారు. రెగ్యులర్ గా ఆటో వస్తే ఆటోలోనే వేస్తామని అంటున్నారు. గ్రేటర్ లో 5 వేల కాలనీలు ఉండగా వెయ్యికిపైగా కాలనీల్లో చెత్త సమస్య తీవ్రంగా ఉంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడుతోంది. యాక్షన్ ప్లాన్ పేరుతో కొత్త కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ రెగ్యులర్ గా పట్టించుకోవాలని జనం కోరుతున్నారు.