దేశంలోకి కరోనా ఎంటరై నేటికి ఏడాది

దేశంలోకి కరోనా ఎంటరై నేటికి ఏడాది

దేశంలోకి కరోనా వైరస్ ఎంటరై నేటికి ఏడాదైంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడి లక్షలమంది ఉపాధి కోల్పోయారు. వస్తువులకు గిరాకీ పడిపోయి, పెట్టుబడులూ అడుగంటాయి. ప్రభుత్వాలు లాక్ డౌన్, రెడ్ జోన్లు వంటివి ఏర్పాటుచేసి కరోనా కట్టడికి ప్రయత్నించాయి. చివరకు మన సైంటిస్టుల కృషితో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.

దేశంలో మొదటి కరోనా కేసు కేరళలో గతేడాది జనవరి 30న నిర్ధారణ అయింది. చైనాలో వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఓ కేరళ విద్యార్థిని, అక్కడి నుంచి సొంత రాష్ట్రానికి వచ్చింది. ఆమెకు కరోనా సోకినట్టు గుర్తించారు. జనవరి 30 తేదీనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ వ్యాధిని అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఆ తర్వాత రెండు నెలలకు భారతదేశంలో లాక్‌డౌన్ విధించారు. పది వారాల తర్వాత జూన్ నుంచి లాక్‌డౌన్‌పై ఆంక్షలను దశలవారీగా సడలించారు.

ఈ ఏడాది జనవరి 26 నాటికి భారత్‌లో సుమారు కోటీ ఏడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 97శాతం మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. అయితే కరోనా పాజిటివ్ కేసులు అధికారులు చెప్పే లెక్కల కంటే 50 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు అన్నారు. ఆ లెక్కన 50 కోట్ల మంది భారతీయుల్లో కొవిడ్ వ్యాపించి ఉండాలి. సీరోలాజికల్ సర్వేల తర్వాత ఇటీవల ఐసీఎంఆర్ అంచనా ప్రకారం కరోనా సోకిన భారతీయుల సంఖ్య 90 కోట్ల పైనే. ఈ లెక్కన భారత జనాభాలో ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ వృద్ధి చెంది ఉండాలి. అందుకే జనవరి 26 నాటికి ప్రపంచ గణాంకాలకన్నా భారత్‌లో చాలా తక్కువగా లక్షన్నర కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఇక్కడ కొత్త కేసులూ తగ్గిపోతున్నాయి. వైరస్ సోకినా తట్టుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మన దేశంలో కరోనా ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో ప్రతిరోజు 12 వందల మంది చనిపోయే వారు. ఇప్పుడు మరణాల సంఖ్య 200కు తగ్గింది.

ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లను వాడుకలోకి తీసుకొచ్చారు. మనదేశంలోనే తయరైన కోవాక్సిన్ మరియు ఆస్ట్రాజెనెకా వారి కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాలను దేశ ప్రజలకు ఇవ్వడంతో పాటు.. మన చుట్టుపక్కల దేశాలకు కూడా సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం దేశంలో రోజుకు సుమారు 4 లక్షల మందికి టీకాలు వేయగలుగుతున్నాం. అయితే జూలై నాటికి 30 కోట్ల మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో శుక్రవారం నాటికి 33 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటి దశలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు మాత్రమే కోవిడ్ టీకా ఇస్తున్నారు. ఈ టీకా డ్రైవ్‌ను జనవరి 16న ప్రధాని మోడీ ప్రారంభించారు.

ఏడాది తిరిగే సరికి పరిస్థితిలో మార్పు వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో కరోనా నియంత్రణలోకి వచ్చింది. అయితే చాలాదేశాల్లో మాదిరిగా భారత్‌లోనూ రెండోసారి కొవిడ్ విజృంభించే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ రెండో దశ కరోనా వ్యాప్తి జరిగినా.. అది జనాభా ఎక్కువగా ఉండే నగరాలు, జిల్లాలకు మాత్రమే పరిమితం కావచ్చు. కరోనా తగ్గుముఖం పడుతున్న ఈ తరుణంలో మనం అతివిశ్వాసానికి పోకుండా.. తగుజాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్, పరిశుభ్రత ఇవన్నీ పాటిస్తేనే కరోనా నుంచి పూర్తిగా బయటపడతాం.

For More News..

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు క్వార్టర్స్‌లో భారీ చోరీ

స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించిన వ్యక్తి మహాత్ముడు

యూపీలో ఘోర ప్రమాదం.. పది మంది మృతి

లాడ్జీలో లవర్స్ సూసైడ్.. ఇద్దరూ సచివాలయ ఉద్యోగులే

టెన్త్ అర్హతతో పోస్టల్​ జాబ్స్​.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ