ఓఎన్​జీసీ లాభం రూ. 9,536 కోట్లు

ఓఎన్​జీసీ లాభం  రూ. 9,536 కోట్లు

 న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు 31తో ముగిసిన మూడో క్వార్టర్​లో ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్​జీసీ) నికర లాభం 14 శాతం తగ్గింది. చమురు  గ్యాస్ ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. 2023 అక్టోబర్–-డిసెంబర్ క్వార్టర్​లో  కంపెనీకి రూ.9,536 కోట్ల (స్టాండలోన్) నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన రూ.11,045 కోట్లతో పోలిస్తే ఈసారి లాభం 13.7 శాతం తక్కువగా ఉంది. ఈ క్వార్టర్​లో కంపెనీ ఉత్పత్తి చేసి విక్రయించిన ముడి చమురు ధర 6.4 శాతం తగ్గి బ్యారెల్‌‌‌‌కు 81.59 డాలర్లకు పడిపోయింది.

 గ్యాస్ ధర కూడా 24.2 శాతం తగ్గి ఒక్కో ఎంఎంబీటీయూకుకు 6.5 డాలర్లు ఉంది.  ముడి చమురు ఉత్పత్తి 3.3 శాతం తగ్గి 5.22 మిలియన్ టన్నులకు చేరుకోగా, గ్యాస్ ఉత్పత్తి 4.3 శాతం తగ్గి 5.12 బిలియన్ క్యూబిక్ మీటర్ల వద్ద ఉంది.  ఈ క్వార్టర్​లో స్థూల ఆదాయం 10 శాతం తగ్గి రూ.34,789 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు రెండో మధ్యంతర డివిడెండ్ 80 శాతం లేదా షేరుకు రూ.నాలుగు చొప్పున ఆమోదించింది.  గతేడాది నవంబర్‌‌‌‌లో ప్రకటించిన మధ్యంతర డివిడెండ్ రూ.5.75కి ఇది అదనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఓఎన్​జీసీ నికర లాభం 24 శాతం తగ్గి రూ.29,767 కోట్లకు చేరుకుంది.