పెరిగిన గ్యాస్ రేట్లతో ఓఎన్‌జీసీ, రిలయన్స్‌కు మస్తు ​ఆమ్దానీ

పెరిగిన గ్యాస్ రేట్లతో ఓఎన్‌జీసీ, రిలయన్స్‌కు మస్తు ​ఆమ్దానీ
  • ఈ నెల 1 నుంచి  6.10 డాలర్లకు పెరిగిన యూనిట్‌ గ్యాస్ రేటు
  • సీఎన్‌జీ, ఎల్‌పీజీ రేట్ల మోత తప్పకపోవచ్చు..
  • ఎరువులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తగ్గే ఛాన్స్‌

న్యూఢిల్లీ: నేచురల్ గ్యాస్ రేట్లు పెరగడంతో వీటిని ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ అండ్ నేచురల్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌ కార్పొరేషన్ (ఓఎన్‌‌‌‌జీసీ), రిలయన్స్ ఇండస్ట్రీస్ రెవెన్యూలు భారీగా పెరగనున్నాయని మోర్గాన్ స్టాన్లీ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. ఓఎన్‌‌‌‌జీసీ  యాన్యువల్‌‌‌‌  రెవెన్యూ 3 బిలియన్ డాలర్లు (రూ. 23,000 కోట్లు) పెరుగుతుందని వెల్లడించింది.  రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ రెవెన్యూ కూడా 1.5 బిలియన్ డాలర్లు (రూ. 11,500 కోట్లు) పెరుగుతుందని పేర్కొంది. ఈ నెల ఒకటి నుంచి నేచురల్ గ్యాస్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌‌‌‌ (ఎంఎంబీటీయూ) గ్యాస్‌‌‌‌ రేటు 2.9 డాలర్లు ఉండగా, ఈ నెల 1  నుంచి ఈ రేటు 6.10 డాలర్లకు పెరిగింది. క్లిష్టమైన ఫీల్డ్‌‌‌‌ల నుంచి గ్యాస్‌‌‌‌ను బయటకు తీస్తే, ఆ గ్యాస్‌‌‌‌ను 9.92 డాలర్లకు అమ్ముకోవడానికి ప్రొడ్యూసింగ్ కంపెనీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇది సాధారణ ఫీల్డ్‌‌‌‌ల నుంచి  వెలికి తీసే గ్యాస్‌‌‌‌పై కంటే 62 శాతం ఎక్కువ. ప్రస్తుతం దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న గ్యాస్‌‌‌‌లో ఓఎన్‌‌‌‌జీసీ వాటా 58 శాతంగా ఉంది.

అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో మరోసారి రేట్ల పెంపు?

ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో మరోసారి గ్యాస్ ధరలు సవరిస్తారు. అప్పుడు గ్యాస్ రేట్లు మరో 25 శాతం మేర పెరుగుతాయని మోర్గాన్ స్టాన్లీ అంచనావేస్తోంది. నేచురల్ గ్యాస్ రేట్లు పెరగడంతో  సీఎన్‌‌‌‌జీ, ఎల్‌‌‌‌పీజీ రేట్లు కూడా పెరుగుతాయని అంచనావేయొచ్చు. గ్యాస్ రేట్లు పెరిగితే ప్రభుత్వం ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.