సంచలన తీర్పు: హైవే కిల్లర్లు 12 మందికి ఉరి

సంచలన తీర్పు: హైవే కిల్లర్లు 12 మందికి ఉరి

ఆంధ్రప్రదేశ్ లో సంచ‌ల‌నం సృష్టించిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష మరో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి జి.మనోహర్ రెడ్డి తీర్పు ఇచ్చారు. జిల్లాలో 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది. జాతీయ రహదారిపై లారీలు ఆపి 13మంది డ్రైవర్లు, క్లీనర్లని హత్య చేసింది ఈ  మున్నా గ్యాంగ్. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లని చంపి లారీలు ఎత్తుకెళ్లేవారు. ఈ హత్య కేసుల్లో 18 మందిని నిందితులు‌గా కోర్టు నిర్ధారించింది. దీంతో ఒంగోలు జిల్లా కోర్టు ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి ఉరి శిక్ష విధించింది.

2008లో ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్‌స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. వీటిలో నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18మందిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి ఈనెల 18న పేర్కొన్నారు. వీరంతా దారిదోపిడీలు, హత్యలకు పాల్పడటంతో పాటుగా అందుకు సంబంధించిన ఆధారాలను రూపుమాపినట్లు, ఆయుధాలు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.

మహమ్మద్ జమాలుద్దీన్, ఎస్‌కె ఖాదర్‌బాషా, తమ్మల సురేష్, కె అప్పలస్వామి నాయుడు తదితరులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు.