పోటా పోటీగా ఆన్‌లైన్ గ్రోసరీ

V6 Velugu Posted on May 05, 2021

  •     రంగంలోకి టాటాగ్రూప్ 
  •     బిగ్‌బాస్కెట్‌లో 64 శాతం వాటా కొనుగోలు

దేశంలో ఆన్‌‌లైన్‌‌ గ్రోసరీకి డిమాండ్ పెరుగుతోంది. ఈ సెగ్మెంట్‌‌లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే ఎంటర్ అయ్యాయి. రిలయన్స్‌‌ జియో మార్ట్‌‌ , అమెజాన్‌‌, వాల్‌‌మార్ట్‌‌కు చెందిన ఫ్లిప్‌‌కార్ట్‌‌ వంటి కంపెనీలు ఆన్‌‌లైన్‌‌ గ్రోసరీలో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్‌‌ కూడా ఈ సెగ్మెంట్‌‌లో ఎంటర్ అయ్యింది. ఇప్పటికే ఆన్‌‌లైన్ గ్రోసరీ మార్కెట్‌‌లో దూసుకుపోతున్న బిగ్‌‌బాస్కెట్‌‌ను కొనుగోలు చేసి పోటీకి సై అంటోంది. మరోవైపు బిగ్‌‌బజార్ లాంటి స్టోర్లు కూడా ఆన్‌‌లైన్‌‌లో ఆర్డర్లు తీసుకొని గ్రోసరీ సామాన్లను డెలివరీ చేస్తున్నాయి. 

న్యూఢిల్లీ: మన దేశంలో రాకెట్‌‌స్పీడ్‌‌ డెవెలప్ అవుతున్న సెగ్మెంట్లలో ఆన్‌‌లైన్ గ్రోసరీ ఒకటి. అందుకే పెద్ద కంపెనీలన్నీ ఇందులోకి రావడానికి క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో మరో పెద్ద కంపెనీ చేరింది. అదే టాటా గ్రూప్! ఈ–టేలర్ బిగ్‌‌బాస్కెట్‌‌ కంట్రోలింగ్ వాటా కొనేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా టాటా గ్రూపునకు చెందిన టాటా డిజిటల్‌‌కు అన్ని పర్మిషన్లూ ఇచ్చింది. ప్రైమరీ, సెకండ్ షేర్ పర్చేజ్‌‌ల ద్వారా ఈ డీల్ పూర్తయింది. బిగ్‌‌బాస్కెట్ ను నడిపే ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్‌‌తో కంట్రోలింగ్ వాటాను మరో ట్రాన్సాక్షన్ ద్వారా టాటాలు దక్కించుకుంటారు. దీంతో బిగ్‌‌బాస్కెట్‌‌ హోల్‌‌సేల్, రిటైల్ బిజినెస్ యూనిట్లపై టాటాలకు పట్టుచిక్కుతుంది. ఈ డీల్ విలువ 1.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,864 కోట్ల)ని సమాచారం. అంతేగాక బిగ్‌‌బాస్కెట్‌‌ అలీబాబా, యాక్టిస్‌‌కు ఉన్న వాటాలను కూడా టాటా డిజిటల్ కొనే చాన్సు ఉంది. 
తీవ్రమవుతున్న పోటీ
టాటాలు ప్రస్తుతం ‘క్లిక్’ పేరుతో ఆన్‌‌లైన్ షాపింగ్ ప్లాట్‌‌ఫామ్ నడుపుతున్నారు. అంటే ఇది వరకే ఈ రంగంలో వాళ్లకు అనుభవం, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌తో పాటు ఎంతో మంది సెల్లర్లు క్లిక్ చేతిలో ఉన్నారు. బిగ్‌‌బాస్కెట్‌‌ ను నిర్వహించడానికి ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. రిలయన్స్ జియోమార్ట్, అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్, గ్రోఫర్స్ వంటి పెద్ద కంపెనీలతో ఢీ కొట్టాల్సి ఉంటుంది కాబట్టి మరోసారి ధరల యుద్ధం మొదలయ్యే చాన్సులు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లడానికి టాటా ప్లాన్లు తయారు చేస్తున్నారు. దీనివల్ల అదనంగా ఫండ్స్ వస్తాయి కాబట్టి పోటీని తట్టుకోవడం సులువు అవుతుంది. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్‌‌లు ఆన్‌‌లైన్ గ్రోసరీలో ‘నువ్వా? నేనా ?’ అన్నట్టు పోటీపడుతున్నాయి. బలమైన నెట్‌‌వర్క్ ఉండటం వల్ల కేవలం గంటల సమయంలో డెలివరీ ఇవ్వగలుగుతున్నాయి.  బిగ్‌‌బాస్కెట్‌‌ సేవలు భారత్‌‌లో 2011లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25కిపైగా పట్టణాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కరోనా రిస్ట్రిక్షన్ల వల్ల జనం ఎక్కువగా బయటకు వెళ్లకుండా, ఆన్‌‌లైన్ గ్రోసరీలపై ఆధారపడుతున్నారు. ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్‌‌లో తమ అమ్మకాలు 25 శాతం పెరిగాయని బిగ్ బాస్కెట్ ప్రకటించింది.   బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణే, చెన్నై, ఢిల్లీ, నోయిడా, మైసూర్, కోయంబత్తూర్, విజయవాడ, -గుంటూరు, కోల్‌‌కతా, అహ్మదాబాద్-గాంధీనగర్, లక్నో, -కాన్పూర్ , గుర్గావ్, వడోదర, విశాఖపట్నం, సూరత్, నాగపూర్, పాట్నా, ఇండోర్, చండీగఢ్ లో డెలివరీలు ఇస్తోంది. 
2 గంటల్లో డెలివరీ ఇస్తున్న బిగ్‌‌బజార్ 
తమ ఆన్‌‌లైన్ సేల్స్‌‌ను పెంచుకోవడానికి బిగ్ బజార్ హోమ్ డెలివరీ సేల్స్‌‌ ప్రకటించింది. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు కొనసాగే ఈ సేల్‌‌లో తమ వెబ్‌‌సైట్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి రూ.300 క్యాష్‌‌బ్యాక్ ఇస్తారు. కేవలం రెండు గంటల్లోనే సరుకులను ఇంటికి తెచ్చిస్తారు. హెచ్‌‌డీఎఫ్‌‌సీ డెబిట్, క్రెడిట్‌‌ కార్డులతో కొంటే అదనపు డిస్కౌంట్లు ఉంటాయి. కిరాణా, దుస్తులు, కుక్వేర్ సెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వంటి వాటిపై 35 శాతం నుంచి 50 శాతం తగ్గింపు ఇస్తామని బిగ్‌‌బజార్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పవన్ సర్దా వెల్లడించారు. shop.bigbazaar.com ద్వారా ఆర్డర్ చేస్తే రెండే గంటల్లో డెలివరీ ఇస్తామన్నారు.

Tagged amazon, India, business, tata group, walmart, Jio Mart, big bazar, Online Groceries, Big Basket

Latest Videos

Subscribe Now

More News