
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా పోలీసు అభ్యర్థుల ఈవెంట్స్ లో 52 శాతం అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్ లో పది రోజులుగా నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ సోమవారంతో ముగిశాయి. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి దగ్గరుండి ఈవెంట్స్ పర్యవేక్షించారు. అయితే ఈవెంట్స్ లో ఈ సారి తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అత్యధికంగా 1600 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ లో ఫెయిల్అయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి 10,378 అభ్యర్థులకు 9,178 మంది హాజరుకాగా 4,780 మంది మాత్రమే ఈవెంట్స్‌లో క్వాలిఫై అయినట్లు ఎస్పీ తెలిపారు. అర్హత సాధించిన వారిలో 3,740 పురుషులు, 1,040 మహిళ
అభ్యర్థులు ఉన్నారు.
సజీవ దహనం కేసులో..పదిమందిని అదుపులోకి తీసుకున్నాం
మందమర్రి, వెలుగు : మందమర్రి మండలం వెంకటాపూర్ గుడిపల్లిలో ఆరుగురి సజీవ దహనం కేసులో నలుగురు ముఖ్య నిందితులతోపాటు సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన డీసీపీ అఖిల్ మహాజన్ తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత కాసీపేట పీఎస్‌లో ఉన్న అనుమానితులను ప్రశ్నించారు. సీపీ మాట్లాడుతూ ప్రాథమిక దర్యాప్తులో హత్యగా తేలిందని, పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు
వెల్లడిస్తామన్నారు.
పక్కా ఆధారాల కోసం..
ఈకేసులో పోలీసులు పక్కా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. చనిపోయిన శాంతయ్య భార్య సృజన, ఆమె ప్రియుడు లక్షెట్టిపేటకు చెందిన భూములు కొలిచే మేడి శంకర్, ట్రాక్టర్డ్రైవర్రమేశ్, గుడిపల్లికి చెందిన సమ్మయ్య, సింగరేణి కార్మికుడైన సృజన తండ్రి అంజయ్య, మరో ఇద్దరు అటో డ్రైవర్లు, సృజన కుటుంబానికి చెందిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎంక్వైరీలో తన భర్తతో గొడవలున్నాయి తప్పితే..చంపాలనే ఉద్దేశం లేదని సృజన చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే పోలీసులకు నిందితులు వదిలి వెళ్లిన రెండు క్యాన్స్ తప్ప మరేమీ దొరకలేదు. దీంతో గట్టి ఆధారాల కోసం సీసీ పుటేజీలు సేకరిస్తున్నారు. నిందితులు హత్య చేసేందుకు వారం పాటు మంచిర్యాలలోని ఒక హోటల్లో ఉండి పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలియడంతో వారి సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వెంకటాపూర్ గ్రామం బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధి రామక్రిష్ణాపూర్ పీఎస్ పరిధిలో ఉండగా, నిందితులను, అనుమానితులను బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధి కాసిపేట పీఎస్‌లో ఉంచి విచారిస్తున్నారు. బెల్లంపల్లి ఎసీపీ ఎడ్ల మహేశ్తన టీంతో మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
బాసర ట్రిపుల్ఐటీ వద్ద భారీ బందోబస్తు
భైంసా, వెలుగు: స్టూడెంట్ సూసైడ్‌తో బాసర ట్రిపుల్ఐటీ వద్ద మళ్లీ టెన్షన్ నెలకొంది. పీయూసీ-2 చదువుతున్న భాను ప్రసాద్ ఉరేసుకొని సూసైడ్ చేసుకోగా మిగతా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. స్టూడెంట్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. సోమవారం క్యాంపస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్లు పెట్టి ఎవరూ అటువైపు రాకుండా చర్యలు చేపట్టారు. ముథోల్ సీఐ వినోద్ రెడ్డి, బాసర, ముథోల్, తానూర్ ఎస్సైలతో పాటు పోలీసు బలగాలు మోహరించారు. విద్యార్థి ఆత్మహత్యను నిరసిస్తూ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు నిరసనలు తెలిపారు. బీజేపీ నాయకులు ట్రిపుల్‌ఐటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. ఆప్నిర్మల్ కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్, జావేద్ఖాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
ఆసిఫాబాద్, వెలుగు: మతసామరస్యంతో ప్రజలంతా స్నేహభావంతో సమష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ చర్చ్ లో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని 2 వేల క్రైస్తవ కుటుంబాలకు బట్టలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగేశ్వరరావు, పీఏసీఎస్‌చైర్మన్ అలీబిన్ అహ్మద్, తహసీల్దార్ రామ్మోహన్, చర్చ్ ఫాదర్ రాజరత్నం పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
నిర్వహిస్తున్నట్లు కుమ్రంభీం ఆసిఫాబాద్కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదుల్లో భూ సమస్యలు, రైతుబంధు, ఆసరా పింఛన్లపై ఎక్కువగా వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.