ఇంటర్​ ఎగ్జామ్స్​లో 70% పాఠాలే!

ఇంటర్​ ఎగ్జామ్స్​లో 70% పాఠాలే!
  • ఇంటర్​ ఎగ్జామ్స్​లో 70% పాఠాలే!
  • సిలబస్ తగ్గించే యోచనలో ఇంటర్​ బోర్డు 
  • కేంద్ర సూచన పరిగణనలోకి... 
  • సర్కార్ అనుమతితో అమలు  
  • 10 లక్షల మంది స్టూడెంట్స్​పై తగ్గనున్న ఒత్తిడి

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్ ఎగ్జామ్స్ కు సిలబస్ తగ్గించాలని ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు చర్యలు చేపట్టింది. ఇంటర్ స్టూడెంట్లకు ఈ నెల ఒకటో తారీఖు నుంచి కాలేజీలు ప్రారంభం కాగా, 100 శాతం సిలబస్ చెప్పాలని రాష్ట్ర సర్కార్ ఆదేశాలిచ్చింది. దీంతో వంద శాతం సిలబస్ తోనే ఎగ్జామ్స్ ఉంటాయని స్టూడెంట్లలో భయం నెలకొంది. అయితే 2021–22 అకడమిక్ ఇయర్ లోనూ సిలబస్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం జులైలోనే సీబీఎస్ఈతో పాటు ఇతర బోర్డులు, రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర సూచనను పరిగణనలోకి తీసుకున్న ఇంటర్ బోర్డు.. ఈ ఏడాది కూడా ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ ను 70 శాతం సిలబస్ తోనే నిర్వహించాలని యోచిస్తోంది. దీంతో 10 లక్షల మంది స్టూడెంట్లపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. సిలబస్ తగ్గింపుపై బోర్డు త్వరలోనే సర్కార్ నుంచి అనుమతి తీసుకోనుంది. ఆ తర్వాత ఏఏ పాఠాలు తొలగిస్తారనే దానిపై స్పష్టత రానుంది. కాగా, 2020–21 అకడమిక్ ఇయర్ లో 70 % సిలబస్ తోనే ఎగ్జామ్స్ పెట్టాలని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. ఆ మేరకే బోర్డు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అప్పట్లో కరోనా కారణంగా సెకండియర్ ఎగ్జామ్స్ రద్దు కాగా, ఫస్టియర్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. వాయిదా పడిన ఫస్టియర్ ఎగ్జామ్స్ ను వచ్చే నెల 25 నుంచి పెట్టనున్న బోర్డు.. వాటిని 70 శాతం సిలబస్ తోనే నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది.