కొంత మందికే అందనున్న పోడు భూముల పట్టాలు

కొంత మందికే అందనున్న పోడు భూముల పట్టాలు
  • మెదక్​ జిల్లాలో 4,015 మంది దరఖాస్తు..182 మంది అర్హులుగా గుర్తింపు?
  • నిరాశలో వేలాది మంది రైతులు 
  • దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా గుర్తించలేదని ఆవేదన 
  • మరోసారి పరిశీలించాలని ఆఫీసర్లకు కలెక్టర్ ఆదేశం

మెదక్ (శివ్వంపేట), వెలుగు : మెదక్​ జిల్లాలో పోడు భూముల పట్టాలు కొంత మందికే అందనున్నాయి.జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో అటవీ సమీప గ్రామాల రైతులు అనేక దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. అయితే పట్టాలు లేక పోవడంతో లోన్లు, రైతుబంధు, రైతుబీమా, పీఎం కిసాన్ లాంటి స్ర్కీమ్​ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. తాము సాగు చేస్తున్న భూములపై హక్కులు కల్పించాలని సంబంధిత రైతులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం పోడు భూములపై హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా కొన్ని నెలల కింద ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 

దరఖాస్తులు బారెడు.. ఆమోదం చారెడు..!

జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లోని 62 గ్రామాల పరిధిలో దాదాపు ఆరు వేల ఎకరాలకు సంబంధించి 4,015 మంది పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. శివ్వంపేట, నర్సాపూర్, వెల్దుర్తి, కౌడిపల్లి, హవేలీఘనపూర్,  చిన్నశంకరంపేట, కొల్చారం మండలాల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు గత అక్టోబర్​లో ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీరాజ్​అధికారులు గ్రామస్థాయి కమిటీల సమక్షంలో ఎంక్వయిరీ చేశారు. సర్వే జాబితాలో దరఖాస్తుదారులందరి పేర్లు లేకపోవడంతో శివ్వంపేట, కౌడిపల్లి, హవేలీఘనపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం తాము ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలలో అర్హులైన  పోడు రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో అధికారులు జిల్లాల వారీగా అర్హుల జాబితాలు రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో138 ఎకరాలకు సంబంధించి 182 మందిని అర్హులుగా గుర్తించినట్టు తెలిసింది. ఆయా మండలాల పరిధిలో 1,455 ఎకరాలకు సంబంధించి 923 మంది దరఖాస్తులను రిజెక్ట్ చేసినట్టి సమాచారం. ఇందులో 367 దరఖాస్తులు గిరిజనులవి కాగా, 556 గిరిజనేతరులవి ఉన్నట్టు తెలిసింది. పోడు పట్టాల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకోగా కేవలం రెండు వందల లోపు మంది రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించినట్టు తెలియడంతో మిగతా రైతులు నిరాశ చెందుతున్నారు. దశాబ్దాలుగా తాము పోడు భూములు సాగు చేస్తుండగా తమను అనర్హులుగా గుర్తించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

మళ్లీ పరిశీలించండి : కలెక్టర్​

అర్హులైన రైతులు నష్టపోకుండా పోడు భూములకు సంబంధించి గ్రామ సభ ద్వారా ఆమోదించి సబ్ డివిజనల్ స్థాయి కమిటీకి పంపిన క్లెయిమ్స్ ను మళ్లీ పరిశీలించాలని కలెక్టర్ రాజర్షి షా ఆర్డీవోలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్​తో కలిసి  ఆర్ఓఎఫ్ఆర్ కు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు.  పోడు భూముల పట్టాలకు సంబంధించి జిల్లాలో మొత్తం 4,015 క్లెయిమ్స్ రాగా అందులో గిరిజనుల నుంచి1,061 క్లెయిమ్స్ వచ్చాయని తెలిపారు. క్లెయిమ్స్ పరిశీలన అనంతరం  గ్రామ స్థాయి కమిటీ సబ్  డివిజనల్ స్థాయి కమిటీకి  510 ప్రతిపాదనలు పంపారని వివరించారు. సబ్  డివిజనల్ కమిటీ ఆ క్లెయిమ్స్ ను పరిశీలించి  జిల్లా స్థాయి కమిటీకి 171 ప్రతిపాదనలు పంపగా, అందులో  59 క్లెయిమ్స్ పై జిల్లా స్థాయి కమిటీ  నిర్ణయం తీసుకుందని తెలిపారు. మిగతా క్లెయిమ్స్ ను మరోసారి పరిశీలించి క్లెయిమ్ వారీగా నివేదిక అందజేయాలని ఆర్డీఓలను  ఆదేశించారు. 

మాకు న్యాయం చేయాలి 

మా తండాలో చాలా మందిమి తాతల కాలం నుంచి పోడు భూములు సాగు చేసుకుని బతుకుతున్నం. ప్రభుత్వం పట్టాలు ఇస్తుందంటే దరఖాస్తు పెట్టుకున్నం. కానీ ఫారెస్ట్ భూమి కబ్జా చేశారని ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మాపై కేసులు పెట్టిన్రు. మాకు న్యాయం చేయాలె. ఆఫీసర్లు పక్కాగా ఎంక్వయిరీ చేసి మాకు పట్టాలియ్యాలె. 

‌‌ - పాండ్య నాయక్, కద్యా తండా, శివ్వంపేట మండలం