- మహాత్ముడి ప్లేస్ లో RSSని పెట్టాలని చేస్తున్నారు
- ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ బాటలో నడిచింది కాంగ్రెస్ ఒక్కటేనని ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. బాపూజీ ఆశయాల పునాదిపై భారత్ నడుస్తోందని, కాని గడిచిన ఐదేళ్లలో దాన్ని కుదిపేశారని అన్నారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీలో పాదయాత్ర చేశారు. నడుచుకుంటూ రాజ్ ఘాట్ కు వెళ్లి జాతిపితకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోనియా గాంధీ.. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గాంధీజీ ఆశయాల పునాదిపై నిర్మితమవుతున్న నవ భారతాన్ని గడిచిన ఐదేళ్లలో కుదిపేశారని అన్నారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, అధికారంలో ఉన్న వ్యక్తులే అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెప్పడం సులభం.. ఆచరణ కష్టం
గాంధీజీ ఆశయాల గురించి చెప్పడం చాలా సులభమని, ఆయన బాటలో నడవడం చాలా కష్టమని సోనియా అన్నారు. ఆయన ఆశయాలతో నడుస్తున్న భారత్ ను పక్కదారి పట్టించాలనుకుంటున్న వారు సక్సెస్ కాలేరని చెప్పారు. కొంత మంది మహాత్మా గాంధీ ముద్రను చెరిపేసి, ఆయన స్థానంలో RSSని భారత దేశ చిహ్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆధిపత్యం కోసం తమ ఇష్టానుసారం చేయాలనుకుంటున్న వారికి గాంధీజీ ఎప్పటికీ అర్థం కారని చెప్పారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే గాంధీజీ బాటలో నడిచి, ఆయన ఆశయ సాదనకు కృషి చేసిందన్నారామె. మహాత్ముడు చూపిన బాటలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు సోనియా. యువతకు ఉద్యోగ కల్పన, పేదల అభివృద్ధి, మహిళా సాధికారత వంటివి కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే చేశాయన్నారు.

