శిక్షా భయం ఉంటేనే.. మహిళలపై నేరాలు తగ్గుతాయి!

శిక్షా భయం ఉంటేనే.. మహిళలపై నేరాలు తగ్గుతాయి!

అనాదిగా అన్ని దేశాల్లో అత్యంత అమానుషమైన, హేయమైన నేరంగా గుర్తించబడిన “రేప్” నేరానికి అన్ని దేశాలూ కఠినమైన శిక్షలనే అమలు చేస్తున్నాయి. ప్రాచీన న్యాయ వ్యవస్థలో “రేప్” నేరానికి మరణదండన మాత్రమే సరైన శిక్షగా భావించేవారు. నేర తీవ్రతను బట్టి అది రకరకాలుగా ఉండేది. సాధారణ ఉరితో బాటు తల వరకు పాతర వేసి రాళ్లతో కొట్టి చంపడం, ఏనుగులతో తొక్కించి చంపడం, కాలుతున్న ఇనుప బల్లమీద పడుకోబెట్టి చంపడం, చచ్చేవరకు కొరడాలతో కొట్టి చంపడం, మండుతున్న నిప్పుల్లో కాల్చి చంపడం, జీవ సమాధి కట్టడం, తల నరకడం లాంటి శిక్షలని అమలు పరిచేవారు. నేర ప్రవృత్తి గల వ్యక్తుల్లో భయాన్ని కలిగించి నేరాలని కట్టడి చేసేందుకు ఈ శిక్షలన్నీ బహిరంగ శిక్షలుగానే ఉండేవి. వాస్తవంగా అవి ఎంతో సత్ఫలితాలనిచ్చాయి. మన దేశంలో ఇలాంటి శిక్షలు మూడు దశాబ్దాల కిందటి వరకు కూడా కొనసాగాయి. ప్రముఖ చరిత్రకారుడు ఎంవీ మేఘాని చెప్పిన ప్రకారం.. గుజరాత్ లోని సూరత్ పట్టణంలో రేప్ నేరస్థులకు చౌక్ బజార్ ప్రాంతంలో బహిరంగ శిక్ష విధించేవారు. ఆ శిక్షలో భాగంగా నేరస్థుడి తల బయటకు ఉండేలా పాతర వేసి తలను ప్రజలు రాళ్లతో కొట్టి చంపేవారు. లేదంటే తల నరికి చంపేవారు. మరొక ప్రముఖ చరిత్రకారుడు ఎంజే పటేల్ వివరణ ప్రకారం.. సోలంకి రాజుల పాలనలో అదే సూరత్ లో, రేప్ నేరస్థుల్ని కాలుతున్న ఇనుపబల్ల మీద కూర్చోబెట్టి చంపేవారు లేదంటే ఏనుగులతో తొక్కించి చంపేవారు. ఈ శిక్షలు కూడా బహిరంగ శిక్షలే. వినడానికే భయం కలిగించే ఈ శిక్షలు నేర ప్రవృత్తి గల వ్యక్తుల గుండెల్లో భయాన్ని కలిగించి సమాజంలో నేర నియంత్రణకు దోహద పడేవి. కొన్ని చోట్ల నేరస్థుల మర్మాంగ విచ్ఛేదం కూడా అమల్లో ఉండేది.

ప్రభుత్వం ఆలోచించాలి

సమాజంలో రేప్ నేర విజృంభణకు కారణాలు అన్వేషించినప్పుడు కనబడేవి ఇంటర్నెట్​లో దొరికే అశ్లీలత, దీనికి తోడు మద్యపానం ఇతర మత్తు పదార్థాల వినియోగం. ఇవి నేర ప్రవృతి గల వ్యక్తుల్లో నేర వాంఛను పెంచుతాయి. నేర నియంత్రణ ప్రక్రియలో ఈ అంశాలని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సునిశితంగా పరిశీలిస్తే బహిరంగ శిక్షలు అమలు పరచని దేశాల్లో శిక్షలు ఎంత కఠినమైనా నేరాల సంఖ్య తగ్గడం లేదు. మన దేశంలో ప్రతి అరగంటకొక రేప్ జరుగుతున్నట్టుగా అంచనా. వాస్తవంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే  అవకాశముంది. అంతేకాదు పసిపిల్లలు కూడా మానవ మృగాల చేతిలో అత్యాచారాలకు గురి కావడం బాధాకరం. ఈ మధ్య మన నగరంలోని ఒక పాఠశాలలో జరిగిన అత్యంత అమానుషమైన ఉదంతమే దీనికి ఉదాహరణ. అందువల్ల రేప్ నేర నియంత్రణ వైఫల్యానికి కారణం సమాజంలో ముఖ్యంగా నేర ప్రవృత్తి గల వ్యక్తుల్లో  రేప్ నేరానికి విధిస్తున్న శిక్షలు శిక్షాభయాన్ని కలిగించలేకపోవడమే కారణంగా తెలుస్తున్నది. మనం జీవిస్తున్న నేటి సమాజంలో నేరం ఎంత ఘోరమైనదైనా క్రూర, బహిరంగ శిక్షలను మన దేశంతోపాటు చాలా దేశాలు ఒప్పుకోవు. మరి దీనికి పరిష్కారమార్గమేమిటి అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. బహిరంగ క్రూర శిక్షలు వద్దని భావిస్తే.. నేర ప్రవృత్తి గల వ్యక్తుల్లో శిక్షల భయాన్ని ప్రవేశపెట్టగలిగే మరో ప్రక్రియను కనుగొనాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య భారత ప్రభుత్వం లైంగిక నేరస్తుల చిట్టాను సిద్ధం చేసినట్టుగా తెలుస్తున్నది. సుమారు10.69 లక్షల మంది వివరాలతో కూడిన ఈ డేటా బేస్ లో లైంగిక నేరాలకు పాల్బడిన వారితోపాటు మహిళలను వేధించిన వారి వివరాలు, పేరు, అడ్రస్, ఫొటో, వేలిముద్రలు ఇతర నేరాల వివరాలు నిక్షిప్తం చేశారు. ఎన్ని చేసినా శిక్షా భయం ఉంటేనే.. మహిళలపై నేరాలు తగ్గే అవకాశం ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయని ఆశిద్దాం.

ఆధునిక యుగంలో శిక్షలు

మానవ నాగరికత మెరుగులు దిద్దుకొని జాతులన్నీ పురోగమిస్తున్న ఈ శకంలో ప్రాచీన శిక్షలు అనాగరికంగా గుర్తించబడ్డాయి. కాబట్టి ప్రపంచమంతటా నేర శిక్షాస్మృతిలో  పెను మార్పులు వచ్చాయి. అందువల్ల రేప్ నేరానికి  మరణ శిక్ష కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైంది. అంతేకాదు రేప్ అన్న పదాన్ని ఒక్కో దేశంలో ఒక్కో విధంగా నిర్వచించారు. మన దేశంతోపాటు ​రేప్ నేరానికి మరణ దండన విధించే దేశాల్లో అఫ్ఘానిస్తాన్, చైనా, సౌది అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇరాన్, పాకిస్థాన్, ఇండోనేషియా, ఉత్తర కొరియాలు ఉన్నాయి. మన దేశంలో నేర శిక్షాస్మృతికి 2018లో చేసిన సవరణ ద్వారా రేప్ నేరాల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం(సెక్షన్​376 డీబీ) మరణ శిక్షకు గుర్తింపు లభించింది. రేప్ నేరానికి మరణ శిక్షను గుర్తించిన దేశాలన్నీ కూడా శిక్షను బహిరంగంగా అమలు పరచడం లేదు. కొన్ని దేశాలు మాత్రమే బహిరంగ శిక్షను అమలు పరుస్తున్నాయి. రేప్ నేరాన్ని అత్యంత హీనమైన నేరంగా భావించే సౌదీ అరేబియాలో  మరణ శిక్షను  బహిరంగంగా విధిస్తారు. నేరస్తుడిని  రాళ్లతో కొట్టి చంపడమో లేదా కొరడాతో కొట్టి  చంపడమో ఇక్కడ జరుగుతున్నది. కొన్నిసార్లు బహిరంగ ప్రదేశంలో  నేరస్థుడి తల నరకడం ద్వారా మరణ శిక్షని విధిస్తారు. ఇరాన్ దేశంలో కూడా  నేరస్థుడిని బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపడమో లేదా కాల్చి చంపడమో జరుగుతున్నది. అంతేగాక బహిరంగ ఉరి శిక్ష కూడా అమలులో ఉందిక్కడ. కొన్ని సందర్భాల్లో రేప్ బాధితులు నేరస్థుడిని కాల్చి చంపేందుకు కూడా అనుమతిస్తారు. కొన్ని దేశాల్లో మాత్రం రేప్ నేరానికి  వంధ్యత్వాన్ని కలిగిస్తున్నారు. అది సర్జికల్ విధానం ద్వారా గానీ, లేదా రసాయన ప్రయోగం ద్వారా గానీ కలిగిస్తారు. చైనా, జెక్ రిపబ్లిక్ లు పురుషుల బీజ విచ్ఛిన్నం ద్వారా నపుంసకత్వం కలిగిస్తారు. ఇండోనేషియా, ఉక్రెయిన్ లలో  రసాయనం   ద్వారా పురుషుల్ని నపుంసకుల్ని చేసి శిక్ష విధిస్తారు. - బసవరాజు నరేందర్ రావు, అడ్వకేట్, హైదరాబాద్