
- రెండేండ్లలో 33% పైనే పెరిగినయ్
- సింగిల్ టీచర్ స్కూళ్ల జాబితాలో దేశంలో ఏడో స్థానంలో తెలంగాణ
- పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సింగిల్ టీచర్ స్కూళ్లు పెరుగుతున్నాయి. 6,392 బడులు ఒక్క టీచర్‌తోనే నడుస్తున్నాయి. ఈ సంఖ్య రాష్ట్రంలోని స్కూళ్లలో 20%. మూడేండ్ల నుంచి ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. సింగిల్ టీచర్ ఉన్న బడులు రూరల్ ఏరియాలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అత్యధికంగా సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఏడోస్థానంలో ఉంది. ఇటీవల పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ ఈ వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు కలిపి సర్కారు సెక్టార్‌లో 30 వేల దాకా బడులున్నాయి. 2021–22 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం వీటిలో 6,392 బడులు ఒకే టీచర్‌తో కొనసాగుతున్నాయి. ఇందులో రూరల్ ఏరియాల్లో 5,533, అర్బన్ ఏరియాల్లో 859 ఉన్నాయి. 2020–21లో సింగిల్ టీచర్ బడులు 5,566 ఉంటే.. అందులో అర్బన్ ఏరియాలో 706, రూరల్ ఏరియాలో 4,860 ఉన్నాయి. అంతకుముందు 2019–20లో 4,782 బడులుంటే, 4,065 రూరల్ ఏరియాలోనే ఉండటం గమనార్హం. రెండేండ్లలోనే ఏకంగా 1,610 (33 శాతం పైనే) ఏకోపాధ్యాయ స్కూళ్లు పెరిగాయి. మొత్తం 6,392 సింగిల్ టీచర్ స్కూళ్లలో 4,800 దాకా సర్కారు, లోకల్ బాడీ స్కూళ్లు ఉంటాయని, మిగిలినవి ట్రైబల్, ఇతర వెల్ఫేర్ స్కూళ్లుంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు. 2021–22లో ప్రభుత్వం కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా టీచర్లను అలాట్ చేసేందుకు తీసుకొచ్చిన జీవో 317తోనూ సింగిల్ స్కూల్ టీచర్ల సంఖ్య కొంత పెరిగిందని పేర్కొంటున్నారు. సింగిల్ టీచర్ ఉన్న బడుల్లో దాదాపు అన్నీ ప్రైమరీ స్కూళ్లే ఉన్నాయి. ఐదు తరగతులకూ ఒకే టీచర్ ఉండటంతో క్లాసుల నిర్వహణ అస్తవ్యస్థంగా మారుతున్నది. మరోపక్క ప్రభుత్వం విద్యావాలంటీర్లనూ రెండేండ్ల నుంచి తీసుకోవడం లేదు.
19 లోపు అడ్మిషన్లు ఉన్న బడులకు సింగిల్ టీచర్‌ను అలాట్ చేస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నా.. 50 మందికి పైగా విద్యార్థులున్నా ఒక్కరే టీచర్ కొనసాగుతున్న బడులు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. టాప్‌లో ఎంపీ, తర్వాత ఏపీ సింగిల్ టీచర్ అత్యధికంగా ఉన్న బడుల జాబితాలో మధ్యప్రదేశ్ టాప్‌లో ఉంది. అక్కడ ఏకంగా 16,630 బడులు ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్ (12,386 స్కూళ్లు) ఉంది. రాజస్థాన్ (10,878), ఉత్తరప్రదేశ్ (8,040), కర్నాటక (7848), జార్ఖండ్ (7,322) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సరిపడా టీచర్లు లేకపోవడంతో స్కూళ్ల నిర్వహణ సక్కగ సాగడం లేదు. ఏదైనా మీటింగ్ ఉన్నా, సెలవు పెట్టినా ఒకే టీచర్ ఉన్న బడులు మూతపడే దుస్థితి.