
- రాష్ట్ర సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 700 మంది స్టూడెంట్లకు ఒక్కటే టాయిలెట్ ఉండడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కనీస సౌలతుల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరూర్ నగర్ జూని యర్ కాలేజీ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కాలేజీల్లో సౌలతులపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. కాలేజీల్లో కనీస సౌలతుల కల్పనకు తీసుకున్న చర్యలేంటో వివరించాలని కోరిం ది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. సరూర్‌నగర్ కాలేజీలో 700 మంది స్టూడెంట్లకు ఒక్కటే టాయిలెట్ ఉం దంటూ పత్రికల్లో వచ్చిన వార్తను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు.. గురువారం విచారణ చేపట్టింది.
సౌలతులు కల్పిస్తే మరింత మంది చదువుకుంటరు..
సరూర్ నగర్ కాలేజీలో దుస్థితిపై పేపర్లలో వార్త రాగా.. దాని ఆధారంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్ ఎన్.మణిదీప్ హైకోర్టుకు లేఖ రాశారు. ‘‘తాగునీరు, టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అమ్మాయిల బాధ వర్ణనాతీతం. పీరియడ్స్ టైమ్ లో వాళ్లు కాలేజీకి రావడం లేదు. ఒకవేళ తప్పనిసరి రావాల్సి వస్తే, పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అబ్బాయిలు కూడా టాయిలెట్లు లేక మూత్రవిసర్జన కోసం బయటకుపోతున్నారు. దీనిపై గత మూడు నెలలుగా అధికారులకు లేఖలు రాసిన పట్టించుకోలేదు. చివరకు 300 మంది స్టూడెంట్లు క్లాసులు బహిష్కరించి ఆందోళన చేశారు. ఈ సమస్యపై మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాశాను. అయితే అక్కడ చైర్మన్, సభ్యులు లేకపోవడంతో హైకోర్టుకు లేఖ రాస్తున్నాను. దీన్ని సుమోటో పిల్ గా పరిగణించి విచారణ చేపట్టాలి” అని అందులో కోరారు. దీనిపై స్పందించిన కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ కాలేజీల్లో అవసరమైన సౌలతులు కల్పిస్తే, మరింత ఎక్కువ మంది అమ్మాయిలు చదువుకుంటారని కామెంట్ చేసింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్ విద్య కమిషనర్, ఇంటర్ బోర్డు, సరూర్ నగర్ కాలేజీ ప్రిన్సిపాల్ సహా రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.