
- ఎయిర్‌పోర్టు మూసివేతతో ధర్మశాలలో మ్యాచ్‌లపై సందిగ్ధత
- నేడు పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పోరు
- 11న జరిగే మ్యాచ్ కోసం ఆ సిటీకి వెళ్లలేని ముంబై
న్యూఢిల్లీ/ధర్మశాల: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఐపీఎల్‌పై ప్రభావం చూపేలా ఉంది. పాక్‌పై మిస్సైల్ దాడుల నేపథ్యంలో ధర్మశాల ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో సిటీలో ఈ వారంలో జరిగే రెండు మ్యాచ్‌లపై అనుమానాలు నెలకొన్నాయి. గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఈ పోరు కోసం ఇరు జట్లూ ఇప్పటికే ధర్మశాల చేరుకున్నాయి. కానీ, రాత్రి సమయంలో ఫ్లడ్‌లైట్ల వాడకం భద్రతా సమస్యగా మారింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని అనుమానాలు ఉన్నాయి. ‘బీసీసీఐ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మ్యాచ్ రద్దుపై ఎలాంటి రాతపూర్వక సమాచారం రాలేదు. అధికారిక ఆదేశాలు లేకపోతే షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తాం’ అని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పీసీఏ) వర్గాలు చెప్పాయి.
పంజాబ్‌కు సెకండ్ హోమ్ గ్రౌండ్‌గా ఉన్న ఇదే స్టేడియంలో ఈ నెల 11న ఆ టీమ్ ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంది. అయితే ఎయిర్‌పోర్ట్ మూసివేసిన కారణంగా ముంబై జట్టు ధర్మశాలకు రాలేని స్థితిలో ఉంది. ముంబై టీమ్ బుధవారమే చండీగఢ్ వెళ్లి అక్కడి నుంచి ధర్మశాల వెళ్లాలని అనుకుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తమ ట్రావెల్ ప్లాన్‌ను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను ముంబైకి మార్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, వేదిక మార్పు గురించి తమకు ఇప్పటి వరకు లాంటి సమాచారం రాలేదని పంజాబ్ కింగ్స్ అధికారి ఒకరు చెప్పారు.
డీసీ టీమ్‌కూ ఇబ్బందులు
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఇబ్బందుల్లో ఉంది. గురువారం మ్యాచ్ తర్వాత డీసీ ఈ నెల 11న ఢిల్లీలో గుజరాత్ టైటాన్స్‌తో ఆడాలి. కానీ, ఎయిర్‌పోర్ట్ మూసివేయడంతో ఆ టీమ్ ధర్మశాలలోనే స్ట్రక్ అయ్యేలా ఉంది. ‘ప్రస్తుతం అంతా అనిశ్చితంగా ఉంది. ఫ్రాంచైజీలతో చర్చలు జరుగుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ తెరుచుకోకపోతే ధర్మశాల నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నాం. బస్సులో వెళ్లే ఆప్షన్ కూడా ఉంది. కానీ జట్లతో పాటు బ్రాడ్ కాస్టింగ్ సిబ్బంది, వాళ్ల సామగ్రి గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడే ఏమీ చెప్పలేం’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ధర్మశాలకు సమీపంలోని చండీగఢ్ ఎయిర్‌పోర్ట్ కూడా మూసివేయడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.