
ది హేగ్: సీక్రెట్ ఫోన్‌లు, యాప్‌లతో నేరాలకు పాల్పడే ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా, క్రిమినల్ గ్యాంగులను అవే సీక్రెట్ ఫోన్‌లు, యాప్‌లతో ఆట కట్టించిన్రు అమెరికా ఎఫ్బీఐ ఆఫీసర్లు. ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగుల ఆట కట్టించేందుకు ‘ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్’ను ప్రారంభించిన ఎఫ్బీఐ ఆఫీసర్లు.. వంద దేశాల్లోని పోలీసులతో చేతులు కలిపి 300 గ్యాంగులకు వల విసిరారు. తాజాగా పదహారు దేశాల్లో 800కు పైగా మంది క్రిమినల్స్ ను ఆయా దేశాల పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 32 టన్నుల డ్రగ్స్, 250 గన్స్, 55 లగ్జరీ కార్లు సీజ్ చేశారు. 14.8 కోట్ల డాలర్లు (రూ.1000 కోట్లు) క్యాష్, వర్చువల్ కరెన్సీని పట్టుకున్నారు. 150 మర్డర్లు జరగకుండా అడ్డుకున్నరు. అనేక క్రైమ్ ప్లాన్ లను భగ్నం చేశారు. ఈ మొత్తం ఆపరేషన్ వివరాలను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) అధికారులు మంగళవారం నెదర్లాండ్స్ లోని ది హేగ్ లో మీడియా సమావేశంలో ప్రకటించారు.
రెండేండ్ల కిందట..
ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగులు సీక్రెట్ ఫోన్ లు, యాప్ లు మాత్రమే వాడుతూ ఆయా దేశాల పోలీసులు, సెక్యూరిటీ ఆఫీసర్లకు మస్కా కొడుతుంటారు. ఈ క్రమంలో రెండేండ్ల కిందట ఫాంటమ్ సెక్యూర్, ఎన్ క్రోచాట్, స్కైగ్లోబల్ అనే సీక్రెట్ యాప్ లు వాడుతున్న కొందరు క్రిమినల్స్ ఎఫ్బీఐ చేతికి దొరికారు. ఏ దేశ పోలీసులు, సెక్యూరిటీ సంస్థలు కూడా కనిపెట్టలేనంత సీక్రెట్ సర్వీస్ అందించేలా పక్కా ఎన్ క్రిప్టెడ్ సర్వీస్ తో ఉన్న ఆ ఫోన్ లు, యాప్ లను చూసి ఎఫ్బీఐ అధికారులే షాక్ అయ్యారు. అదేటైంలో అదే ఎన్ క్రిప్షన్ టెక్నిక్ తోనే క్రిమినల్స్ కు వల వేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. దీంతో ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ స్టార్ట్ అయింది.
300 గ్యాంగులపై గురి
ఆపరేషన్లో భాగంగా ఎఫ్బీఐ అధికారులు పూర్తిస్థాయి ఎన్ క్రిప్షన్ తో కూడిన వందలాది అనామ్ ఫోన్లలో సీక్రెట్ యాప్లను ఇన్ స్టాల్ చేశారు. ఆ ఫోన్లను క్రిమినల్స్ కు సీక్రెట్ డివైస్ లను అమ్మే దళారుల ద్వారా వంద దేశాల్లోని 300 గ్యాంగులకు అందేలా చేశారు. ఒక్కో ఫోన్ ను రూ. 1.45 లక్షలకు అమ్మారు. అదనంగా ఆరు నెలలకు లక్షన్నర యూజర్ ఫీజు కూడా నిర్ణయించారు. అనామ్ ఫోన్ లను మామూలుగా అయితే ఏ దేశ పోలీసులూ హ్యాక్ చెయ్యలేరు.. వాడుతున్నోళ్లను అసలే కనిపెట్టలేరు. ఎందుకంటే వాటిలో జీపీఎస్, మెయిల్స్ వంటివి ఉండవు. కేవలం టెక్స్ట్ మెసేజ్ లు, ఫొటోలు మాత్రమే వెళ్తాయి. కానీ ఎఫ్ బీఐ పంపిన అనామ్ ఫోన్ లలోని సీక్రెట్ యాప్ లు ఎప్పటికప్పుడు డేటా మొత్తం అమెరికాలోని సర్వర్ కు ట్రాన్స్ ఫర్ చేసేశాయి.
16 దేశాల్లో ముఠాల వేట
అండర్ వరల్డ్, డ్రగ్ మాఫియా గ్యాంగులు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, సెర్బియా వంటి అనేక దేశాల పోలీసులు, యూరోపోల్ (యూరప్ పోలీస్ ఏజెన్సీ), సెక్యూరిటీ సంస్థలతో కలిసి ఎఫ్బీఐ ఈ ఆపరేషన్ చేపట్టింది. లక్షలాది మెసేజ్లు, ఫొటోలను ప్రాసెస్ చేశారు. దీంతో టన్నుల కొద్దీ డ్రగ్స్ ప్యాకెట్లు, వెపన్స్, క్రిమినల్స్ ఫొటోలు, మర్డర్లు, ఇతర నేరాలకు ప్లాన్ ల వంటివన్నీ ఎఫ్బీఐ చేతికి చిక్కాయి. ఎఫ్బీఐ అందించిన డేటాతో తాజాగా ఆయా దేశాల్లోని పోలీసులు క్రిమినల్ గ్యాంగ్స్ పై విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియాలో 200 మందిని, స్వీడన్ లో 155, ఫిన్లాండ్ లో 100, జర్మనీలో 70, నెదర్లాండ్స్ లో 49, న్యూజీలాండ్ లో 35 మందిని, ఆయా దేశాల్లో మిగతావారిని డ్రగ్స్, వెపన్స్ తో సహా పట్టుకున్నారు.