వరుణ్ తేజ్ హీరోగా యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవకపోవడంతో పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. తాజాగా ‘రెడీ టు టేకాఫ్’ అంటూ సోమవారం కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.
ఫిబ్రవరి 16న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు మోషన్ పోస్టర్‌తో ప్రకటించారు. త్వరలోనే టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు. ‘అతిపెద్ద వైమానిక దాడుల్లో ఒకదానికి సాక్ష్యం’ అంటూ మోషన్ పోస్టర్‌లో చూపిస్తూ సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
