ఉమ్మడి పాలమూరుకు కష్టకాలం

ఉమ్మడి పాలమూరుకు కష్టకాలం
  • ఉమ్మడి పాలమూరుకు కష్టకాలం
  •  రిజర్వాయర్​ ఎండుతున్నా  కరెంట్​ ఉత్పత్తి ఆపని     
  • తెలుగు రాష్ట్రాలు మరో 10 టీఎంసీలే  దిక్కు
  • యాసంగి పంటలకు తిప్పలే
  • ఏప్రిల్​, మే నెలల్లో తాగునీటికి కటకట 


నాగర్​కర్నూల్​, వెలుగు:  రెండు తెలుగు రాష్ట్రాలు కరెంట్​ ఉత్పత్తి కోసం శ్రీశైలం రిజర్వాయర్ ను పోటీపడి ఖాళీ చేస్తుండడంతో డెడ్ స్టోరేజీకి చేరువవుతోంది. ప్రస్తుత  నీటిమట్టం 811 అడుగులకు పడిపోయింది.  డెడ్​స్టోరేజీ లెవల్​ 800 అడుగులు కాగా, 35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా 10 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునే అవకాశముంది.  కేఎల్​ఐ (కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​) కింద నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో దాదాపు 1.80 లక్షల ఎకరాల్లో యాసంగి వరి పొలాలకు, ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 4వేల హాబిటేషన్ల తాగునీటి అవసరాలకు ఈ నీళ్లే దిక్కు. ఏప్రిల్​లో రెండు, మూడు వారాలు గడిస్తే తప్ప పంటలు చేతికి రావు.  ప్రభుత్వాల తీరు చూస్తుంటే  అప్పటిదాకా నీళ్లు వచ్చేలా లేవు. దీంతో పంటలు ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూసి  ఏప్రిల్​, మే, జూన్ ఎలా గట్టెక్కాలోనని మిషన్​ భగీరథ ఆఫీసర్లు కూడా టెన్షన్​ పడుతున్నారు. ​

శ్రీశైలం  ఎండుతున్నా ఆగని విద్యుత్ ఉత్పత్తి..

కరువు పీడిత ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని  శ్రీశైలం రిజర్వాయర్​లోని నీటిని పొదుపుగా 
వినియోగించాల్సిన రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడి మరీ కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాయి. శుక్రవారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీశైలం రిజర్వార్ నుంచి దాదాపు 3 ఎంయూల కరెంట్​ ఉత్పత్తి చేశాయి. కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి ఏపీ సర్కారు 1079 క్యూసెక్కుల నీటిని వాడుతూ 0.497 ఎంయూల కరెంట్​ ఉత్పత్తి చేయగా, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ ప్రభుత్వం 4815 క్యూసెక్కుల నీటిని వాడుతూ 2.233 ఎంయూల కరెంట్​ ఉత్పత్తి చేసింది.  నిజానికి శ్రీశైలం రిజర్వాయర్​లో 800 అడుగుల వరకు నీరున్నా ఏపీ వైపు ఉన్న ముచ్చుమర్రి, తెలంగాణ వైపున్న కేఎల్ఐ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉంది. కేఎల్​ఐ కింద యాసంగి పంటలు, తాగునీటి అవసరాలను కాదని కరెంట్ ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వడంపై విమర్శలు వస్తున్నాయి.

కేఎల్​ఐ కింద 3 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు.. 

కేఎల్ఐ లిఫ్ట్​ కింద నాగర్ కర్నూల్​, వనపర్తి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో 3లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగయ్యాయి. దాదాపు 1.80 లక్షల ఎకరాల్లో వరి, 1.20 లక్షల ఎకరాల్లో పల్లి, ఇతర పంటలు వేశారు. ఇప్పటికే పల్లి కోతలు మొదలుకాగా,  వరి కోతలు ఏప్రిల్ ​రెండో  వారంలో మొదలవుతాయి.  వరి కోతలకు వారం రోజుల ముందు వరకు నీటితడులు ఇవ్వాల్సి ఉంటుంది.   మరోవైపు ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 4వేల హాబిటేషన్లకు ఏప్రిల్​ నుంచి మూడు నెలల పాటు తాగునీరు ఇవ్వాలంటే  దాదాపు 6 టీ ఎంసీల నీరు అవసరమని ఆఫీసర్లు అంటున్నారు. మిగిలిన  4 టీ ఎంసీలతో  వరి పంటను కాపాడుకోవడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.  ఇప్పటికే మూడు రోజులకు ఒకసారి సాగునీరు వదులుతున్నారు. చెరువులు, బోర్ల కింద సాగు చేసిన రైతులకు  ఇబ్బంది లేకపోయినా కాల్వల కింద సాగవుతున్న  వరి  పంటలపై  ఆందోళన వ్యక్తమవుతోంది.  నిజానికి  కేఎల్​ఐ కింద  కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో  2.40 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు వీలుగా నాలుగు రిజర్వాయర్లు, మూడు లిప్టులు ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా మెయిన్​  కెనాల్స్​కు నిర్మించారు. 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నాలుగు రిజర్వాయర్ల ద్వారా  500 చెరువులు నింపి, వాటి కింద సాగునీరివ్వాలని భావించారు. నీటి లభ్యతను పట్టించుకోకుండా ఏటా విస్తీర్ణం పెంచుకుంటూపోయారు.  గణపూర్, పస్పుల బ్రాంచ్​ కెనాళ్లను వనపర్తి నియోజకవర్గం నుంచి  దేవరకద్ర నియోజకవర్గం వరకు పొడిగించారు. దీంతో ముందు నిర్ణయించిన ఆయకట్టుకన్నా విస్తీర్ణం పెరిగింది.  ఆమేరకు రిజర్వాయర్ల కెపాసిటీ పెంచకపోవడంతో కృష్ణాలో నీళ్లున్నా ఎత్తిపోసుకోలేని పరిస్థితి. అటు కాల్వల నిర్వహణ, రిపేర్లను పట్టించుకోకపోవడంతో మూడు ప్యాకేజీల పరిధిలో  చివరి ఆయకట్టుకు  సాగునీరందక రైతులు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగుతున్నారు.   

భగీరథకు రివర్స్​పంపింగే గతి? 

గతేడాది మార్చి మొదటి వారంలోనే తాగునీటి కష్టాలు మొదలు కాగా శ్రీశైలం నుంచి రివర్స్​ పంపింగ్​ ద్వారా నీటిని ఎత్తిపోశారు. అక్కడి నుంచి కేఎల్​ఐ ద్వారా లిఫ్ట్​ చేసి ఎల్లూరు పంపుహౌజ్ నుంచి తాగునీరందించారు. రివర్స్​ పంపింగ్​కు రోజు రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. గతేడాది 15 రోజులు రివర్స్ ​పంపింగ్​  తో డెడ్​స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోయడానికి ఇరిగేషన్​, భగీరథ అధికారులు  రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారు.  అవసరమైతే ఈసారి కూడా  రివర్స్​ పంపింగ్ ​చేస్తామని చెప్తున్నారు. 

 ముందుచూపులేదు 

కేఎల్​ఐ కింద లక్షల ఎకరాలకు నీరిస్తున్నామని చెప్పుకోవడానికే కాల్వలను పొడిగించారు.  రిజర్వాయర్ల కెపాసిటీ పెంచాలని ఎన్నిసార్లు చెప్పినా  ప్రభుత్వం పట్టించుకోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు దీనిపై ధ్యాసే లేదు. లక్షల్లో  పెట్టుబడులు  పెట్టి పంటలు వేసుకుంటున్న రైతులు అప్పులపాలవుతారు. కృష్ణానదికి ఏటా వరదలు వస్తున్నా జిల్లాలో యాసంగి పంటలు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు.  కాళేశ్వరం ప్రాజెక్టు మీదున్న శ్రద్ధలో నయాపైసా పాలమూరు జిల్లా మీదున్నా రిజర్వాయర్ల నిర్మాణం జరిగేది. డిస్ట్రిబ్యూషన్​ నెట్​ వర్క్​ పూర్తయ్యేది.  యాసంగి పంట చేతికొచ్చేదాక  నీరివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.    
- నాగం జనార్దన్​ రెడ్డి, మాజీ మంత్రి

కొల్లాపూర్​కే గతి లేదు

మిషన్​ భగీరథ స్కీంలకు  భూసేకరణ కింద వేల ఎకరాలు కోల్పోయిన కొల్లాపూర్​ రైతులకు సరిగ్గా సాగునీరు అందడంలేదు. సింగోటం, జొన్నలబొగడ రిజర్వాయర్ల కింద కాల్వలు పూడుకుపోయి, జమ్ము పెరిగిపోయింది. కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో సాగునీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. రైతులే స్వంత ఖర్చుతో కాల్వలు రిపేర్లు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతానికే నీరు అందడం లేదంటే  కొత్త ప్రాంతాలకు మళ్లిస్తున్నారు.  
- ఎల్లేని సుధాకర్​ రావు, 
   బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​  ​