ఆ అధికారి వద్దు !.. ఆఫీసర్లపై సీఈఓకు, ఈసీకి పెరుగుతున్న కంప్లైంట్స్

ఆ అధికారి వద్దు !.. ఆఫీసర్లపై సీఈఓకు, ఈసీకి పెరుగుతున్న కంప్లైంట్స్
  • ఆ అధికారి వద్దు !
  • ఆఫీసర్లపై సీఈఓకు, ఈసీకి పెరుగుతున్న కంప్లైంట్స్​
  • జనగామ కలెక్టర్ పై ప్రతిపక్ష నాయకుల ఫిర్యాదు
  • ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని వెల్లడి
  • మరో ఇద్దరు కలెక్టర్లపైనా ఈసీకి మెయిల్

హైదరాబాద్, వెలుగు : కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి ఆఫీసర్లపై కంప్లైంట్స్​ వెల్లువెత్తుతున్నాయి. బుధవారం 20 మంది అధికారులపై ఈసీ బదిలీ వేటు వేయడంతో.. మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాల నుంచి ఫలాన ఆఫీసర్​ తమకొద్దంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని పేర్కొంటున్నారు. సీఈఓను కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా.. ఈసీకి కూడా డైరెక్ట్​ మెయిల్స్​ పంపుతున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్లు, ఎస్పీలు, కిందిస్థాయి ఆఫీసర్లపై 10కి పైగా కంప్లయింట్స్​ వచ్చినట్లు తెలిసింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.

 జనగామ కలెక్టర్ శివలింగయ్యపై ప్రతిపక్ష నాయకులు గురువారం సీఈఓకు  కంప్లైంట్ చేశారు. అధికార పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సాఆర్​టీపీతో పాటు ఇతర నాయకులు ఫిర్యాదు​చేశారు. మరో ఇద్దరు కలెక్టర్లపైనా ఆన్​లైన్​లో కంప్లైంట్స్​ అందాయి. డీజీపీ అంజనీ కుమార్​పై కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. 

ఆఫీసర్లలో మొదలైన భయం

ఈసీ సడెన్​గా ఇరవై మంది అధికారులను బదిలీ చేయడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలక్షన్    ​కమిషన్​ హెచ్చరిక లు జారీ చేసినా.. ఈ స్థాయిలో ట్రాన్స్​ఫర్ల వేటు ఉం టుందని ఎవరూ ఊహించలేదు. దీంతో మిగిలిన ఆఫీసర్లందరిలో వణుకు మొదలైంది. ఎలక్షన్​ డ్యూటీ.. పార్టీలకు, లీడర్లకు అతీతంగా, ఎవరికీ అనుకూలం, వ్యతిరేకంగా ఉండదు అనే విధంగా వ్యవహారశైలి మార్చేసుకున్నారు. 

డిసెంబర్​ 3 దాకా తమను సక్రమంగా ఎలక్షన్​ డ్యూటీ చేసుకొనిస్తే తమకు అదే పదివేలు అని ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. వేటు తప్పదని ఈసీ హెచ్చరించిన నేపథ్యంలో ఇదే విషయాన్ని తమకు పోస్టింగ్​ వచ్చేలా సహకరించిన ప్రజాప్రతినిధులకు కూడా ఐఏఎస్​లు, ఐపీఎస్​లు స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. రూలింగ్​ పార్టీ లీడర్లు అధికారుల దగ్గరకు వెళ్లి ఏదైనా చెప్పినా ఉపయోగం ఉండటం లేదని అంటున్నారు.