ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఫైనల్​ కాలే..

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఫైనల్​ కాలే..
  • పోటీకి నిరాకరించిన ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్
  • ఢిల్లీలో మమతా బెనర్జీ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల మీటింగ్
  • మరో అభ్యర్థిని వెతికే పనిలో పార్టీలు
  • ఈ నెల 21 లోగా ఎంపిక చేసేందుకు కసరత్తు
  • పార్టీలతో సంప్రదింపులకు కొందరు లీడర్లతో ప్యానెల్
  • తెరపైకి గోపాల్​కృష్ణ గాంధీ, ఫరూఖ్​ అబ్దుల్లా

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రప‌తి అభ్యర్థి ఎవ‌ర‌నేది తేలకుండానే ప్రతిపక్షాల సమావేశం ముగిసింది. ఉమ్మడి అభ్యర్థిని నిల‌బెట్టాల‌నే ఏకాభిప్రాయం మాత్రం కుదిరింది. ముందుగా ఎన్సీపీ చీఫ్​ శరద్‌ పవార్‌‌తో పోటీ చేయించాలని భావించినా.. ఆయన ఒప్పుకోకపోవడంతో ఇంకో అభ్యర్థిని ఎంపిక చేయనున్నాయి. బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో తీర్మానం చేశాయి. అయితే ఆ క్యాండిడేట్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. ‘‘మేమందరం కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాం. ఆ అభ్యర్థికి అందరం మద్దతు ఇస్తాం. ఇతరులతోనూ చర్చలు జరుపుతాం. ఇది మంచి ప్రారంభం. మరోసారి భేటీ అవుతాం’’ అని మమత చెప్పారు. 

సమావేశానికి హాజరు కాని పార్టీలు.. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వవని, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని మమత, ఇతర నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ, డీఎంకే, ఆర్‌‌జేడీ, శివసేన, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్, ఆర్‌‌ఎస్‌పీ, ఐయూఎంఎల్, ఆర్‌‌ఎల్‌డీ, జేఎంఎం పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, జైరామ్ రమేశ్, జేడీఎస్ నుంచి హెచ్‌డీ దేవెగౌడ, కుమారస్వామి, ఎన్సీపీ నుంచి శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్, ఎస్పీ నుంచి అఖిలేశ్ తదితరులు పాల్గొన్నారు. శిరోమణి అకాళీదళ్, ఆప్​, టీఆర్ఎస్, వైఎస్సార్‌‌సీపీ, బీజేడీ పార్టీలు హాజరుకాలేదు.

కాంగ్రెస్‌ లేకుండా సాధ్యం కాదు: ఖర్గే

రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలో కాంగ్రెస్‌ లేకుండా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టలేరని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. ‘‘మా మద్దతు లేకుండా ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలబెట్టలేవు. మాకు దాదాపు 50 శాతం ఓట్లు ఉన్నాయి. కలిసికట్టుగా పోరాడాలనే ఉద్దేశంతో మేం మీటింగ్‌కు హాజరయ్యాం. ఐక్యతను బ్రేక్ చేయడం మాకు ఇష్టం లేదు” అని అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఇంకా ఎంతో మంది లీడర్లు మీటింగ్‌కు రాలేదని అన్నారు.

పిలవలేదు.. పిలిచినా పోను: ఒవైసీ
మమత మీటింగ్‌కు తనకు ఆహ్వానం అందలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ‘‘నన్ను పిలవలేదు. పిలిచినా నేను వెళ్లేవాడిని కాదు. కారణం కాంగ్రెస్. మా గురించి చెడుగా మాట్లాడే టీఎంసీ వాళ్లు మమ్మల్ని ఆహ్వానించినా.. కాంగ్రెస్‌ని పిలిచారన్న కారణంతో మేం వెళ్లబోం’’ అని 
తెలిపారు.