‘కాశ్మీర్​’కు మద్దతు ఎందుకిచ్చారంటే..

‘కాశ్మీర్​’కు మద్దతు  ఎందుకిచ్చారంటే..

కాశ్మీర్​ డివిజన్​ బిల్లు ఆమోదం పొందడం ఒక విశేషమైతే, అనుక్షణం మోడీ సర్కారుతో ఉప్పు-నిప్పులా ఉండే పార్టీలు మద్దతు పలకడం మరో విశేషం. ఢిల్లీకి ఫుల్​ స్టేట్​ స్టేటస్​ని డిమాండ్​ చేస్తున్న ఆప్​ కన్వీనర్​ కేజ్రీవాల్, యూపీలో మైనారిటీలకు పెద్ద దిక్కుగా ఉండే ఎస్​పీ, బీఎస్​పీ, మోడీతో విభేదించి దోస్తీ కటీఫ్​ చేసుకున్న టీడీపీ, ఒడిశాలో పోటీపడ్డ బీజేడీ కేంద్రానికి మద్దతు పలికాయి.

కాశ్మీర్ బిల్లుల విషయంలో పార్టీల స్టాండ్​కి అతీతంగా దాదాపుగా అన్ని ప్రాంతీయ పార్టీలు కేంద్రంతో కలిసొచ్చాయి. తన నిర్ణయానికి మద్దతు కూడగట్టడంలో మోడీ ప్రభుత్వం విజయం సాధించింది. అనేక అంశాలపై తరచూ విభేదించే ఆమ్​ ఆద్మీ, బహుజన సమాజ్​, సమాజ్​వాది వంటి పార్టీలు ‘ఆర్టికల్ 370 రద్దు’కి మద్దతు పలకడం విశేషం. ముందుగా పాజిటివ్​గా స్పందించింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.  లెఫ్టినెంట్ గవర్నర్ ను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రిగా తనకున్న హక్కులను హరించవేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ గతంలో రచ్చ రచ్చ చేశారు. ఆర్నెల్లలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో అమీతుమీ తేల్చుకోవడానికి ఆప్​ రెడీ అవుతోంది. అలాంటి పార్టీ  ఆర్టికల్ 370 ని రద్దు చేయడాన్ని స్వాగతించింది. కాశ్మీర్​లో శాంతి నెలకొంటుందన్న విశ్వాసం తనకుందని  అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.  ఆప్ మద్దతు ఇవ్వడానికి  కొన్ని  ప్రత్యేక కారణాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ రాజకీయాలపై కాశ్మీర్ అంశం ప్రభావం బాగా ఉంటుంది. కాశ్మీర్ నుంచి కొన్నేళ్ల కిందట వలస వచ్చిన కాశ్మీరీ పండిట్లు పెద్ద సంఖ్యలో ఢిల్లీలో సెటిల్ అయ్యారు. ఢిల్లీ ఒక్కటే కాదు, ఆమ్​ ఆద్మీకి పట్టున్న పంజాబ్​, యూపీ వంటి రాష్ట్రాల్లోకూడా కాశ్మీరీ పండిట్లు ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీరీ పండిట్లకు రిలీఫ్ లభించినట్లయింది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ మద్దతు పలికినట్లు ఎనలిస్టులు చెబుతున్నారు.

ఆశ్చర్యపరిచిన టీడీపీ

వాజ్​పేయి హయాం నుంచీ ఎన్డీయేలో ఉండి ఆ తర్వాత బయటికొచ్చిన తెలుగు దేశం పార్టీ కూడా సపోర్టు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాశ్మీర్ ఇష్యూతో ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్​లో కాశ్మీరీ పండిట్లు లేరు. దాదాపు ఏడాది కాలంగా బీజేపీ, టీడీపీ సంబంధాలు ఏమాత్రం బాగా లేవు. లోక్​సభ ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక కూటమి కట్టడానికి టీడీపీ ప్రయత్నించింది కూడా. అలాంటిది పాత గొడవల జోలికి వెళ్లకుండా కేంద్రానికి మద్దతు పలుకుతుందని ఎవరూ ఊహించలేదు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో… వ్యూహాత్మకంగా బీజేపీతో దోస్తీకి టీడీపీ మళ్లీ ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

శివసేన కూడా…

ఎన్డీయే భాగస్వామి శివసేన మొదటి నుంచి ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తోంది. అందుకే ‘బాల్ థాక్రే బతికుంటే ఎంతో సంతోషించి ఉండేవార’ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ బాటలో మిత్రపక్షాలు

కేంద్రం నిర్ణయాన్ని కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించినా, అదంతా పొలిటికల్ ఈక్వేషన్స్ ఆధారంగానే జరిగింది. కాంగ్రెస్ వ్యతిరేకించింది కాబట్టి, ఆ పార్టీకి దగ్గరగా ఉండే డీఎంకే, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. ఇవి కాకుండా… ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ(యు) కాశ్మీర్​ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడడం విశేషం.

ట్రెండ్ని ఫాలో అయిన బీజేడీ

మొదట్లో ఎన్డీయేలో ఉండే బీజేడీ దాదాపు పదేళ్ల క్రితం విడిపోయింది. తాజాగా జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు హోరాహోరీ తలపడ్డాయి. కాశ్మీర్ అంశంపై దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్​ని బీజేడీ ఫాలో అయ్యిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా అధికారానికొచ్చిన వైసీపీ కూడా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి అండగా నిలిచింది.  వైసీపీకి తెలుగుదేశంతోనే ఫైటింగ్. ఏపీలో బీజేపీ ఉనికి నామమాత్రమే. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంతో అవసరాలుంటాయి. ఇది దృష్టిలో పెట్టుకునే వైసీపీ జై కొట్టినట్లు చెబుతున్నారు.

బీఎస్పీ కూడా…..

మోడీ ప్రభుత్వం మనువాదాన్ని అనుసరిస్తోందని విమర్శలు చేసే బీఎస్పీ కూడా కాశ్మీర్​ విషయంలో తొందరపడలేదు. ఎందుకంటే, బీఎస్పీకి కొన్ని లెక్కలున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్​, ఢిల్లీ రాష్ట్రాల్లో బీఎస్పీకి కొంత మేరకు బలముంది.

అక్కడి అన్ని  పార్టీలూ బీఎస్పీ మద్దతుని ఆశించడం సాధారణం. బీఎస్పీకి మంచి కేడర్ బలం ఉన్న ఈ రాష్ట్రాల్లో కాశ్మీరీ పండిట్లు వలస వచ్చేసి ఉన్నారు. మోడీ సర్కార్ విధానాలపై  విభేదాలను పక్కన పెట్టి… ఆర్టికల్​ 370 రద్దుకి బీఎస్పీ చీఫ్ మాయావతి మద్దతు పలికారు.