పార్లమెంట్ లో విపక్ష పార్టీల సమావేశం... సస్పెన్షన్ పై చర్చ

పార్లమెంట్ లో విపక్ష పార్టీల సమావేశం... సస్పెన్షన్ పై చర్చ

పార్లమెంట్ సమావేశాల్లో క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ విపక్షాలకు చెందిన 12 మంది రాజ్యసభ ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఎంపీలను శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోరాటానికి విపక్ష పార్టీలు సన్నద్ధమౌతున్నాయి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమావేశాలను బహిష్కరించాలని కొన్ని పార్టీలు సూచించాయి. అయితే కాంగ్రెస్‌ మాత్రం సభకు హాజరై ప్రతిఘటించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలతో కాంగ్రెస్‌ సమావేశం ఏర్పాటు చేసింది. మల్లికార్జున ఖర్గె ఆఫీసులో ఈ మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా హాజరయ్యారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తూ నిన్న 14 పార్టీలు జారీ చేసిన ప్రకటనపై కూడా టీఆర్‌ఎస్‌ సంతకం చేసింది. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ క్షమాపణలు చెప్పాలన్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో క్షమాపణలు మాత్రం చెప్పేది లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విపక్ష సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఈ రకమైన చర్యలకు పాల్పడ్డారని ఖర్గే ఆరోపించారు. 

సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ సహా పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ వారిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సస్పెండ్‌ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు ఆరుగురు ఉండగా శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.