‘పిల్లల స్కిన్ కేర్ కోసం ఆర్గానిక్‌‌ క్లాతింగ్‌‌

‘పిల్లల స్కిన్ కేర్ కోసం ఆర్గానిక్‌‌ క్లాతింగ్‌‌

ఆంధ్రప్రదేశ్‌‌లోని తాడేపల్లిగూడెంకు చెందిన వందన, నాగర్​కర్నూల్​ జిల్లా  అచ్చంపేటకు చెందిన స్మృతి ఇద్దరూ హైదరాబాద్‌‌లోని ‘ఎన్‌‌ఐఎఫ్‌‌టి’ (నేషనల్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఫ్యాషన్ డిజైనింగ్‌‌)లో గ్రాడ్యుయేషన్ చేశారు. యుఎస్‌‌లో మాస్టర్స్‌‌ కూడా చేసింది వందన. తరువాత పాపులర్ డిజైనర్స్‌‌ దగ్గర, కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్‌‌‌‌ చేశారు ఈ ఇద్దరూ. కొన్ని రోజులకి ‘పిల్లల స్కిన్ కేర్ కోసం ఆర్గానిక్‌‌ క్లాతింగ్‌‌ తయారుచేస్తే ఎలా ఉంటుంద’ని వందనకు వచ్చిన ఆలోచనే ‘కీబీ’ స్టార్ట్‌‌ చేసేలా చేసింది.  

ఆలోచనకు కారణం అమ్మాయే

పెండ్లి అయ్యాక కూడా జాబ్‌‌ చేసేది వందన. పాప పుట్టాక జాబ్‌‌ మానేయాల్సి వచ్చింది. ఒకరోజు సరదాగా ‘పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావ’ని కూతుర్ని అడిగింది వందన. ఆ పాప ‘నీలాగ, నాన్నమ్మలాగ ఇంట్లోనే ఉంటా’అని చెప్పింది. అదివిన్న వందన ‘పిల్లలు మనల్ని చూస్తూ పెరుగుతారు. మనల్ని వాళ్ల రోల్‌‌మోడల్‌‌గా చూస్తారు. నేను ఇంట్లోనే ఉంటే, నన్ను చూస్తూ పెరిగిన నా కూతురు ఏమైపోతుందో’ అని భయపడింది. అంతే వెంటనే ఏదైనా మొదలుపెట్టాలనుకుంది. తను చదివిన చదువు ఉపయోగపడేలా డిజైనింగ్‌‌ వైపు అడుగులు వేసింది.

మనదేశంలో ఆర్గానిక్‌‌ క్లాతింగ్‌‌ అంత ఎక్కువ దొరకదు. ప్యూర్‌‌‌‌ కాటన్‌‌, సాఫ్ట్‌‌ మెటీరియల్ కూడా తక్కువే. అందుకే తన పిల్లలకోసం ఇతర దేశాలనుంచి బట్టలు, స్కిన్‌‌ కేర్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌ తెప్పించేది వందన. ఇక్కడ దొరకని ఆర్గానిక్‌‌ క్లాతింగ్‌‌పై బిజినెస్‌‌ చేయాలనుకుంది. అందుకే 2016లో కీబీ ఆర్గానిక్‌‌ క్లాతింగ్‌‌ పెట్టింది. వందన ఆలోచన నచ్చి స్మృతి కూడా తనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. సి.జి.టి.ఎం.ఎస్‌‌. 

( క్రెడిట్​ గ్యారెంటీ ఫండ్​ ట్రస్ట్​ ఫర్​ మైక్రో అండ్​ స్మాల్​ ఎంటర్​ప్రైజెస్​) గవర్నమెంట్‌‌ నుంచి 15 లక్షల లోన్‌‌ తీసుకొని బిజినెస్‌‌ మొదలుపెట్టారు. అలా 2017నుంచి వాళ్ల ప్రొడక్ట్స్‌‌ని ఎగ్జిబిషన్స్‌‌లో, వెబ్‌‌సైట్‌‌లో పెట్టి అమ్మేవాళ్లు. 2019లో ఫస్ట్‌‌ క్రై వెబ్‌‌సైట్‌‌లో ప్రొడక్ట్స్‌‌ని లాంచ్‌‌ చేశాక మార్కెటింగ్‌‌ పెరిగి, కీబీ ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్‌‌ అందరికీ తెలిసింది. అప్పటినుంచి ఇతర ఆన్‌‌లైన్‌‌ స్టోర్స్‌‌లో కూడా ప్రొడక్ట్స్‌‌ పెట్టారు. కీబీలో డిజైనింగ్‌‌ వందన చూసుకుంటే, మార్కెటింగ్ స్మృతి చూసుకుంటుంది.   

ఆర్గానిక్‌‌ క్లాతింగ్‌‌ అంటే...

శరీరానికి హాని కలిగించే ఎలాంటి కెమికల్ కలర్స్‌‌ వాడకుండా, కెమికల్స్‌‌, పెస్టిసైడ్స్‌‌ వాడకుండా పండించిన పత్తితో తయారుచేసిన గుడ్డను ఆర్గానిక్‌‌ మెటీరియల్‌‌ అంటారు. ఇతర మెటీరియల్స్‌‌లో కెమికల్స్‌‌ ఉంటాయి. అవి చర్మంలోకి వెళ్లి క్యాన్సర్‌‌‌‌కి దారి తీసే అవకాశం ఉంది. దానివల్ల పిల్లల్లో స్కిన్ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. స్కిన్‌‌ రఫ్‌‌గా అవుతుంది. అందుకని పిల్లలకు ఆర్గానిక్‌‌ క్లాతింగ్‌‌ వాడితే ఆ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఈ క్లాత్‌‌కి వాడే కలర్స్‌‌ కూడా నేచురల్స్‌‌వి వాడేవాళ్లు. అయితే, అవి తొందరగా వెలిసిపోయేవి. అందుకే వాటికి బదులు ఎకో ఫ్రెండ్లీ కలర్స్ వాడుతున్నారు. వీటివల్ల కూడా చర్మానికి హాని జరగదు. ఎక్కువ కాలం వెలిసిపోకుండా ఉంటాయి కూడా. ఆన్‌‌లైన్‌‌, ఆఫ్‌‌లైన్‌‌లో కలిపి నెలకి వెయ్యికి పైగా ప్రొడక్ట్స్‌‌ అమ్ముతున్నారు.

సర్టిఫికెట్‌‌ ఉన్న దగ్గరనుంచే..

‘‘గాట్స్‌‌ (గ్లోబల్‌‌ ఆర్గానిక్‌‌ టెక్స్‌‌టైల్‌‌ స్టాండర్డ్స్‌‌) వాళ్లు ఈ ఆర్గానిక్ క్లాత్స్‌‌కి సర్టిఫికెట్‌‌ ఇస్తారు. వాళ్లు క్లాత్‌‌ని కొన్ని స్టేజ్‌‌ల్లో క్లాసిఫై చేసి ఈ సర్టిఫికెట్ ఇస్తారు. మన దేశంలో ముంబై, చెన్నై, గుజరాత్‌‌లో గాట్స్‌‌ సర్టిఫికెట్‌‌ పొందిన టెక్స్‌‌టైల్‌‌ కంపెనీలు ఉన్నాయి. వాటినుంచే మెటీరియల్‌‌ని కొని బొల్లారంలోని యూనిట్‌‌లో బట్టలు కుడతాం. దానికోసం దాదాపు 15 మంది టైలర్స్‌‌ పనిచేస్తున్నారు” అని చెప్పారు వందన, స్మృతి. 

::: కొలనుపాక భరత్​