సర్వరోగ నివారిణిగా ‘‘ఆర్గానిక్’’

సర్వరోగ నివారిణిగా ‘‘ఆర్గానిక్’’

ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ తింటున్నామంటే..

పర్యావరణాన్ని కాపాడుతున్నట్టే!

భవిష్యత్తు తరాలకు భరోసా ఇచ్చినట్టే!

ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకున్నట్టే!

రైతుకు ఆసరా అయినట్టే!

‘‘ఇప్పుడంతా మందుల తిండి. ఒకప్పుడు నేచురల్ ఎరువులేసి పండించేటోళ్లం అందుకే ఇంత గట్టిగున్నం” ప్రతి ఇంట్లో పెద్దోళ్లు చెప్పే మాటే ఇది. ఫెస్టిసైడ్స్‌‌ లేని ఫుడ్‌‌ తిన్నారు కాబట్టే వాళ్లు ఎన్ని సమస్యలొచ్చినా తట్టుకున్నారు. మనకు బతకడానికి కావాల్సిన రిసోర్స్‌‌లను ఇవ్వగలిగారు. మనం మన పెద్ద వాళ్ల నుంచి తీసుకున్నట్టే మన పిల్లలకీ వాటిని అందివ్వగలగాలి. మరి ఇవ్వగలుగుతున్నామా? కచ్చితంగా ఇవ్వట్లేదు. భూమిలో సారం తగ్గిపోయింది. మనం పెట్టే తిండి తినడం వల్లే పిల్లలు చిన్న హెల్త్‌‌ ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. అందుకే మళ్లీ ‘ఆర్గానిక్‌‌’ వైపు చూస్తున్నారు. కానీ.. పూర్తిగా ఆర్గానిక్ ఫుడ్‌‌ తినడం సాధ్యమేనా?

కొన్నేళ్ల నుంచి జనాల్లో హెల్త్‌‌పై అవగాహన బాగా పెరుగుతోంది. అందుకే మంచి ఫుడ్‌‌ అలవాట్లు చేసుకుంటున్నారు. ఇంకొందరు మరో మెట్టెక్కి వ్యాయామం కూడా చేస్తున్నారు. అయితే.. మంచి ఫుడ్‌‌ అలవాట్లు చేసుకుంటున్నవాళ్లలో చాలామంది.. క్వాలిటీ ఫుడ్‌‌నే తినాలనుకుంటున్నారు. పైగా కరోనా అందరినీ అలర్ట్ చేసింది. కరోనాకు ముందు ఏది పడితే అది తినేవాళ్లు కూడా ఇప్పుడు ఎందులో ప్రొటీన్స్‌‌ ఉన్నాయి. ఎందులో విటమిన్స్‌‌, మినరల్స్‌‌ ఉన్నాయని తెలుసుకుని తింటున్నారు. కరోనా వైరస్ అందరి ఆలోచనల్ని ఒక్కసారిగా మార్చేసింది. మళ్లీ పాత ఆహారపు అలవాట్లను పరిచయం చేసింది. ఆరోగ్యం గురించి మళ్లీ ఆలోచించేలా చేసింది. ఏం తింటే మంచిది?  ఏది తింటే నష్టం? మనం ఏం తింటున్నాం? అది ఎలా పండిస్తున్నారు? ఎలా ప్రాసెస్‌‌ చేస్తున్నారు? ఎలా స్టోరేజీ చేస్తారు? ఇలా.. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలుపెట్టారు. చివరగా వాళ్లకు దొరికిన సొల్యూషన్‌‌ ‘ఆర్గానిక్ ఫుడ్‌‌’. సుమారు ఐదారేళ్లలో ఆర్గానిక్ ఫుడ్‌‌పై వచ్చిన అవగాహన ఇప్పుడు ఒకే సంవత్సరంలో వచ్చింది. ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ ఎందుకు తినాలో చాలామందికి ఓ క్లారిటీ వచ్చింది.

ఆర్గానిక్‌‌ ఎందుకు?

హెల్దీ ఫుడ్‌‌ కోసం వెతుకుతున్నప్పుడు ఆర్గానిక్‌‌ పద్ధతుల్లో పండినవి బెస్ట్ అని చాలా మంది తెలుసుకున్నారు. ఆర్గానిక్‌‌లో పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు మాత్రమే కాదు ప్రతి పంట ఆర్గానిక్‌‌ పద్ధతుల్లో పండించవచ్చు. అయితే.. ఆర్గానిక్‌‌ వల్ల ఏం లాభం లేదనే వాళ్లూ ఉన్నారు. అలాగే.. ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ బెస్ట్‌‌ అని చెప్పేవాళ్లూ ఉన్నారు. అయితే.. వీళ్లలో ఆర్గానిక్‌‌ బెస్ట్‌‌ అని చెప్పేవాళ్ల సంఖ్యే ఎక్కువ. ఆర్గానిక్‌‌ పద్ధతిలో ధాన్యాన్ని నేచురల్‌‌గా పండిస్తారు. అంటే.. పెరుగుదల కోసం, చీడ, పీడలను కంట్రోల్‌‌ చేయడానికి ఎలాంటి కెమికల్స్‌‌ వాడరు. పశువుల పేడ, ప్రకృతి ప్రసాదించిన సహజ ఉత్పత్తులను మాత్రమే వాడతారు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. భూమిలో సారం పెరుగుతుంది. మన ముందు తరాలకు నాణ్యమైన వనరులను అందించినవాళ్లం అవుతాం. పైగా ఫెస్టిసైడ్స్ వాడడం వల్ల ఎంతోమంది రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌ చేస్తే అలాంటి సమస్యలు ఉండవు. ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌ను ఎంకరేజ్ చేయడం వల్ల రైతులను కాపాడుకున్నవాళ్లం అవుతాం. పైగా ఆర్గానిక్‌‌ పండ్లు, కూరగాయల్లో హాని చేసే కెమికల్స్‌‌ ఉండవు.

ఆర్గానిక్‌‌కు మంచి రోజులు

ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ ఇండస్ట్రీ మన దేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా గడిచిన పదేళ్లలో చాలా డెవలప్‌‌ అయ్యింది. భవిష్యత్తులో ఇంకా డెవలప్‌‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ గురించి చాలామందికి అవగాహన పెరిగింది. అంతేకాకుండా కెమికల్స్‌‌ వేసి పండించిన పండ్లు, కూరగాయలు తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. దాంతో సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపేవాళ్ల సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌‌లో ఉంటున్న  స్వాతి ఒక అవేర్‌‌‌‌నెస్‌‌ ప్రోగ్రాంకి వెళ్లినప్పుడు ఆర్గానిక్‌‌ వెజిటబుల్స్‌‌ గురించి తెలుసుకుంది. అప్పటినుంచి ఆర్గానిక్‌‌ వెజిటబుల్స్‌‌ని కొనడం మొదలుపెట్టింది. ‘‘నేను ముందుగా వాటితో చేసిన సలాడ్లు, జ్యూస్‌‌ తీసుకోవడం మొదలుపెట్టా. వెంటనే తేడాను గమనించా. కాకపోతే మామూలు ఫుడ్‌‌తో పోలిస్తే.. ఆర్గానిక్‌‌కు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ.. వాటి హెల్త్ బెనిఫిట్స్‌‌ వల్ల తగ్గే హాస్పిటల్‌‌ ఖర్చుల కంటే వీటి ఖర్చు తక్కువే అనుకుంటున్నా. ఆర్గానిక్‌‌, మామూలు పండ్లు, కూరగాయల టేస్ట్ చూస్తే తేడా ఈజీగా తెలిసిపోతుంది’ అంటుంది స్వాతి.

అయితే.. పెరుగుతున్న డిమాండ్‌‌కు అనుగుణంగా ఆర్గానిక్‌‌ ఇండస్ట్రీ డెవలప్‌‌ కావడంలేదు అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌కి ఇంతలా డిమాండ్ పెరగడానికి చాలా కారణాలే ఉన్నప్పటికీ ముఖ్యంగా కొన్ని కారణాలు బాగా ఎఫెక్ట్‌‌ అయ్యేలా చేశాయి.

డిజిటల్ లిటరసీ

నాలుగైదేళ్ల నుంచి ఇండియాలో స్మార్ట్-ఫోన్ వాడకం బాగా పెరుగుతోంది. తక్కువ -ధరకే ఇంటర్నెట్‌‌ రావడంతో బ్రౌజింగ్‌‌ చేసేవాళ్ల సంఖ్య పెరిగింది. దాంతో ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌‌ ఈజీగా తెలుసుకోగలిగారు. అంతేకాకుండా ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ అమ్మేందుకు ఇ–-కామర్స్ సైట్లు ముందుకొచ్చాయి. కేవలం ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ మాత్రమే అమ్మే ఫ్లాట్‌‌ఫాంలు కూడా ఉన్నాయి. దానివల్ల వినియోగదారులకు ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ కొనడం కూడా సులభంగా మారింది. రైతుకు, వినియోగదారుడికి మధ్య ఈ ఫ్లాట్‌‌ఫాంలు వారధిలా పనిచేశాయి. ఒకప్పుడు నగరాల్లో ఉండేవాళ్లు మాత్రమే ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ ఎక్కువగా వాడేవాళ్లు. ఇప్పుడు చిన్న చిన్న టౌన్‌‌లలో కూడా వీటి వాడకం పెరిగింది. రాబోయే రోజుల్లో గ్రామాల్లో కూడా ఆర్గానిక్ ఫుడ్‌‌ స్టోర్లు వెలిసే అవకాశం ఉందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు.

ధరలో తక్కువ తేడా

మామూలు ప్రొడక్ట్స్‌‌తో పోలిస్తే.. ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ ధర ఎక్కువగా ఉంటుంది. అయితే.. గతంలో ఈ రేషియో చాలా ఎక్కువగా ఉండేది. కానీ.. ఇప్పుడు రైతుల్లో అవగాహన పెరగడం వల్ల చాలా మంది ఆర్గానిక్ సాగు మొదలుపెట్టారు. దాంతో సప్లై పెరిగి, ధరలు కాస్త తగ్గాయి. దీనివల్ల కూడా ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ కొనేవాళ్ల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్ కోసం చేసే ఖర్చుతో, హెల్త్ బెనిఫిట్స్‌‌ని పోల్చి చూస్తే చాలా ఖర్చు తగ్గినట్టు అవుతుంది అంటున్నారు ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ వాడేవాళ్లు.

గవర్నమెంట్ పథకాలు

ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌ చేసే రైతులకు ఆర్థిక సాయం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్‌‌ ఇస్తుంది. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ‘మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్’ (ఎన్‌‌ఎంఎస్‌‌ఏ), ‘మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్’ (మిడ్), ‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్’ (ఎన్‌‌ఎఫ్‌‌ఎస్‌‌ఎం), ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’ (ఆర్‌‌కెవివై) లాంటి సంస్థలు, పథకాలు ఆర్గానిక్‌‌ సాగుని పెంచేందుకు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్’ (ఎన్‌‌పిఓపి)ని అమలు చేస్తోంది. ఇందులో రిజిస్టర్‌‌‌‌ చేసుకున్న ఆర్గనైజేషన్స్‌‌కు అక్రిడిటేషన్స్‌‌ ఇస్తారు. ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ స్టాండర్డ్స్, ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌ని  ప్రోత్సహించడం వంటివి కూడా చేస్తోంది ఈ సంస్థ.

 

ఎగుమతులు  పెరిగినయ్‌‌

మన దేశంలో పండించిన ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌కి ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్‌‌ ఉంది. దేశంలో ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌కు కావాల్సిన వనరులు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇక్కడ పండే పండ్లు, కూరగాయల క్వాలిటీ కూడా చాలా ఎక్కువ. మన పండ్లు, కూరగాయలకు డిమాండ్‌‌ ఎక్కువ. అందుకే రైతులకు మద్దతు ధర దొరుకుతుంది. 2019––20 ఆర్థిక సంవత్సరంలో 4,686 కోట్ల రూపాయల విలువ చేసే ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ విదేశాలకు ఎగుమతి అయ్యాయి. రాబోయే ఐదేళ్లలో ప్రొడక్షన్‌‌, ఎక్స్‌‌పోర్ట్స్‌‌ బాగా పెరిగే అవకాశం ఉందనేది ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంచనా.

మారితే లాభం ఏంటి?

మన దగ్గర ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి. కొందరు ‘ఏ ఫుడ్‌‌ అయినా ఒకటే. ఏది తిన్నా ఆరోగ్యంగానే ఉంటాం’ అంటుంటే.. ఇంకొందరు ‘ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ తినడం వల్లే మేం చాలా ఆరోగ్యంగా ఉన్నాం’ అంటున్నారు. ఈ వాదనల విషయం అటుంచితే.. ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ తినడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు.

పోషకాలు ఎక్కువ

ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌లో విటమిన్– సి , ఐరన్, జింక్‌‌తో సహా న్యూట్రియంట్స్‌‌, మినరల్స్‌‌ మామూలు వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చుకుని వాడుకోవాలి.

కెమికల్స్‌‌ ఉండవు

ఇప్పుడు మన దగ్గర సాగు చేస్తున్న విధానాల్లో కెమికల్స్‌‌ ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యానికి హాని చేసే ఫెస్టిసైడ్స్‌‌, ఫర్టిలైజర్స్‌‌ పంటలకు వేస్తుంటారు. అలా పండించే పండ్లు, కూరగాయలు తినడం వల్ల కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌‌ వస్తుంటాయి. ఆర్గానిక్‌‌ పద్ధతుల్లో పంటకు కేవలం సహజంగా దొరికే వాటితోనే ఎరువులు తయారు చేస్తారు. కాబట్టి వీటిపై ఎలాంటి కెమికల్స్‌‌ ప్రభావం ఉండదు.

ఆర్టిఫిషియల్ హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఉండవు

ప్రొడక్టివిటీని పెంచేందుకు, ఎక్కువ లాభాలు పొందేందుకు కోళ్లు, మేకలు, గేదెలు, ఆవులకు హార్మోన్స్‌‌, యాంటీ బయాటిక్స్‌‌ ఇంజక్ట్‌‌ చేస్తారు. దానివల్ల ఆవులు, గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయి. కోళ్లు, మేకలు, గొర్రెలు చాలా తక్కువ టైంలో ఎదుగుతాయి. అయితే.. ఆ మాంసం తిన్నప్పుడు, పాలు తాగినప్పుడు అవి మన శరీరంలో చేరుతాయి. దాంతో హార్మోన్ల ఇంబాలెన్స్‌‌ సమస్య వస్తుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆర్గానిక్‌‌ పెంపకంలో ఎలాంటి ఇంజక్షన్లు ఇవ్వరు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవు.

యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి

మామూలు ఫుడ్‌‌తో పోలిస్తే ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయని అనేక స్టడీల్లో తేలింది. ఫెస్టిసైడ్స్‌‌ ఎక్కువగా వాడడం వల్ల యాంటి ఆక్సిడెంట్లు తగ్గుతాయి. ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌లో ఫెస్టిసైడ్స్‌‌ అసలే వాడరు. కాబట్టి ఆ సమస్య ఉండదు. అందుకే ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌లో యాంటిఆక్సిడెంట్స్‌‌ పుష్కలంగా ఉంటాయి.

కొనలేకపోవడానికి కారణం ఏంటి?

కరోనా వల్ల చాలామందికి ఆరోగ్యంపై అవగాహన పెరిగినా, మంచి ఆహార అలవాట్లను గురించి తెలుసుకున్నా, ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ మంచిదని తెలిసినా.. తినలేకపోతున్నారు. దానికి కారణం.. ఆదాయం లేకపోవడం. కరోనా వల్ల చాలా సెక్టార్లలో ఉద్యోగుల శాలరీలు తగ్గాయి. ఇంకొందరి జీతాలు తగ్గకపోయినా.. వాళ్లకు వచ్చే జీతంతో ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ కొనలేకపోతున్నారు. ‘కంప్లీట్‌‌ ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ తినడమంటే.. చాలా ఖర్చుతో కూడుకున్నది. డబ్బు ఉన్నవాళ్లు కొందరు ఆర్గానిక్‌‌కి మారినా.. డబ్బు లేనివాళ్లు మాత్రం కొన్ని మాత్రమే ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌‌ వాడుతున్నారు. ఉదాహరణకు ఒక నెల ఆర్గానిక్‌‌ పండ్లు కొంటే, మరో నెలలో ఆర్గానిక్‌‌ కూరగాయలు కొంటున్నారు. తర్వాతి నెలలో తేనె, టీ పౌడర్‌‌‌‌ లాంటివి కొంటున్నార’ని చెప్పారు. ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ రిటైలర్స్‌‌. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత మళ్లీ మామూలు లైఫ్‌‌ లీడ్‌‌ చేసే అవకాశం ఉన్నప్పుడు ఆర్గానిక్‌‌ సేల్స్ పెరగొచ్చు అంటున్నారు వాళ్లు.

 

 

అడ్డంకులు ఉన్నాయి

మామూలుగా పండించే పంటలను బయట మార్కెట్‌‌లో ఈజీగా అమ్ముకోవచ్చు. కానీ.. ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌కి అలాంటి ఫ్లాట్‌‌ఫామ్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి రైతుకు మార్కెటింగ్‌‌ చాలా కష్టంగా మారింది. డిమాండ్‌‌  కంటే.. ఎక్కువ సప్లై ఉన్నప్పుడు వాటిని మామూలు ధరకే అమ్మాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆర్గానిక్ రైతులకు నష్టాలు తప్పవు. అందుకే ఇప్పుడు కొన్ని సంస్థలు ఆర్గానిక్‌‌ రైతులను గుర్తించి, వాళ్ల దగ్గరికి నేరుగా వెళ్లి కొని, వాటిని కస్టమర్స్‌‌కు అమ్ముతున్నారు. దానివల్ల ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌, వ్యాపారి లాభం వస్తువు ధరకు యాడ్‌‌ అవుతుంది. దాంతో ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌కి ధర ఎక్కువగా ఉంటుంది. ఆర్గానిక్‌‌ మార్కెట్‌‌కు సరైన మార్కెట్‌‌ విధానం ఏర్పాటు చేస్తే రైతులకు లాభాలు వస్తాయి. వినియోగదారులకు తక్కువ ధరకే ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ దొరికే అవకాశం ఉంటుంది.

ఆర్గానిక్ అని గుర్తించడం ఇలా

ఇన్నాళ్లు కెమికల్స్‌‌ చల్లిన భూమిని పూర్తి ఆర్గానిక్‌‌గా మార్చడానికి దాదాపు మూడేళ్ల టైం పడుతుంది. ఆర్గానిక్‌‌ పద్ధతుల్లో పండించాలనుకునే రైతులు ముందుగా అపెడా(అగ్రికల్చరల్‌‌ అండ్‌‌ ప్రాసెస్‌‌డ్‌‌ ఫుడ్‌‌ ప్రొడక్ట్స్‌‌ ఎక్స్‌‌పోర్ట్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ)కి దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ ఆర్గనైజేషన్‌‌ నియమించిన కొన్ని సంస్థలకు ఆర్గానిక్‌‌ సర్టిఫికేషన్‌‌ చేసే పనిని అప్పగిస్తుంది. వాళ్లను రైతు కాంటాక్ట్‌‌ అయితే.. పొలానికి వచ్చి మట్టి శాంపిల్స్‌‌ని టెస్ట్ చేస్తారు. తర్వాత పండిన ప్రతి పంటను టెస్ట్‌‌ చేస్తారు. అందులో కెమికల్స్‌‌ పర్సంటేజీ తగ్గితే.. ‘ఇన్‌‌ ప్రాసెస్‌‌’ సర్టిఫికెట్‌‌ ఇస్తారు. ఇలా మూడేళ్లపాటు ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తే నాలుగో సంవత్సరం వచ్చే పంట పూర్తి ఆర్గానిక్‌‌గా ఉంటుంది. కొన్ని భూముల్లో ఈ ప్రాసెస్‌‌ ఇంకో ఏడాది ఎక్కువ కూడా పట్టొచ్చు.

నాలుగో సంవత్సరం ఇచ్చిన ఆర్గానిక్‌‌ సర్టిఫికెట్‌‌ ఆ సంవత్సరానికి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం టెస్ట్‌‌ చేయించుకుని సర్టిఫికెట్‌‌ పొందితేనే పంటను ఆర్గానిక్‌‌గా గుర్తించి, ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ అమ్మే ప్లాట్‌‌ఫామ్స్‌‌ కొంటాయి. అయితే.. ఇక్కడ రైతులకు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే.. మొదటి మూడేళ్లు చాలా తక్కువ దిగుబడులు వస్తాయి. అయినా.. రైతు తట్టుకుని నిలబడగలిగితే లాభాలు చూస్తాడు. లేదంటే.. మళ్లీ మామూలు వ్యవసాయం వైపు మళ్లుతాడు. ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌ మొదలుపెట్టిన చాలామంది రైతులు ఈ సమస్య వల్లే అప్పులు పెరిగి ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌ని వదిలిపెడుతున్నారు.ఈ సర్టిఫికేషన్‌‌ కోసం ఎకరాకు సుమారు 20,000 వరకు ఖర్చు అవుతుంది. ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌కి ధర ఎక్కువగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం.

సర్టిఫికెట్‌‌ తీసుకుంటే..

ఆర్గానిక్‌‌ సర్టిఫికేషన్‌‌ ప్రాసెస్‌‌ను సులభం చేసేందుకు గవర్నమెంట్ మరో మార్గాన్ని తీసుకొచ్చింది. అదే పీజీఎస్‌‌ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్‌‌). దీని ద్వారా అప్పటికే ఆర్గానిక్​ సర్టిఫికెట్‌‌ పొందిన కొంతమంది రైతులు కలసి మరో రైతు పంట పొలాన్ని పరిశీలించి సర్టిఫై చేస్తారు. కానీ.. ఇలా వచ్చిన సర్టిఫికెట్‌‌తో పంటను ఇతర దేశాలకు ఎక్స్‌‌పోర్ట్‌‌ చేసే అవకాశం ఉండదు. కాబట్టి లోకల్‌‌ మార్కెట్‌‌లో అమ్ముకోవాలి అనుకునేవాళ్లు పీజీఎస్‌‌ ద్వారా సర్టిఫై చేయించుకుంటే సరిపోతుంది.

ఏం కావాలి?

ఆర్గానిక్‌‌ పద్ధతుల్లో పండించాలంటే.. పశువుల పేడ, వేపాకులు, ఆవు మూత్రం లాంటివి కావాలి. అయితే.. కొన్నిచోట్ల ఇప్పుడు అవన్నీ నేరుగా మార్కెట్‌‌లో దొరుకుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం రైతులు వాటికోసం ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏర్పాటు చేసుకునేవాళ్లకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. కొందరిలో దేశీవాలి ఆవు ఉంటేనే ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌ చేయగలమనే అపోహ ఉంది. అది అవాస్తవం. నిజానికి ఆవు, గేదె, ఎద్దుల్లో దేని పేడ అయినా.. వాడుకోవచ్చు. కాకపోతే.. దేశీవాలి ఆవు ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకుంటుంది. కాబట్టి, దానికి ఎక్కువమంది మొగ్గు చూపుతుంటారు. -కరుణాకర్‌ మానెగాళ్ల

ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌‌ కొనే ముందు..

కొత్తగా ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకునేవాళ్లు ఒకేసారి పూర్తిగా ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ మొదలుపెట్టడం కంటే.. ఒక్కొక్కటిగా మార్చుకోవాలి. ఆర్గానిక్‌‌ ఫుడ్స్‌‌ కొనేముందు స్టోర్‌‌‌‌కి లైసెన్స్‌‌ ఉందా? ఆర్గానిక్ సర్టిఫికేషన్‌‌ ఉందా? అన్నది చెక్‌‌ చెయ్యాలి. ఎందుకంటే ఈ మధ్య ఆర్గానిక్‌‌ స్టోర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వాటిలో అమ్మే ప్రొడక్ట్స్‌‌ గురించి కూడా ఆరా తీయడం మంచిది.

ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ని ప్రాసెస్‌‌ చేయడానికి, నిల్వ చేయడానికి ఎలాంటి కెమికల్స్‌‌ వాడరు. కాబట్టి అది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌‌గా కొనుక్కోవడం మంచిది. ఒకేసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటే పాడయ్యే ప్రమాదం ఉంది.

ఎక్కువగా సీజనల్‌‌ ఫుడ్‌‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. అవే తక్కువ ధరలో అందు బాటులో ఉంటాయి. ఆరోగ్యమైనవి  కూడా.

ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌‌పై సర్టిఫైడ్‌‌ చేసిన లేబుళ్లు ఉంటాయి. అవి చూసిన తర్వాతే కొనాలి.

ఆర్గానిక్ ఫుడ్‌‌కి, కెమికల్స్ వేసి పండించిన పంటకు రూపంలో కూడా కొంత తేడా ఉంటుంది. రసాయనాలు వేసినవి ఎక్కువ మెరుస్తూ ఉంటాయి. ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ కాస్త నాసిరకంగా కనిపిస్తుంటాయి.

మార్కెట్‌‌‌‌ సదుపాయం లేదు

ఆర్గానిక్ రైతులు తమ ప్రొడక్ట్స్‌‌‌‌ నేరుగా వినియోగదారులకు అమ్ముకునే వ్యవస్థ సరిగ్గా లేదు. అందువల్లే ప్రొడక్ట్‌‌‌‌ కాస్ట్ పెరుగుతుంది. ఉదాహరణకు.. కొందరు కస్టమర్లు ప్యాషన్‌‌‌‌ ఫ్రూట్‌‌‌‌ కావాలని అడిగారు అనుకోండి. అది మణిపూర్‌‌‌‌‌‌‌‌లో దొరుకుతుంది. అక్కడికెళ్లి రైతును 50 కిలోలు కావాలని అడిగితే.. మినిమం 100 కిలోలు కొంటేనే ఇస్తానంటాడు. ఎందుకంటే.. తక్కువ మొత్తంలో అమ్మితే రైతుకు నష్టం వస్తుంది. కాబట్టి మేం 100 కిలోలు కొనాలి. తీరా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మొత్తం అమ్మలేకపోతే నష్టం వస్తుంది. కాబట్టి ధర కాస్త పెంచి అమ్ముతాం. అందుకే ఆర్గానిక్ కాస్ట్లీ అయ్యింది. దీనికి సరైన ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో చాలా డెవలప్‌‌‌‌ అవుతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. పిజ్జాలు, బర్గర్ల కోసం వందల్లో ఖర్చు పెట్టే జనాలు కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి ఆర్గానిక్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ తినమంటే మాత్రం తినరు. కాబట్టి జనాల తీరు మారాలి. అందరూ వ్యవసాయం, ఫుడ్‌‌‌‌ గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవేర్‌నెస్ పెంచుకోవాలి. అప్పుడు ఆర్గానిక్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ తింటారు. అప్పుడే.. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. – రఫీ, ఏఆర్‌‌‌‌‌‌‌‌ఫోర్‌‌‌‌‌‌‌‌ ఆగ్రో.కామ్‌‌‌‌

ఇంట్లోనే పండిస్తం

మేం ఏడెనిమిదేళ్ల క్రితమే ఆర్గానిక్‌‌ పంటల గురించి తెలుసుకున్నాం. అప్పటినుంచి ఆర్గానిక్‌‌ కూరగాయలు తినడం మొదలుపెట్టాం. కానీ.. ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఖర్చు ఎక్కువయ్యేది. దాంతో మా ఇంటి డాబా మీదనే ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయలు పండిస్తున్నాం. ప్రతి రోజు వాటికోసం  కొంత టైం కేటాయిస్తాం. ప్రస్తుతం పన్నెండు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. మార్కెట్‌‌లో దొరికే ఆర్గానిక్ ఎరువులు వేస్తున్నాం. వారంలో దాదాపు ఐదు రోజులు మా డాబా మీద పండిన కూరగాయలే తింటాం. మరో రెండు రోజులు బయటి నుంచి కొనుక్కొస్తాం. దీనివల్ల ఖర్చు చాలా తగ్గింది. పైగా ఇంట్లో అందరం హెల్దీగా ఉన్నాం.– లక్ష్మీ, యూసుఫ్‌‌గూడ

ఖర్చు ఎక్కువైనా తింటున్నాం

నాకు మే నెలలో కరోనా వచ్చింది. అప్పుడు చాలా వీక్‌‌  అయ్యాను. చాలా హెల్త్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వచ్చాయి. అంతకుముందు నేను జంక్ ఫుడ్‌‌ ఎక్కువగా తినేవాణ్ణి. హెల్త్ గురించి కొంచెం కూడా కేర్‌‌‌‌ తీసుకునేవాణ్ణి కాదు. అందుకే అంత ప్రాబ్లం అయ్యిందేమో. అప్పటినుంచి హెల్దీ ఫుడ్‌‌ మాత్రమే తింటున్నా. అందులోనూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌‌ ఎక్కువగా వాడుతున్నా. గతంలో కంటే ఫుడ్‌‌ కోసం కాస్త ఎక్కువ ఖర్చు అవుతోంది. అయినా తింటున్నా. హెల్త్‌‌ పాడయ్యాక హాస్పిటల్స్‌‌లో ఖర్చు చేసే కంటే ముందుగానే మంచి ఫుడ్‌‌ తినడం బెటర్ అనిపించింది.– రాంచంద్రం, కొంపల్లి

కరోనా వల్ల..

కరోనా వల్ల  ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు దెబ్బతిన్నాయి. కొన్ని పెద్ద పెద్ద సంస్థలకు కూడా నష్టాలు తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రాంతాలను బట్టి ఆర్గానిక్‌‌ ఇండస్ట్రీ 25%– 100% వృద్ధిని సాధించింది. దీనికి జనాల్లో అవగాహన పెరగడమే కారణం అంటున్నారు మార్కెట్‌‌ వర్గాలు. కరోనా నుంచి తట్టుకోవాలంటే.. ఇమ్యూనిటీని పెంచుకోవాలి. అందుకు ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ బెస్ట్ చాయిస్‌‌ అని చాలామంది తెలుసుకున్నారు. అయితే.. ప్రజల ఆర్థిక పరిస్థితులు ఇంకాస్త మెరుగుపడితే.. ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌కి ఊహించనంత స్థాయిలో డిమాండ్‌‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020లో ఫ్రాన్స్‌‌లో ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ అమ్మకాలు 40% పైగా పెరిగాయి. అయితే.. మన దేశంలో కూడా అమ్మకాలు పెరిగాయి. కానీ.. అన్ని రకాల పండ్లు, కూరగాయలకు డిమాండ్ పెరగలేదు. కొన్ని రకాల ఫుడ్స్‌‌కి మాత్రం 100% వరకు డిమాండ్‌‌ పెరిగింది. ఢిల్లీకి చెందిన ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ సెల్లర్‌‌‌‌ ‘ఐ సే ఆర్గానిక్’ అమ్మకాలు లాక్‌‌డౌన్‌‌ తర్వాత వంద శాతం పెరిగాయి. ‘నేచురల్లీ యువర్స్’ అమ్మకాలు 70-–80%, ‘సూర్యన్ ఆర్గానిక్’ అమ్మకాలు 25– 30%, ‘మోడర్న్ బజార్’ అమ్మకాలు 25%, ‘హెల్తీ బుద్ధ’ అమ్మకాలు 30% పెరిగాయి.

పాండమిక్‌‌ సందర్భాలు ఎప్పుడొచ్చినా.. ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌కి డిమాండ్‌‌ పెరగడం మామూలే. గతంలో 2000 సంవత్సరంలో ‘బీఎస్‌‌ఈ’ (బోవిన్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫలోపతి) క్రైసిస్‌‌ వచ్చినప్పుడు ఐరోపాలో ఆర్గానిక్‌‌ మాంసానికి డిమాండ్ పెరిగింది. 2004లో చైనాలో ‘సార్స్‌‌’ వచ్చినప్పుడు కూడా ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌కు డిమాండ్‌‌ పెరిగింది. ఇలా పెరుగుతూ రావడం వల్ల 2018లో ప్రపంచ ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ మార్కెట్‌‌ 100 బిలియన్ డాలర్లను దాటింది. రాబోయే 5 సంవత్సరాల్లో 150 బిలియన్ డాలర్లు దాటుతుందంటున్నారు నిపుణులు .

అవేర్‌‌‌‌నెస్ పెరిగింది

కరోనా తర్వాత జనాల్లో అవేర్‌‌‌‌నెస్ బాగా పెరిగింది. అందుకే లాక్‌‌డౌన్‌‌ తర్వాత ఈ స్టోర్‌‌‌‌ పెట్టాం. ఇప్పుడు జనాల దగ్గర పెద్దగా డబ్బు లేదు. కాబట్టి సేల్స్‌‌ తక్కువగా ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో సేల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. మామూలు పండ్లు, కూరగాయలతో పోలిస్తే.. వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి కొనలేకపోతున్నారు. నేను ఈ ఫీల్డ్‌‌లో సుమారు పదేళ్ల నుంచి ఉన్నా. హైదరాబాద్‌‌లో ఎక్కువమంది తక్కువ సంపాదన ఉన్నవాళ్లే ఉంటారు. వచ్చే జీతం రెంట్లు, నిత్యావసరాలు సరిపోను కొంత సేవ్‌‌ చేసుకుంటారు. కాబట్టి దీనిపై ఎక్కువ ఖర్చు చేయలేరు. కాబట్టి జనాల ఆదాయాలు పెరిగినప్పుడు ఆర్గానిక్‌‌కి ఖచ్చితంగా డిమాండ్‌‌ పెరుగుతుంది. అయితే.. దీనికి మరో మార్గం కూడా ఉంది. ప్రజలు అనవసరపు ఖర్చులు తగ్గించుకుని కొంత డబ్బు సేవ్‌‌ చేసుకుని ఈ ప్రొడక్ట్స్‌‌ కొనొచ్చు. అయినా.. పూర్తిగా ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ వాడడం సాధ్యం కాదు. కనీసం కొన్ని అయినా వాడొచ్చు.– ఆసిఫ్‌‌, నేచురల్‌‌ డిలైట్స్‌‌, వెంగళరావునగర్‌‌‌‌

అవగాహన వచ్చినప్పటికీ..

కరోనా వచ్చిన తర్వాత జనాల ఆలోచనా విధానం మారిందని ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు మా స్టోర్‌‌‌‌కి చాలామంది కొత్త కస్టమర్లు వస్తున్నారు. అయితే.. కేవలం ఫెస్టిసైడ్స్‌‌ వేసిన ఫుడ్‌‌ తింటేనే అనారోగ్య సమస్యలు వస్తాయనుకోవద్దు. ఫెస్టిసైడ్స్‌‌ ఎక్కువగా వాడే పొలాల చుట్టు పక్కల ఉండేవాళ్లకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మంచి తిండి అనే కాన్సెప్ట్‌‌ కంటే, మంచి వాతావరణం, వనరులను ముందు తరాలకు అందించడం కోసమైనా ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ తినాలి. అవగాహన ఉన్నవాళ్లే ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌ని ఎక్కువగా తింటున్నారు. 2015 నుంచి ఈ స్టోర్‌‌‌‌లో పనిచేస్తున్నా. ప్రతి సంవత్సరం ఐదు శాతం కంటే ఎక్కువే సేల్స్‌‌ పెరుగుతున్నాయి. మా దగ్గర ప్రొడక్ట్స్‌‌ తీసుకునేవాళ్లందరూ ‘ఆర్గానిక్‌‌కి, మామూలు కూరగాయలకు చాలా తేడా ఉంది. ఇవి చాలా రుచిగా ఉన్నాయంటు’న్నారు. ఈ మధ్య తెలంగాణలో బాగా వర్షాలు కురవడం వల్ల క్రాప్స్‌‌ తగ్గిపోయాయి. ఇప్పుడు బెంగళూరు నుంచి తెప్పిస్తున్నాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చినా రైతుల దగ్గర సర్టిఫికెట్స్‌‌ చూసిన తర్వాతే ఆర్డర్‌‌‌‌ ఇస్తాం. ఇంకొన్నిసార్లు సప్లయర్స్‌‌ నుంచి కూడా తెప్పిస్తుంటాం. -శ్రీనివాస్‌‌, స్టోర్‌‌ మేనేజర్‌‌‌‌‌‌, దమన్‌ ఆర్గానిక్‌‌ ఫుడ్స్‌‌, బంజారాహిల్స్‌‌

హెల్దీ ఆర్గానిక్‌‌ 

రెండేళ్ల నుంచి ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌ యూజ్‌‌ చేస్తున్నాం. ఇవి వాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంట్లో అందరూ హెల్దీగా ఉన్నారు. టేస్ట్ కూడా మామూలు వాటితో పోల్చితే చాలా బాగుంది. ఒకసారి ఆర్గానిక్‌‌ టేస్ట్‌‌కి అలవాటు పడితే.. మళ్లీ మామూలు కూరగాయలు తినడం కష్టం. మా ఇంట్లో ఆయిల్‌‌ దగ్గర్నించి పప్పులు, మిల్లెట్స్‌‌, బియ్యం, టీ పౌడర్‌‌‌‌.. ఇలా అన్నీ ఆర్గానిక్‌‌వే వాడతాం. సీజనల్‌‌ ఫ్రూట్స్‌‌ స్పెషల్‌‌గా ఆర్డర్‌‌‌‌ ఇచ్చి మరీ తెప్పించుకుంటాం.– గాయత్రి, దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌‌‌

అపోహలు ఉన్నాయి

కెమికల్స్‌‌, ఫెస్టిసైడ్స్‌‌ వాడకుండా పండించే అన్ని రకాల సాగు విధానాలనూ వాడుకలో ‘ఆర్గానిక్’ అని పిలుస్తుంటారు. వాటి మధ్య కొన్ని తేడాలు ఉంటాయి. ఈ పద్ధతుల్లో పండించింది ఏదైనా ఆరోగ్యానికి మంచిదే. హరిత విప్లవం వచ్చిన తర్వాత ఉత్పత్తులు విపరీతంగా పెరిగాయి. అదే స్థాయిలో పెట్టుబడులు కూడా పెరిగాయి. దానివల్ల ఆదాయం ఎక్కువగా వచ్చినా లాభాలు తగ్గుతూ వచ్చాయి. కానీ.. ఇప్పుడు అందరూ ఆర్గానిక్‌‌ పద్ధతుల్లో పండిస్తే ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడి కూడా తగ్గుతుందనే అపోహలో ఉన్నారు. అయితే.. మొదటి మూడు నాలుగేళ్లు మాత్రమే తక్కువ దిగుబడి వస్తుంది. సరైన పద్ధతుల్లో పండిస్తే ఆ తర్వాత నుంచి మంచి దిగుబడులు వస్తాయి అంటున్నారు ఆర్గానిక్‌‌ రైతులు. గడిచిన పదేళ్లలో ఆర్గానిక్ సాగు విస్తీర్ణం చాలా పెరిగింది. ఇప్పటి వ్యవసాయ పద్ధతుల్లోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హాని తెలుసుకున్న చాలామంది రైతులు ఒక్కొక్కరుగా ఆర్గానిక్‌‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఒక్కసారే మొత్తం భూమిని ఆర్గానిక్‌‌గా మార్చడం సాధ్యమయ్యే పనికాదు. అలా చేస్తే దిగుబడి తగ్గి చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకని ప్రతి సంవత్సరం కొంత విస్తీర్ణాన్ని పెంచుతూ సాగు చేస్తున్నారు. కాకపోతే కొన్ని అపోహల వల్ల చాలామంది రైతులు ఆర్గానిక్‌‌ సాగుకు దూరంగా ఉంటున్నారు.