భద్రాచలంలో సీతారాముల ఆభరణాలు

భద్రాచలంలో సీతారాముల ఆభరణాలు

భద్రాద్రి సీతారాములకు ఆనాడు భక్తరామదాసు అనేక బంగారు ఆభరణాలు చేయించాడు. ప్రతీ ఏటా భక్తులు కూడా ఎన్నో ఆభరణాలు స్వామికి కానుకగా సమర్పిస్తూనే ఉంటారు. వజ్రాలు పొదిగిన విలువైన పచ్చలు, పచ్చల పతకం, లేత చింతాకు పతకం, కలికితురాయి...వంటి విలువైన ఆభరణాలు వంటివెన్నో... తానీషా నవాబు హయాంలో పాల్వంచ పరగణాకు తహశిల్దారు అయిన భక్తరామదాసు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ముతో ఆలయ ప్రాకారాలు నిర్మించాడు. దాంతో కోపించిన తానీషా, గోపన్నను గోల్కొండ కోటలో బంధించాడు.

తనను ఆదుకోమని కోరుతూ చెరసాలలో రామదాసు ఆలపించిన కీర్తనల్లో ఈ నగల ప్రశస్తి కూడా ఉండడం విశేషం. ‘ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలకవే రామచంద్రా...’ అనే కీర్తనలో ‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకం రామచంద్రా, ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా’ అంటూ ఆక్రోశిస్తూ ‘కలికితురాయి నీకు పొలుపుగా చేయిస్తి రామచంద్రా... నీవు కులుకుతూ తిరిగేవు ఎవడబ్బ సొమ్మని రామచంద్రా’ అంటూ రామదాసు కీర్తనలు ఆలపించాడని ప్రతీతి. 

భద్రాద్రి రామునికి రామదాసు ఆభరణాలనే నేటికీ ధరింప చేస్తారు. రామదాసును చెరసాల నుంచి విడిపించడానికి తానీషా నవాబ్‍కు రామలక్ష్మణులు సమర్పించారన్న బంగారు రామమాడ నాణేలు కొన్ని భద్రాద్రి ఆలయంలో ఉన్నాయి. రామటెంకిగా పిలవబడే ఈ నాణెంపై దేవనాగరి లిపి ఉంది. మరో రామమాడ గోల్కొండ కోట మ్యూజియంలో ఉంది.