ఓఆర్ఓపీ బకాయిలు చెల్లించాల్సిందే.. కేంద్రానికి సీజేఐ ఆదేశం

ఓఆర్ఓపీ బకాయిలు చెల్లించాల్సిందే.. కేంద్రానికి సీజేఐ ఆదేశం

న్యూఢిల్లీ: మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపులపై గతం లో తామిచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని కేంద్రానికి సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా సీల్డ్ కవర్ సంప్రదాయానికి తాను వ్యతిరేకమని సీజేఐ చెప్పారు. 2019 – 2022 నాటి 28 వేల కోట్ల బకాయిలను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. ఈ సందర్భంగా చెల్లింపుల విధివిధానాలపై కేంద్రం తరఫున అటార్నీ జనరల్(ఏజీ) సమర్పించిన సీల్డ్ కవర్​ను తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నిరాకరించారు.

 ‘‘ఈ కేసులో రహస్యం ఏముంది?  మేమిచ్చిన ఆదేశాలనే అమలు చేస్తున్నారు కదా. కోర్టులలో పారదర్శకత ఉండాలి. సీల్డ్ కవర్ విధానానికి వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిని. ఈ పద్ధతికి ముగింపు పలకాలని కోరుకుంటున్నా. ఎవరి జీవితానికైనా ప్రమాదం కలుగుతుందనే సందర్భంలో మాత్రం పాటించవచ్చు” అని సీజేఐ అన్నారు. దీంతో అటార్నీ జనరల్​ సీల్డ్ కవర్​లోని సమాచారాన్ని కోర్టుకు చదివి వినిపించారు. అనంతరం బెంచ్ తీర్పునిచ్చింది. గ్యాలెంట్రీ అవార్డు విన్నర్ల కుటుంబాలకు ఏప్రిల్ నెలాఖరులోగా ఒకేసారి, 70 ఏండ్లు దాటిని పెన్షనర్లకు జూన్ 30 లోగా చెల్లించాలంది. మిగతా వారికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా 3 వాయిదాల్లో చెల్లించాలని ఆదేశించింది.