‘ఓం శాంతి శాంతి శాంతి:’ సినిమా.. మన ఇంటి కథగా మెప్పిస్తుంది: నిర్మాత సృజన్

‘ఓం శాంతి శాంతి శాంతి:’ సినిమా.. మన ఇంటి కథగా మెప్పిస్తుంది: నిర్మాత సృజన్

‘35  చిన్న కథ కాదు’ చిత్రంతో అభిరుచిగల నిర్మాతగా  పేరు తెచ్చుకున్న  సృజన్ యరబోలు..  తదుపరి ప్రయత్నంగా ‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రాన్ని నిర్మించారు.  తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఏఆర్ సజీవ్ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. 

ఈ సందర్భంగా నిర్మాత సృజన్ మాట్లాడుతూ ‘అమెరికాలో ఉండే నేను, దాదాపు అన్ని భాషల సినిమాలు మార్నింగ్‌‌‌‌ షో చూస్తుంటా. అలా చూసిన వాటిలో మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’ బాగా నచ్చింది. ఈ కథ తెలుగులో వర్కవుట్ అవుతుందనిపించి, వెంటనే రీమేక్ రైట్స్ తీసుకున్నా.  తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు చేశాం. ఒరిజినల్ వెర్షన్ చూడని ఆడియెన్స్‌‌‌‌ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. చూసినవాళ్లు కూడా ఒక కొత్త అనుభూతిని పొందుతారు.  ఈ కథ మన ఇంటి కథగానే అనిపిస్తుంది.

తరుణ్ భాస్కర్‌‌‌‌‌‌‌‌ని నిజానికి యాక్టర్ కమ్  డైరెక్షన్ కోసం అడిగాను. అయితే తను రీమేక్స్ చేయనని చెప్పారు. కేవలం నటుడిగా అయితే  కొనసాగుతానని  క్లియర్‌‌‌‌‌‌‌‌గా చెప్పారు. తన పాత్రను ఓన్ చేసుకుని నటించారు. దీనికోసం గోదారి యాస కూడా నేర్చుకున్నారు.

ఈషా రెబ్బా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది.  తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది.  ఇక డైరెక్టర్ సజీవ్ తనదైన వెర్షన్‌‌‌‌లో చాలా కొత్తగా రూపొందించాడు.  జై క్రిష్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అస్సెట్.  నాకు సినిమాలంటే చాలా ప్యాషన్. ఇక్కడ నిర్మాతగా సంపాదించుకున్నది ఏమీ లేదు అలా అని పెద్దగా పోగొట్టుకున్నది లేదు. ప్రతిదీ బ్రేక్ ఈవెన్ అవుతూ వస్తున్నా. ప్రస్తుతం గతం2, ఈ నగరానికి ఏమైంది రిపీట్,  అలాగే ప్రియదర్శితో ఒక సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి’ అని చెప్పారు.