విదేశీ గల్లీల్లో మన చాట్​.. మన బజ్జీ

విదేశీ గల్లీల్లో మన చాట్​.. మన బజ్జీ
  • లండన్​లో ఉంటున్న అనిల్​కి బజ్జీ పేరు వింటే లేని ఆకలి మొదలవుతుంది. 
  • ఫిలిప్పీన్స్​లో ఎంబీబీఎస్​ చేస్తున్న శివకి పానీపూరీ చూస్తే చాలు నోట్లో నీళ్లూరతాయి. 
  • పెండ్లి తర్వాత కాలిఫోర్నియాకి షిఫ్ట్​ అయిన హారిక పరిస్థితి కూడా ఇదే. 
  • డెన్మార్క్​లో సెటిలైన సింధూజకి మన స్ట్రీట్​ఫుడ్​ అంటే ఎంత ఇష్టమో!  
  • మరి చదువు, కెరీర్​ కోసం దేశం దాటిన వీళ్లు ఆ రుచుల్ని మర్చిపోవాల్సిందేనా! 

ఏమో ఇదివరకు రోజుల సంగతి తెలియదు. కానీ, ఇప్పుడైతే మన స్ట్రీట్​ఫుడ్ విదేశాల్లో బాగానే దొరుకుతోంది. అక్కడి గల్లీలో ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ లవర్స్​కి వెల్​కమ్​ చెప్తోంది. ఫారినర్స్​తోనూ ‘వాట్​ ఏ టేస్ట్’​ అనిపించుకుంటోంది. అలా విదేశాల్లో పాపులర్ అవుతున్న మన స్ట్రీట్​ఫుడ్​ స్టోరీ ఇది. హైదరాబాద్​ కా ​ కీమా సమోసా.. ఢిల్లీ చోళే భటూరా.. చెన్నై గుగ్గిళ్ళు.. ఇంకా బెనారస్‌‌‌‌‌‌‌‌ లస్సీ, అమృత్‌‌‌‌‌‌‌‌సర్‌‌‌‌‌‌‌‌ జిలేబీ, గుజరాత్​ పట్టీ సమోసా, అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌ ధోక్లా, ముంబై భేల్​పూరి.. ముఖ్యంగా పానీపూరీ. 
అబ్బో! ఇలా దేశంలోని  ప్రతి ఊళ్ళో ఓ ప్రత్యేక వంటకం ఉంది. ఆ ప్రత్యేకతే వాటిని ఆ పల్లెలు, పట్నాలతో మొదలుపెట్టి ఏకంగా రాష్ట్రాలే దాటించింది. ప్రతి ఇంటికి వాటి కమ్మని రుచి తెలిసేలా చేసింది. మన దేశంలో సరే, మరి దేశాలు దాటి ఎంతో ఇష్టమైన స్ట్రీట్​ ఫుడ్స్​కు దూరమైన వాళ్ల మాటేంటి? అలా సొంతూరి స్ట్రీట్​ ఫుడ్​ని మిస్​ అయ్యే వాళ్ల కోసమే దేశీ స్ట్రీట్​ ఫుడ్స్​ విదేశాలకీ వెళ్లాయి. 


ఏదైనా కల్చర్​ గురించి చెప్పాలంటే.. కట్టుబొట్టుతో పాటు అక్కడ దొరికే ఫుడ్​ గురించి కూడా మాట్లాడతారు. అంతలా ఆ ప్రాంతంలో భాగమైపోతాయి వంటకాలు. అలా మన కల్చర్​ని డిఫైన్​ చేయడానికి ఒకటి, రెండు కాదు వేలల్లో... కాదు కాదు.. లక్షల్లో వంటకాలున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో మరెక్కడా దొరకనన్ని వెరైటీలున్నాయి మన స్ట్రీట్​ఫుడ్స్​​లో. వాటితో మనవాళ్లకి ముడిపడిన  జ్ఞాపకాలు లెక్కలేనన్ని. అందుకే ప్రపంచంలో ఏ మూల ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ స్టాల్​ పెట్టినా.. అక్కడుంటున్న మనవాళ్లు దాని దగ్గర ‘క్యూ’ కడతారు. ఆదరణ బాగుండటంతో విదేశాల్లోనూ ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ స్టాల్స్​ పెరుగుతున్నాయి. అలా ప్రపంచవ్యాప్తం​గా చాలా దేశాలు ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ని సర్వ్​ చేస్తున్నాయి. అచ్చం మన ఊళ్లో, మన గల్లీలో ఉండే రుచి వచ్చేలా చేసి పెడుతున్నారు కొందరు. మరి అలాంటి వాళ్ల గురించి తెలుసుకోకపోతే ఎలా? అందుకే ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఏఏ దేశాల్లో దొరుకుతోంది. విదేశీ మార్కెట్​లో ఎప్పటి నుంచి మన స్ట్రీట్​ ఫుడ్​ ఉంది? మొదట్లో ఎలా స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి? అందులో పనిచేసే ఎంప్లాయిస్​ మన వాళ్లేనా? ఇలాంటి వాటి మీద ఓ లుక్కేద్దాం. 

వీటినే ఎక్కువ తింటున్నరు 

ఇంతకుముందు అన్ని దేశాల్లో ఇటాలియన్, చైనీస్​, జపనీస్ ఫుడ్​ కనిపించేది. ఇప్పుడు వాటితో సమానంగా ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​​ కూడా దొరుకుతోంది. యూఎఎస్​ ఎకనామిస్ట్​ స్టడీ ప్రకారం ప్రపంచంలోనే మోస్ట్​ పాపులర్​ వంటకాల్లో ఇండియా నాలుగో స్థానం దక్కించుకుంది. విదేశాల్లోనూ మన రెసిపీలకు ఆదరణ పెరుగుతోంది అనడానికి దీన్ని మించిన ఎగ్జాంపుల్​ ఇంకేముంది. అయితే దీనంతటికి కారణం... చదువు, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకి వెళ్తున్న మనవాళ్ల​ సంఖ్య రోజురోజుకి పెరగడమే. అందుకు తగ్గట్టుగానే ఇండియన్​ స్ట్రీట్​ ఫుడ్​ స్టాల్స్​ కూడా పెరుగుతున్నాయి. విదేశాల్లో ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ని ఎక్కువగా ఫుడ్​ ట్రక్కులు, మొబైల్​ వ్యాన్స్​​, స్టాల్స్​లోనే అమ్ముతున్నారు. వీటి మెయింటెనెన్స్​ ఈజీ​ అవడమే ఇందుకు కారణం. అలాగే ఫుడ్​ ట్రక్కుల డిజైన్​లో కూడా మన కల్చర్​ని ఏదో ఒక విధంగా భాగం చేస్తున్నారు. ఫుడ్ స్టాల్స్​ పేర్లు కూడా అలానే పెడుతున్నారు. దాంతో ఇండియన్స్​తో పాటు ఫారినర్స్​ కూడా అట్రాక్ట్​ అవుతున్నారు. అలా అమెరికా, యూకే, సౌత్​ కొరియా, థాయి​లాండ్​, జపాన్​, జర్మనీ, ఫ్రాన్స్​  లాంటి అన్ని దేశాల్లో.. ఒక్క మాటలో చెప్పాలంటే  ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇండియన్​ స్ట్రీట్​ ఫుడ్​ దొరుకుతోంది. వాటిల్లో ఇండియన్స్​, ఫారినర్స్​ అన్న తేడా లేకుండా ఎక్కువమంది ఎంజాయ్​ చేస్తున్న మన  స్ట్రీట్​ఫుడ్ రెసిపీలు ఏవంటే..
విదేశాల్లో మోస్ట్​ పాపులర్​ ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్స్​లో సమోసాది ఫస్ట్​ ప్లేస్​. దాదాపుగా అన్ని దేశాల్లో ఉల్లి​, పనీర్​తో మొదలుపెట్టి మటన్ కీమా, చికెన్​ టిక్కా సమోసాల వరకు అన్నీ దొరుకుతున్నాయి. అలాగే తందూరి చికెన్​, టిక్కా మసాలా కూడా చాలా పాపులర్. అమెరికాలోని శాన్​ ఫ్రాన్సిస్కో నుంచి చికాగో, లాస్​ ఏంజిలెస్​ వరకు..​ అన్ని ప్రాంతాల్లో పానీపూరీ దొరుకుతోంది. న్యూయార్క్​ స్ట్రీట్​ఫుడ్​ చార్ట్స్​లో పంజాబీ బటర్​ చికెన్​ ముందున్నట్టు  స్టడీలు చెప్తున్నాయి. చోలే, చాట్, చికెన్​ టిక్కా ర్యాప్​, పనీర్​ మసాలా ర్యాప్​కు లండన్​లో ఫుల్​ క్రేజ్​​. పారిస్​లో కబాబ్స్​తో పాటు తందూరీ స్పెషల్స్​ అన్నీ ఫేమస్. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్​లో దాదాపుగా ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ అంతా ఇష్టంగా తింటారు. కబాబ్స్, పావ్​బాజీ​  సింగపూర్​లోని​ చాలా ఫుడ్​ ట్రక్స్​లో కనిపిస్తాయి. ఇవన్నీ కనిపించడం వరకు సరే... ఇంతకీ వీటిని ఎవరు నడుపుతున్నారు? 

తొంభై శాతం వాళ్లే

ప్రపంచంలోని ఏ దేశం వాళ్లైనా మన ఫుడ్​ని టేస్ట్​  చేస్తే మొదట మాట్లాడేది వాటిల్లోని మసాలాల గురించే. ఆ తర్వాత వాటి కమ్మటి వాసన గురించి. ఔషధ గుణాలు కూడా ఎక్కువే మన వంటకాల్లో. అదే మన స్ట్రీట్​ఫుడ్​ స్పెషాలిటీ కూడా. ఆ ఘాటు రుచి, వాసనని వేరే ఏ దేశపు ఫుడ్​ రీప్లేస్​ చేయలేదనడంలో డౌటే లేదు. అందుకే విదేశాలకెళ్లిన మనవాళ్లు ఇక్కడి స్ట్రీట్​ఫుడ్​ని బాగా మిస్​ అవుతుంటారు. అలా హోమ్​ టౌన్ స్ట్రీట్​ఫుడ్​తో ముడిపడిన​ జ్ఞాపకాల్ని అందరికీ గుర్తు చేయాలన్న ఆలోచననే బిజినెస్​గా మార్చుకుంటున్నారు చాలామంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ అమ్ముతున్న వాళ్లలో తొంభై శాతం భారతీయ మూలాలు ఉన్న వాళ్లే . మరో పదిశాతం మాత్రం ఎప్పుడో ఒకసారి ఇండియాలో మన ఫుడ్​ టేస్ట్​ చేసిన ఫారినర్స్. వీళ్లలో ఇండియా నుంచి స్పెషల్​గా మసాలాలు తెప్పించుకునేవాళ్లు కొందరైతే.. సొంతంగా అక్కడే ప్రిపేర్​ చేసుకునేవాళ్లు మరికొందరు. మన స్ట్రీట్​ ఫుడ్​ రెసిపీని ఉన్నదున్నట్టుగా ​ఫాలో అయ్యేవాళ్లు కొందరైతే.. ఫారినర్స్​ని అట్రాక్ట్​ చేయడానికి మన డిష్​ల​కి వెస్ట్రన్​ టచ్​ ఇచ్చేవాళ్లు ఇంకొందరు. అయితే వీళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఒక్కో స్టయిల్.

ప్రపంచవ్యాప్తంగా వేల స్టాల్స్​లో మన స్ట్రీట్​ఫుడ్​ దొరుకుతున్నప్పటికీ.. కొన్ని దేశాల్లోని మన ఫుడ్​  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘‘ఎందుకలా అంటే?’’  ‘‘రుచి వల్లే’’  అంటున్నారు అక్కడ సెటిలైన ఇండియన్స్​. ఈ స్టాల్స్​లో దొరికే మన స్ట్రీట్​ఫుడ్​ని టేస్ట్​ చేయడానికి వందల కిలోమీటర్లు జర్నీ చేస్తారట చాలామంది. మరి అంతలా విదేశాల్లో ఇండియన్స్​ మనసు దోచుకుంటున్న ఫుడ్​ ట్రక్స్​ గురించి దేశాల వారీగా  చూద్దాం. 

అమెరికా పాపులేషన్​లో 1.4 శాతం.. అంటే 4.2 మిలియన్ల మంది ఇండియన్స్​ ఉన్నారు. మినీ ఇండియాగా పేరున్న ఒక్క న్యూయార్క్​ సిటీలోనే మనవాళ్లు 7,11,000 మంది ఉన్నారు. మరో విషయం ఏంటంటే..  అమెరికన్స్​ ఇష్టంగా తినే చికెన్​ నగ్గెట్సే మనదగ్గర చికెన్​ పకోడా. వాళ్ల గార్లిక్ బ్రెడ్​ మన గార్లిక్​ నాన్​. అక్కడ ఫేమస్​​ వంటకాలైన చీజ్​ కర్డ్స్​.. పాట్​ పైస్​,  కబాబ్స్​, చీజ్​ కేక్స్​​ మన దగ్గర మటర్​​ పనీర్, సమోసా, తందూరీ, రసమలై... ఇలా వాళ్లు తినే ప్రతి వంటకాన్ని మనం మరేదో పేరుతో పిలుస్తుంటాం. అయితే రెసిపీ యాజ్​ ఇట్​ ఈజ్​ ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేం. ఏదేమైతేనేం, అమెరికాలోని ప్రతి స్టేట్​లో మన స్ట్రీట్​ఫుడ్​ స్టాల్స్​ వెలిశాయి. వాటిల్లో ఇవి చాలా ఫేమస్​. 

ఢిల్లీ చాట్​ :

‘ది టేస్ట్​ ఆఫ్​ ఢిల్లీ’ అంటూ 2014 లో  సన్​వ్యాలీకి పరిచయమైంది ‘ఢిల్లీ చాట్’. పంజాబ్​కి చెందిన సంతోష్​ సింగ్​ ఈ ఫుడ్​ ట్రక్​కి ఓనర్. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన ఇతనికి అక్కడ ఎంత వెతికినా ఢిల్లీ చాట్​ ఫ్లేవర్​ కనిపించలేదట. దాంతో తానే స్వయంగా18,000 డాలర్లకి సెకండ్​ హ్యాండ్​ ఫుడ్​ ట్రక్​ కొని ‘ఢిల్లీ చాట్’​ని మొదలుపెట్టాడు. ఇక్కడ ‘పానీపూరీ, భేల్​ పూరీ, సేవ్ ఫూరీ, దహీ బటాటా, వాడా పావ్​, పావ్​ బాజీ, సమోసా’తో పాటు ‘పకోడీ, ఆలు టిక్కీ చోలే, చోలే పాపడ్​, పరోటా’లు కూడా దొరుకుతాయి. ధర విషయానికొస్తే ఆరు డాలర్ల నుంచి పదమూడు డాలర్ల వరకు ఉంటుంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజూ సాయంత్రం నాలుగింటి నుంచి తొమ్మిదింటి వరకు తెరిచి ఉండే ఈ ఫుడ్​ ట్రక్​లో మ్యాంగో లస్సీ, మసాలా టీ లాంటివి కూడా దొరుకుతాయి. ఈవెంట్స్​కి ఫుడ్​ డెలివరీ కూడా చేస్తారు వీళ్లు. రానున్న రోజుల్లో తన ఫుడ్​ ట్రక్​ని మరింతమందికి  చేరువ చేయాలనుకుంటున్నట్టు కూడా చెప్తున్నాడు సంతోష్​. ​ 

ఇండియన్​ జోన్స్​ చౌ ట్రక్ :

అమెరికాలోని లాస్​ ఏంజిలెస్​​​లో ఉంది ‘ఇండియన్​ జోన్స్​ చౌ ట్రక్’​. దీన్ని  భారతీయ మూలాలున్న అమెరికన్​ ఫేమస్​ చెఫ్​ సుమంత్​ పర్​దాల్​ స్టార్ట్​ చేశాడు. సుమంత్​ ఫ్యామిలీ జైపూర్​లో రెస్టారెంట్ నడుపుతోంది. ఆ అనుభవంతో లాస్​ ఏంజిలెస్​​లో పన్నెండు రెస్టారెంట్స్​ పెట్టాడు సుమంత్​. అవన్నీ గ్రాండ్​ సక్సెస్..ఆ తర్వాత 2008లో ‘ఇండియన్​ జోన్స్​ చౌ ట్రక్’​ని మొదలుపెట్టాడు​. ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ని కాస్త మోడరేట్ చేసి సర్వ్​ చేస్తున్నాడు ఇతను. పంజాబీ ట్రెడిషనల్​ డిష్​లైన బటర్​ చికెన్​, మటన్​ బిర్యానీ తన సిగ్నేచర్​ డిష్​లు అని చెప్పుకునే సుమంత్​ ఈ ఇండియన్​ ఫుడ్​ ట్రక్​లో ముంబై ఫేమస్ ‘ఫ్రాంకీలు, సమోసా స్ర్పింగ్​ రోల్స్​, గ్రిల్డ్​ నాన్స్​, మ్యాంగో జికామా సలాడ్’​ అమ్ముతున్నాడు. తన బెస్ట్​ సెల్లర్​ పనీర్​ ఫ్రాంకీతో పాటు చికెన్​, మటన్​ ఫ్రాంకీలని కూడా ఒక్కోటి మూడున్నర డాలర్లకి అమ్ముతున్నాడు. దాంతో లాస్​ ఏంజిలెస్​​లో ఉంటున్న ఇండియన్స్​కి​ హాట్​ ఫేవరెట్​గా మారింది ఇండియన్​ జోన్స్​ చౌ ట్రక్​. అన్నట్టు ఈ ఫుడ్​ ట్రక్​ దగ్గరికి వెళ్తే  స్ట్రీట్​ఫుడ్​తో పాటు ఇండియన్ ట్రెడిషనల్​ ఫుడ్​ని కూడా రుచిచూడొచ్చు. 

దేశీ ఫుడ్​ ట్రక్ ​:

న్యూయార్క్​లో ఉన్నన్ని ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ స్టాల్స్​ అమెరికాలోని మరే స్టేట్​లో ఉండవు. ఇక్కడి రుచి కూడా అంతే. ముఖ్యంగా న్యూయార్క్ సిటీలోని ‘ దేశీ ఫుడ్​ ట్రక్’ ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​కి చాలా ఫేమస్​. 2010 లో స్టార్ట్​ అయిన ఈ ఫుడ్​ ట్రక్​ 2014 వెండీ స్ట్రీట్​ అవార్డ్స్​లో ఫైనల్స్​ వరకు వెళ్లింది. టేస్టీ ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ని​ న్యూయార్క్​ సిటీకి పరిచయం చేయాలన్న మోటోతోనే అలంగీ అనే అతను దీన్ని మొదలుపెట్టాడు. బాలీవుడ్​ స్టార్స్​ పోస్టర్స్​తో కనిపించే ఈ ట్రక్​లో ‘కటీ రోల్, పూరీబాజీ, హలీమ్’​ చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే న్యూయార్క్​లో చెప్పుకోవాల్సిన మరో ఇండియన్​ ఫుడ్​ ట్రక్​ ‘ఇండియన్​ కింగ్​ బిర్యానీ హౌజ్’​. బెస్ట్​ ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ సర్వ్​ చేసే ఈ ట్రక్​లో బిర్యానీ కూడా దొరుకుతుంది. న్యూయార్క్​లో తప్పకుండా వెళ్లాల్సిన ప్లేస్​ ‘ఎన్​ వై దోసె’. 2001 నుంచి న్యూయార్క్​ సిటీలోని వాషింగ్టన్​ స్క్వేర్​లో ఉన్న ఈ ఫుడ్​ స్టాల్​ని తిరుకుమార్​ అనే ఆయన పెట్టాడు. ఇతనికి లాటరీలో యూఎస్​ ​ గ్రీన్​కార్డ్ వచ్చిందట. అలా సొంత దేశమైన శ్రీలంక నుంచి అమెరికా చేరాడు తిరు. కానీ, భారతీయ మూలాలు ఉండటంతో సౌత్ ఇండియన్​ ఫేమస్​ దోసెలతో పాటు స్ట్రీట్​ఫుడ్​ని బిజినెస్​గా చేసుకున్నాడు. ఇతన్ని న్యూయార్క్​లో ‘లెజెండరీ దోసె మ్యాన్’ అని పిలుస్తారు.  

చెన్నై ఫ్లేవర్స్ ​:

అమెరికాలో బెస్ట్​ ఇండియన్​ స్ట్రీట్​ ఫుడ్​ని టేస్ట్​ చేయాలంటే న్యూజెర్సీ బెస్ట్​ ఛాయిస్. ఇక్కడ అన్ని రకాల చాట్స్​తో పాటు రకరకాల స్ట్రీట్​ శ్నాక్స్​ కూడా దొరుకుతాయి. అయితే వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘చెన్నై ఫ్లేవర్స్’​ గురించి. ఇందులో ‘మసాలా, పనీర్​ కట్టీ, చికెన్​ కట్టీ , పనీర్​​ చికెన్​ కట్టీ రోల్స్’​ ఇలా బోలెడు​ వెరైటీలుంటాయి. అలాగే  న్యూజెర్సీలో ‘దోసె స్పాట్’ ఫుడ్​ ట్రక్​ ​కూడా చాలా పాపులర్​. ఇక్కడ అన్ని రకాల వెరైటీ దోసెలు దొరుకుతాయి. న్యూజెర్సీలోని ఇండియన్​  ఫేమస్ ఫుడ్​ ట్రక్​లలో ‘కర్రీ హిల్​ ఇండియన్​ ఫుడ్’​ కూడా ఉంది. ఈ ఫుడ్​  ట్రక్​లో దొరికే అండాబుర్జీకి చాలామంది ఫ్యాన్స్​ ఉన్నారు. ఈ మూడు ఫుడ్​ ట్రక్స్​ను అకేషన్స్​కి బుక్​ చేసుకునే ఆప్షన్​ కూడా ఉంటుంది.  అలాగే కాలిఫోర్నియాలో ‘చాట్​ ప్యాలెస్​ ఇండియన్, బెంగాలీ ఇండియన్’​  ఫుడ్​ ట్రక్​లు చాలామంది ఇండియన్స్​ ఫేవరెట్​ ఫుడ్​ స్పాట్స్​. 

లండన్​ :

మనవాళ్లు ఎక్కువగా కనిపించే మరో సిటీ యూకేలోని లండన్​. ఇక్కడ దాదాపుగా పదిహేను లక్షలమంది భారతీయులున్నారు. ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ స్టాల్స్​ కూడా వందల్లో ఉన్నాయి. ఇక్క డ ఏటా ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​  ఫెస్టివల్స్​​ కూడా జరుగుతాయంటే...లండన్​లో మన​ ఫుడ్​కి ఉన్న డిమాండ్​ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ‘ఈలింగ్​ రోడ్డు’ అనే ఏరియాని ‘మినీ ఇండియా’ అంటారు. మరి మినీ ఇండియాలో మన స్ట్రీట్​ఫుడ్​ లేకుండా ఉంటుందా! ఆ రోడ్డు పొడవునా ‘దహీ వడ, సమోసా, పానీపూరీ, భేల్​పూరీ, పకోడీలు, బజ్జీలు, కచోరీలు’ ఇలా సౌత్​, నార్త్​ తేడా లేకుండా అన్ని వెరైటీల ఫుడ్​ దొరుకుతుంది. అలాగే లండన్​లో ఏరియాతో పనిలేకుండా అన్నిచోట్లా సమోసాలు ఉంటాయి. అయితే వాటిలో కొన్నిటి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. 

జాల్​మురి ఎక్స్​ప్రెస్ :

లండన్​లో ‘జాల్​మురి ఎక్స్​ప్రెస్​’ పేరుతో ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్నాడు యాంగస్​ డెనూన్​. ఈ బ్రిటిష్​ చెఫ్​ 2005లో ఓ ట్రిప్​లో భాగంగా ఇండియాకి వచ్చి బెంగాలీ ఫేమస్​ స్ట్రీట్​ఫుడ్​ జాల్​మురిని టేస్ట్​ చేశాడట. అది బాగా నచ్చడంతో నేర్చుకుని బ్రిటన్​లో జరిగిన చాలా ఫుడ్ ఫెస్టివల్స్​లో స్టాల్​ తెరిచాడు. 2019 వరల్డ్​ కప్​ స్టేడియం బయట  ఇతను జాల్​మురి అమ్ముతున్న వీడియో ఇంటర్నెట్​ సెన్సేషన్​ అయింది. అమితాబచ్చన్​ కూడా యాంగస్​​ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. బెంగాలీ స్ట్రీట్​ఫుడ్​ మీద ఉన్న మమకారంతో ఇప్పటికీ  లండన్​ స్ట్రీట్స్​లో జాల్​మురి అమ్ముతున్నాడు యాంగస్​​. ఇవే కాకుండా ముంబై, మైసూర్ స్ట్రీట్ ఫుడ్స్​ కూడా నేర్చుకున్నాడు. దాన్ని అచ్చం ఇండియాలోలాగే న్యూస్​పేపర్​లో పొట్లం కట్టి మరీ ఇస్తాడు.  

గల్లీ :

2020 బ్రిటీష్​ స్ట్రీట్​ ఫుడ్​ అవార్డ్స్​ ఫైనలిస్ట్​గా నిలిచిన సుధీర్​, అవి ‘గల్లీ’ ఫౌండర్స్​. వీళ్లు తండ్రీకొడుకులు. సుధీర్​ ఐటీ ఎంప్లాయిగా​ పనిచేసి రిటైర్​​ అయ్యాడు. ఆ టైంలోనే  ఒక రోజు అవి తన ఫ్రెండ్స్​ కోసం మటన్​ కీమా చేయమని తండ్రిని అడిగాడు. ఆ డిష్​  టేస్ట్​ బాగుండటంతో​​ మళ్లీ తీసుకురమ్మని రిక్వెస్ట్​ చేసేవాళ్లు అవి ఫ్రెండ్స్. అలా తండ్రి వంటలోని కమ్మదనాన్ని గుర్తించిన అవి ‘గల్లీ’ ఫుడ్​ ట్రక్​ని 2019 అక్టోబర్​లో మొదలుపెట్టాడు. ‘చికెన్​, పనీర్​ టిక్కా, మటన్​ కీమా, సమోసా చాట్, సమెసా, మసాలా ఫ్రైస్​’తో పాటు ‘మ్యాంగో చట్నీ, గార్లిక్​, హోంమేడ్​ స్పెషల్​ చిల్లీ సాస్’​లు ఇక్కడ పాపులర్​. 

కొల్​కత్తీ :

లండన్​లో చెప్పుకోవాల్సిన ఇండియన్​ స్ట్రీట్​ ఫుడ్​ స్టాల్స్​లో ‘కొల్​కత్తీ’ ఒకటి. కోల్​కతా ఫేమస్​ స్ట్రీట్​ఫుడ్​ అంతా ఇక్కడ దొరుకుతుంది. ‘కర్రీ ఆన్​ నాన్​స్టాప్​, దోసె డెలీ’ ఫుడ్​ ట్రక్​లు, ‘బాబా దాబా’ ఫుడ్​ స్టాల్​లోనూ ఇండియన్​ స్ట్రీట్​ ఫుడ్​ దొరుకుతుంది. లండన్​లోని ‘డిషూమ్’​లో  ఇరానీ చాయ్​, కీమా పావ్​ చాలా ఫేమస్​. ‘ది ఇండియన్​ నెక్స్ట్​ డోర్​, ది స్పైస్​ బాక్స్​, రాయల్​ నవాబ్స్’  కూడా  లండన్​లో బెస్ట్ ఇండియన్​ స్ట్రీట్​ ఫుడ్​ని సర్వ్​ చేస్తాయి. 

ఆస్ట్రేలియా :

చదువు, ఉద్యోగాల కోసం మనవాళ్లు ఎక్కువ వెళ్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా మూడోది. అయితే అందులోనూ ఆస్ట్రేలియాలోని సిడ్నీనే ఇండియన్స్​ ఎక్కువగా ప్రిఫర్​ చేస్తుంటారు. అందుకే ఆస్ట్రేలియాలో సిడ్నీకి లిటిల్​ ఇండియాగా పేరొచ్చింది. ఆస్ట్రేలియా మొత్తం ఇండియన్​ స్ట్రీట్​ ఫుడ్​ దొరికినప్పటికీ సిడ్నీ దానికి కేరాఫ్​గా మారింది.

అందుకు కారణమైన ఫుడ్​ స్టాల్స్ ఇవి​... 

సిడ్నీలోని హ్యారిస్​ పార్క్​కి దగ్గర్లో ఉంటుంది ​‘లిటిల్​ ఇండియా’. ఇక్కడ దొరకని ఇండియన్​ స్ట్రీట్​ ఫుడ్​ వెరైటీ అంటూ ఉండదు. ముఖ్యంగా ఈ ఏరియాలోని ‘చట్​కాజ్’ఇండియన్​ స్ట్రీట్​ ఫుడ్​కి చాలా పాపులర్. ఇక్కడ మన రోడ్​ సైడ్ స్పెషల్స్​ అయిన ​ ‘మసాలా పావ్​, పానీపూరీ, సమోసా’ అన్నీ దొరుకుతాయి. మ్యాంగో లస్సీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ. అలాగే ‘జైపూర్​ స్వీట్స్’ స్టాల్​లో దొరికే ఆలు టిక్కీ , రగడా పట్టీలకి  చాలామంది ఫ్యాన్స్​ ఉన్నారు. ఇదే ఏరియాలోని ‘ఫ్లేవర్స్​ ఆఫ్​ పానీపూరీ, సర్దార్​జీస్​ లైవ్​ జిలేబీ’  కూడా బాగా పాపులర్​. ‘దోసె హట్’​ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఇందులో 90 రకాల దోసెలు దొరుకుతాయి. అలాగే ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​​ సిటీలోని ‘‘షాన్​– ఎ– పంజాబ్​ దానా పానీ, దేశీ చట్కా, అమృత్​ సర్​ ఎక్స్​ప్రెస్​, మోమో నూడిల్స్, మామా ఫ్రాంకీ అండ్​ చికెన్​ కార్నర్’’​ ఫుడ్​ ట్రక్స్​​ ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ని సర్వ్​ చేస్తాయి. ఇక్కడ ‘దేశీ కోతీ ఐస్​క్రీమ్​’ స్టాల్​ ఫలూదాకి చాలా ఫేమస్​. అన్నట్టు ఈ ఫుడ్​ ట్రక్​లన్నీ ఒకే చోట ఉంటాయి. 

జర్మనీ :

టేస్టీ ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ని అందించే దేశాల్లో జర్మనీ కూడా ఉంది. ఇక్కడ మ్యూనిక్​​ ఇసార్టర్ స్టేషన్​లో ఉండే ‘చాట్​ జంక్షన్’​ ముందు​ బారులు తీరతారు ఇండియన్స్​. గంటలు గంటలు ‘క్యూ’లో నిలబడి ​ మరీ తమకి నచ్చిన ఫుడ్​ని ఎంజాయ్​ చేస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే...

‘చాట్​ జంక్షన్​’

పేరుకు తగ్గట్టే అన్ని రకాలు చాట్స్​ దొరుకుతాయి ఈ స్టాల్​లో. ముఖ్యంగా ఇక్కడ సమోసా చాట్​ చాలా టేస్టీగా ఉంటుంది. పానీపూరీ టేస్ట్​ని పొగడకుండా ఉండలేం. అమ్​బాడమ్​బా అనే స్పెషల్​ చాట్​ కూడా దొరుకుతుంది ఇక్కడ. జంబో వడాపావ్ వీళ్ల సిగ్నేచర్​ డిష్​. అలాగే జర్మనీలోని  బెర్లిన్​లోనూ ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ని టేస్ట్ చేయొచ్చు.ఇక్కడ ‘డీజే పంజాబ్’ ఫుడ్​ ట్రక్​లో అన్ని రకాల స్ట్రీట్​ ఫుడ్​ వెరైటీలు దొరుకుతాయి. సర్​ప్రైజింగ్​ విషయం ఏంటంటే దీన్ని రన్​ చేస్తోంది విదేశీయులు​. అలాగే బెర్లిన్​లోని ‘ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్’​ అనే స్టాల్​లోనూ సమోసా, పకోడి చాలా ఫేమస్​. 

సింగపూర్​ :

సింగపూర్​లో ‘లిటిల్ ఇండియా’ పేరుతో ఒక ఏరియానే ఉంది. సింగపూర్​ రివర్​కి తూర్పున ఉండే ఈ ఏరియా చూడ్డానికి అచ్చం ఇండియాలానే ఉంటుంది. ఇక్కడ హిందూ​ టెంపుల్స్​, షాపింగ్​ మాల్స్​తో పాటు ఇండియన్​ ట్రెడిషనల్​ ఫుడ్​ కూడా ఉంటుంది. ముఖ్యంగా స్ట్రీట్​ఫుడ్​. కేరళ ఫేమస్​  అప్పంతో మొదలుపెట్టి అన్ని రాష్ట్రాల వెరైటీ స్ట్రీట్​ ఫుడ్​ దొరుకుతుంది ఇక్కడ. గోల్​ గప్పా, చాట్, సమోస, జిలేబీ, పకోడి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఏరియాలోని ‘అంకుల్​ కుక్​, పొన్ను సామీ ఎక్స్​ప్రెస్​, బాలాజీ భవన్​, అజప్పార్​, అర్బన్ రోటీ, కాపర్​ చిమ్నీ’  స్టాల్స్​లో బెస్ట్​ ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ దొరుకుతుంది.  
వీటితో పాటు మన పక్క దేశాలైన బంగ్లాదేశ్​, శ్రీలంక, పాకిస్తాన్​, భూటాన్​, నేపాల్​, మయన్మార్​లోనూ మన ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ చాలా పాపులర్. మన దేశాన్ని ఆనుకొని ఉండటం వల్ల ఈ దేశాల  స్ట్రీట్​ఫుడ్​ మెనూలో మన వంటకాలు చాలాకాలం కిందటే చేరిపోయాయి. ఫిలిప్పీన్స్​, డెన్మార్క్​ లాంటి దేశాల్లోనూ మన స్ట్రీట్​ఫుడ్​ దొరుకుతోంది. అంటే ప్రపంచంలో ఏ మూలకెళ్లినా మన స్ట్రీట్​ఫుడ్​ని మిస్​ అవ్వాల్సిన పనిలేదన్నమాట. 

ఇవి పాపులర్​ రెస్టారెంట్స్​  

విదేశాల్లో మన స్ట్రీట్​ ఫుడ్​ కల్చర్​ మొన్నీమధ్యే మొదలైనప్పటికీ.. ఇండియన్​ రెస్టారెంట్లు మాత్రం ఎప్పట్నించో మన ట్రెడిషనల్ డిష్​లని​ వడ్డిస్తున్నాయి. అలా విదేశాల్లో స్వదేశీ రుచులు పంచుతున్న రెస్టారెంట్స్​లో ‘శరవణా భవన్​’కి మంచి పేరుంది.  న్యూయార్క్​, లండన్​, పారిస్​, దుబాయ్​ లాంటి సిటీలతో కలుపుకొని ప్రపంచం మొత్తంలో 50 సిటీల్లో  శరవణ భవన్​ బ్రాంచ్​లు ఉన్నాయి. అలాగే కాలిఫోర్నియాలోని ఓక్​లాండ్​లో ఉన్న ‘దోశ బై దోశ’, న్యూ మెక్సికోలోని ‘శాంటా ఫేలో’ రెస్టారెంట్​లు బెస్ట్​ ఇండియన్​ ఫుడ్​ని సర్వ్​ చేస్తున్నాయి. ముంబైలో అతి పెద్ద రెస్టారెంట్​ అయిన ‘కోబ్​’ కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​, ఒమన్​, అమెరికాల్లో చాలా పాపులర్. న్యూయార్క్ సిటీలోని ‘అడ్డా’ రెస్టారెంట్​లో కూడా మంచి ఇండియన్​ ఫుడ్​ దొరుకుతుంది.  కాలిఫోర్నియాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో ‘ఆగష్టు15​ ’అనే రెస్టారెంట్ ఉంది. దీని పేరు చూసి, అది రెస్టారెంట్ మొదలుపెట్టిన రోజు అనుకుంటారు చాలామంది. కానీ, ఇండియాకు స్వతంత్రం వచ్చిన రోజునే రెస్టారెంట్​కి పేరుగా పెట్టారు. అయితే ఇక్కడ బ్రిటీష్ ఇండియన్ల ఫేవరెట్ ఫుడ్ చికెన్​ టిక్కా మసాలా, వెజిటబుల్ జాల్​ఫ్రెజి దొరుకుతాయి. మన వంటల్లో ఇంటర్నేషనల్​ ఇంగ్రెడియెంట్స్​ కూడా కలిపి చేస్తారు. రొయ్యలతో కలిపి ఉప్మా, వసాబితో సీ బాస్ ఫిష్​ వంటి వెరైటీలు చేస్తారిక్కడ. వీటితో పాటు లాస్​ ఏంజిలెస్​లోని ‘బద్మాష్’​,  ఒరెగాన్​లోని పోర్ట్ లాండ్​లో ఉన్న ‘బాలీవుడ్​ థియేటర్’​ , చికాగోలోని ‘బాంబే చాప్​ స్టిక్స్, క్యుమిన్’​ రెస్టారెంట్స్​ ఇండియన్​ ట్రెడిషనల్​ వంటకాలకి చాలా పాపులర్​. వీటితో పాటు మరెన్నో రెస్టారెంట్స్​ ఇండియన్​ ఫుడ్​కి కేరాఫ్​గా ఉన్నాయి. 

పదిమైళ్లకో స్టాల్​ 

పెండ్లి తర్వాత కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్​కి  షిఫ్ట్​ అయ్యా. ఈ ఏరియాలో ఇండియన్స్​ ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి పదిమైళ్లకి ఒక స్ట్రీట్ ఫుడ్ స్టాల్ కనిపిస్తుంటుంది. వీటిల్లో సమోసా, పానీపూరీ, చాట్​, దోసె అన్నీ దొరుకుతాయి. ఇండియన్​ మార్కెట్స్​కి వెళ్తే మన స్ట్రీట్​ఫుడ్​లో మరిన్ని వెరైటీలు ట్రై చేయొచ్చు. మేముంటున్న దగ్గర పదిడాలర్లకి ఎనిమిది పానీపూరీలు ఇస్తారు.. సమోసా ఒక్కోటి ఐదు డాలర్లు ఉంటుంది. ఇండియాతో పోల్చితే చాట్​, బజ్జీ అన్నీ కాస్త రేటు ఎక్కువే. ఏరియాని బట్టి ఈ రేట్లలో మరింత డిఫరెన్స్​ ఉంటుంది. అయినా సరే ఇండియన్స్​ ఇష్టంగా తింటుంటారు. - హారిక, కాలిఫోర్నియా 

ఫారినర్​ కస్టమర్సే ఎక్కువ

ఇండియా నుంచి డెన్మార్క్​ షిఫ్ట్​ అయి ఆరేండ్లు అవుతుంది. ఇక్కడ సమోసా, పావ్ బాజీ లాంటివన్నీ దొరుకుతాయి. ఒక్కో సమోసా నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంటుంది. టేస్ట్​ విషయానికొస్తే కొన్ని స్టాల్స్​లోనే బాగుంటుంది. మేమైతే ‘రామ్​ జీ మార్ట్​, గోల్డెన్​ ఫుడ్​ స్టోరీ అండ్​ ఇండియన్​ స్టోర్​’లో ఎక్కువగా మన స్ట్రీట్​ ఫుడ్​ టేస్ట్​ చేస్తుంటాం. ఇక్కడి స్టోర్స్​లో పానీపూరీ, కట్లెట్​కి కావాల్సిన సరుకులన్నీ దొరుకుతాయి. అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేస్తుంటాం. ఇక్కడ మన స్ట్రీట్​ఫుడ్​కి ఇండియన్స్​ కంటే ఫారిన్​​ కస్టమర్సే ఎక్కువ.. - సింధూజ, డెన్మార్క్

ఫారినర్స్​ ఇష్టంగా తింటరు

ఇరవైయేండ్ల కిందట లండన్​ వచ్చా. మొదట్లో  ఇక్కడ సమోసా తప్పించి మన స్ట్రీట్​ ఫుడ్​ ఏం దొరికేది కాదు. నాకేమో చాట్​, మిర్చీ బజ్జీ  అంటే చెప్పలేనంత ఇష్టం. కానీ, ఇప్పుడు మన ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​ వెరైటీలన్నీ లండన్​లో దొరుకుతున్నాయి. మన దగ్గరతో పోలిస్తే ఇక్కడ కాస్త రేటు ఎక్కువే.. ‘కానీ నో కాంప్రమైజ్’’. ఇక్కడ మనోళ్లే కాకుండా ఫారినర్స్​ కూడా సమోసాలు, పకోడీలు, బజ్జీలు ఇష్టంగా తింటారు. ఫ్యామిలీ ఫంక్షన్స్​, పార్టీలకు కూడా మన స్ట్రీట్​ఫుడ్​ని ఆర్డర్​ చేసుకుంటాం. అలాగే ఇండిపెండెన్స్​ డే, రిపబ్లిక్​ డేలకి ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్ ఫెస్టివల్స్​ కూడా జరుగుతాయి లండన్​లో. అక్కడికి మొత్తం ఇండియన్​​ స్ట్రీట్​ఫుడ్​ నడిచొచ్చినట్టే ఉంటది. 
- అనిల్​ , లండన్​ 

అన్ని వెరైటీలు దొరుకుతున్నయ్​ 

మాది కరీంనగర్​. చిన్నప్పట్నించీ స్ట్రీట్​ ఫుడ్​ అంటే పడి చచ్చేటోడ్ని. రోజూ పానీపూరీ, చాట్​ తినేవాడ్ని. అలా మా చుట్టుపక్కలున్న స్ట్రీట్​ ఫుడ్​ స్టాల్స్​ అన్నీ కొట్టిన పిండి అయ్యాయి. నేను రెండున్నరేండ్ల కిందట ఎంబీబీఎస్​ కోసం ఫిలిప్పీన్స్​కి వచ్చేసరికి మన స్ట్రీట్​ఫుడ్​ దొరకదేమో అనుకున్నా. కానీ, ఇక్కడ కూడా  సమోసాలు, బజ్జీలు, పానీపూరీ అన్నీ దొరుకుతున్నాయి. రోజు విడిచి రోజు తింటున్నా కూడా. కానీ, సమ్​థింగ్​ మిస్సింగ్ అనిపిస్తుంటుంది. మరో విషయం ఏంటంటే ఇండియన్స్​ కంటే ఫారినర్సే మన స్ట్రీట్​ ఫుడ్​ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు.  ఫిలిప్పీన్స్​లో ‘తాజ్​ డిన్నర్​, ఇండియన్​ స్పైస్​ రెస్టో, సింగ్​ ఈజ్​ కింగ్’​ స్టాల్స్​ ఇండియన్​ స్ట్రీట్​ఫుడ్​కి చాలా ఫేమస్​.. - శివ ప్రసాద్​, ఫిలిప్పీన్స్​ ​

::: ఆవుల యమున
 

మరిన్ని వార్తల కోసం..

షాంఘైలో నెలరోజులుగా కఠిన లాక్ డౌన్

రేపో, ఎల్లుండో గ్రూప్ 1 నోటిఫికేషన్