ఎప్పటికైనా మా వాడే సీఎం : ఉద్ధవ్‌‌ థాకరే

ఎప్పటికైనా మా వాడే సీఎం : ఉద్ధవ్‌‌ థాకరే

కొడుకొచ్చాడని రాజకీయాల నుంచి రిటైర్‌‌ కాను

2014 అసెంబ్లీ ఎలక్షన్లో 
‘మోడీ వేవ్‌‌’కు చెక్‌‌ పెట్టాం

 ‘సామ్నా’ ఇంటర్వ్యూలో 
శివసేన చీఫ్‌‌  ఉద్ధవ్‌‌ థాకరే

ముంబై: శివసేన సైనికుడు ఎప్పుడో ఒకనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకం తనకు ఉందని శివసేన చీఫ్‌‌ ఉద్ధవ్‌‌ థాకరే చెప్పారు.  సేన కార్యకర్తను సీఎం చేస్తానని తండ్రి బాలాసాహేబ్‌‌కు మాట ఇచ్చానని  ఆయన వెల్లడించారు.  ఎన్నికల బరిలోకి కొడుకు ఆదిత్య థాకరే ఎంట్రీ ఇచ్చినంతమాత్రాన తాను రాజకీయాల  నుంచి రిటైర్‌‌ అయినట్టు కాదని ఆయన సోమవారం అన్నారు.  శివసేన అధికార పత్రిక ‘సామ్నా’కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్‌‌   మాట్లాడుతూ…2014 అసెంబ్లీ ఎన్నికల్లో ‘ మోడీ వేవ్‌‌’కు తమపార్టీ చెక్‌‌ పెట్టిందన్నారు.  ఆ  ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోలేకపోవడంపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరంలేదన్నారు.

ముంబైలోని వర్లి నుంచి సేన చీఫ్‌‌ కొడుకు ఆదిత్య థాకరే  అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. ఈనెల 21న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి పెద్ద పరీక్ష అని ఉద్ధవ్‌‌ చెప్పారు. కొడుకు రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన తాను రిటైర్‌‌మెంట్‌‌ తీసుకుని వ్యవసాయం చేయబోనని  అన్నారు.  పాలిటిక్స్‌‌ బదులు వ్యవసాయమో, బిజినెస్సో చేసుకోమని ఈమధ్యనే ఎమ్మెల్యేగా రిజైన్‌‌ చేసిన ఎన్సీపీ నాయకుడు అజిత్‌‌ పవార్‌‌ తన కొడుకుకి ఇచ్చిన సలహాను దృష్టిలో పెట్టుకుని  ఉద్ధవ్‌‌ ఈ కామెంట్స్‌‌ చేశారు.  అధికారంలో  భాగస్వామిగా ఉన్నా  ప్రజల సమస్యల్ని ఎప్పుడూ ప్రస్తావిస్తునే ఉన్నామని ఆయన అన్నారు.