నేలతల్లి ఆరోగ్యం కోసం

నేలతల్లి ఆరోగ్యం కోసం

తినే తిండి .. తాగే నీరు.. పీల్చే గాలి.. నడిచే నేల.. అన్నీ కలుషితమే. ఫలితంగా మనిషి మనుగడకే పెద్ద దెబ్బ. ఒక్క గాలి కాలుష్యం ​ వల్లే ఏటా కోటి 50 లక్షల మంది చనిపోతున్నారు. నీటి కాలుష్యంతో  తొమ్మిది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్లాస్టిక్​ వేస్ట్​ వల్ల మనుషులతో పాటు జంతువులు, పక్షులు కూడా చనిపోతున్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే రానున్న రోజులు మరింత దారుణంగా ఉంటాయి అంటోంది డబ్ల్యూహెచ్ఓ. అందుకే ​ఈనెల ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని  ‘అవర్​ ప్లానెట్​, అవర్​ హెల్త్​ ’అనే థీమ్​తో జరుపుతోంది వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​.  రేపటి ఆరోగ్యం కోసం గాలి, నీరు, తిండిని కాలుష్యం నుంచి కాపాడుకుందాం అంటోంది. 

డబ్ల్యూహెచ్‌‌ఓ ఏర్పాటైన  రోజు ఏప్రిల్​ 7. ఆరోజునే ప్రతి ఏటా ‘వరల్డ్ హెల్త్​ డే’గా జరుపుతారు. ఆరోగ్యంపై ప్రజలకు అవేర్​నెస్​ క‌‌ల్పించడమే ఈ వేడుక వెనకున్న ముఖ్య ఉద్దేశం. అయితే ఏటా ఒక కొత్త థీమ్​తో 72 ఏండ్లుగా జరుగుతోంది ఈ హెల్త్ డే. అలాగే ఈ ఏడాది కూడా ‘అవర్​ ప్లానెట్​, అవర్​ హెల్త్’ అనే థీమ్​తో ​సెలబ్రేట్​ చేస్తున్నారు. ఈ సందర్భంగా రేపటి హెల్త్​ కోసం, పొల్యూషన్​ వల్ల పొంచి ఉన్న ప్రమాదాల గురించి రెనోవా హాస్పిటల్స్​ జనరల్​ ఫిజిషియన్​ డాక్టర్​ స్పందన కనపర్తి మాటల్లో.
గాలి
కార్లు, బస్సులు, ట్రైన్లు, విమానాలు, ఫ్యాక్టరీల​ నుంచి వచ్చే పొగ వల్ల గాలి మొత్తం కలుషితమవుతోంది. 40% ఊపిరితిత్తుల సమస్యలకు ఇదే కారణం. అలాగే 60% ఆస్కీమెక్‌‌ గుండె జబ్బులు, గుండెపోటు, డయాబెటీస్‌‌కి కూడా గాలి కాలుష్యమే కారణం. అంతేకాదు, అప్పుడే పుట్టిన పసిబిడ్డల్ని కూడా మింగేస్తోంది ఈ పొల్యూషన్​. ఉబ్బసం, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌‌, కొన్ని రకాల చర్మ వ్యాధుల బారిన పడేలా చేస్తోంది. క్రానిక్‌‌ అబ్‌‌స్ట్రక్టివ్‌‌ పల్మనరీ డిసీజ్‌‌ (సీఓపీడీ), లుకేమియా, న్యుమోనియాలకు కారణం కూడా పొల్యూషనే. పొల్యూషన్​తో నిండిన గాలి కళ్ల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. చెడు గాలి కళ్లలోని కణాలపై దాడి చేస్తోంది. చెడు​ గాలిలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్​లు కళ్లని పొడి బారేలా చేసి డ్రై ఐ సిండ్రోమ్​కి కారణం అవుతాయి. అలర్జీలకు దారి తీస్తాయి.  ఒంట్లో రోగ నిరోధక శక్తి తగ్గిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా రోజూ కలుషితమైన వాతావరణంలో తిరగడం వల్ల మనిషి ఆయుష్షు మూడు శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. 

నీరు

ఎరువులు, పురుగు మందులు, ప్లాస్టిక్‌‌ వేస్ట్​, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్​ గాలితో పాటు నీటిని కూడా పొల్యూట్​ చేస్తున్నాయి. కలుషితమైన నీటి వల్ల పంటలు నాశనమవుతున్నాయి. కలుషితమైన నీళ్లు తాగడం వల్ల టైఫాయిడ్‌‌ సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ఒంట్లో చేరి టైఫాయిడ్​ వస్తోంది. టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ సమస్య వల్ల పేగుల్లో పుండ్లు పడటం, బ్లడ్​ ఇన్ఫెక్షన్స్​ కూడా వస్తాయి. అలాగే  కలరా, మలేరియా, ఫైలారియాసిస్, హైపటైటిస్​ లాంటి జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల కొన్ని సందర్భాల్లో కిడ్నీలు పూర్తిగా పాడైపోతాయి. అంతేకాదు, ఊపిరితిత్తులు, మెదడులోనూ ఇన్ఫెక్షన్లు వస్తాయి. షిజెల్లోసిస్ అనే వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. నీటి కాలుష్యం వల్ల  దోమలు పెరిగి బర్డ్‌‌ ఫ్లూ, స్వైన్‌‌ ఫ్లూ, చికున్‌‌ గున్యా లాంటి జబ్బులు వస్తాయి. 

నేల 

పెరుగుతున్న ప్లాస్టిక్​ వ్యర్థాలు, వ్యవసాయంలో కెమికల్స్ వాడకం వల్ల మట్టి కూడా కలుషితం అవుతోంది. డయేరియా, కార్డియో వాస్క్యులర్ జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రీతింగ్​ డిజార్డర్స్,  బ్రెయిన్​ డ్యామేజ్, బర్త్​ డిఫెక్ట్స్​, చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలకి కూడా ఇదే కారణం. నేల కాలుష్యం వల్ల పంటలు కూడా పొల్యూట్​ అవుతున్నాయి. దానివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లని ఎక్కువగా వేధించే పీసీఓడీ, హార్మోన్స్​ ఇన్​బ్యాలెన్స్​కి కూడా ఇదే కారణం. కేవలం మనుషులే కాదు నోరు లేని జంతువులు, పక్షులు కూడా నేల కాలుష్యానికి బలైపోతున్నాయి. 

ఆ బాధ్యత అందరిదీ

చుట్టూ ఉండే పరిసరాల మీదే మనిషి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పీల్చుకునే గాలి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలి. ప్లాస్టిక్​ని పూర్తిగా పక్కనపెట్టాలి. సేంద్రియ సాగు వైపు నడవాలి. కాచి, చల్లార్చిన లేదా ప్యూరిఫై చేసిన నీళ్లనే తాగాలి. కాలువలు, నదుల్ని శుభ్రంగా ఉంచాలి. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్​ వెహికల్స్​కే ఇంపార్టెన్స్​​ ఇవ్వాలి. అలాగే కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగ, బట్టలు ఉతకడానికి వాడే డిటర్జెంట్స్​ కూడా  భూమిని కలుషితం చేస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు నేచురల్​ ప్రొడక్ట్స్​నే వాడాలి. ఇండస్ట్రీలు, థర్మల్​ ప్లాంట్స్​ నుంచి వచ్చే పొగ, విష వాయువుల్ని  ఫిల్టర్ల సాయంతో వాతావ రణంలోకి చేరకుండా చూడాలి. అప్పుడే మన భూమితో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అంటున్నారు డాక్టర్​ స్పందన.

డా. స్పందన కనపర్తి, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, రెనోవా హాస్పిటల్స్, సనత్ నగర్, హైదరాబాద్