తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే మా విధానం : సజ్జల రామకృష్ణారెడ్డి

తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే మా విధానం : సజ్జల రామకృష్ణారెడ్డి

విజయవాడ: తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే మా విధానం, అలా కాగలిగితే మొదట స్వాగతించేది వైఎస్ఆర్ కాంగ్రెస్​పార్టీనే అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం వెలగపూడిలోని ఏపీ సీఎం క్యాంప్​ఆఫీసు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం అసంబద్ధం అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కొన్నేండ్ల కింద కేసు వేశారు. దీనిపై ఇటీవల ఆయన చేసిన కామెంట్లపై సజ్జల స్పందించారు. తమ పార్టీ ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం, తమ పార్టీ అవకాశం ఉంటే ఎప్పుడైనా సరే ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటామన్నారు. కానీ ప్రాక్టికల్‌గా ఇంత దూరం వచ్చిన తర్వాత పెండింగ్‌ లో ఉన్న అంశాలపై ఫైట్‌ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘‘ఆనాడు రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీ.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది బీజేపీ.. వారికి సహకరించి టీడీపీ అన్యాయం చేస్తే, చివరి నిమిషం వరకూ విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే’’అని అన్నారు. ఇక విధిలేని పరిస్థితుల్లో విభజన జరిగిన తర్వాత విభజన హామీల కోసం ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. సంప్రదింపుల ద్వారా, కోర్టుల్లో ఉన్న అంశాలపై తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉందన్నారు. ‘‘కాలచక్రాన్ని వెనక్కి తీసుకెళ్లగలిగితే.. లేదా సుప్రీం కోర్టు అసెంబ్లీ తీర్మానం, ఆర్టికల్‌–3 ప్రకారం విభజన జరగలేదు మళ్లీ కలవండి అంటే అంతకంటే కావాల్సింది ఏముంది..?” అని అన్నారు. ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంగా ఉండి ఉంటే అప్పుడు కూడా తామే అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు.
సజ్జల కామెంట్ల వెనుక మోడీ     టీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ పల్లా
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మళ్లీ కలవాలనే తాను కోరుకుంటానన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతు బంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వచ్చినప్పట్నుంచి ప్రధాని మోడీ సహా చాలా మంది విషం చిమ్మేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సజ్జల వ్యాఖ్యల వెనక మోడీ కుట్ర ఉందని ఆరోపించారు. ఆయన అండతోనే ఒకప్పుడు చంద్రబాబు, ఇప్పుడు సజ్జల ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంతో కలిసి ఆయన టీఆర్​ఎస్​ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. కేఏ పాల్​ సహా ఎన్నో బాణాలను తెలంగాణపై బీజేపీ వదులుతోందన్నారు. ఏపీలో ప్రజలకు మేలైనా పాలనను అందించడం చేతగాకనే తెలంగాణలో కలుస్తామంటున్నారని విమర్శించారు.

రామకృష్ణారెడ్డివి అర్థం లేని వ్యాఖ్యలు వైఎస్​ఆర్​టీపీ చీఫ్ షర్మిల

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ కలవడం అసాధ్యమని, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు అర్థం లేనివని వైఎస్సార్టీపీ చీఫ్​ వైఎస్​ షర్మిల అన్నారు. నేడు తెలంగాణ ఒక వాస్తవమని, ఎంతో మంది బలిదానాలు, త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రమని తెలిపారు. సజ్జల కామెంట్లను ఖండిస్తూ గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని విషయాలు చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరుగుతాయని, విడిపోయిన రాష్ట్రాలను మళ్లీ ఎలా కలుపుతారని నిలదీశారు. రెండు రాష్ట్రలను కలపడం మీద ధ్యాస పెట్టడం కన్నా.. రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సజ్జలకు ఆమె సూచించారు. ఏపీ హక్కుల కోసం పోరాటం చేయాలిగానీ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదన్నారు.