మన రష్యన్ ఆయిల్‌‌ కొనుగోళ్లు అప్‌‌! రానున్న నెలల్లో దిగుమతులు పెరిగే అవకాశం

మన రష్యన్ ఆయిల్‌‌ కొనుగోళ్లు అప్‌‌! రానున్న నెలల్లో దిగుమతులు పెరిగే అవకాశం
  • బ్యారెల్‌‌పై 2–2.5 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్న రష్యా
  • అమెరికాతో ట్రేడ్‌‌ చర్చలు కొనసాగిస్తున్న ఇండియా
  • మిడిల్‌‌ ఈస్ట్‌‌, ఆఫ్రికా దేశాలతో లాంగ్‌‌టెర్మ్ కాంట్రాక్టులు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు

న్యూఢిల్లీ: అమెరికా ఎంత ఒత్తిడి చేస్తున్నా, ఇండియా మాత్రం రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవాలని ప్రయత్నించడం లేదు. బదులుగా ఇండియన్ రిఫైనరీలు వచ్చే నెలలో దిగుమతులను పెంచే అవకాశం ఉంది. ఇండియా, యూఎస్‌‌  వాణిజ్య చర్చలు ముందుకు కదలడం లేదు. మరోవైపు రష్యా తన ఆయిల్‌‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.  

నవంబర్‌‌లో లోడయ్యే రష్యన్ ఉరల్స్ క్రూడ్‌‌పై  బ్యారెల్‌‌కు 2డాలర్ల నుంచి 2.50 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇది ఈ ఏడాది జులై–-ఆగస్టులో ఉన్న  ఒక డాలర్‌‌‌‌ డిస్కౌంట్‌‌తో పోలిస్తే ఎక్కువ.  అప్పట్లో లోకల్ కన్జూమర్ల కోసం రష్యా ఎగుమతులు తగ్గించింది. దీంతో  డిస్కౌంట్ తగ్గింది.  ప్రస్తుత నెలలో  రష్యా నుంచి దిగుమతుల్లో పెరుగుదల కనిపిస్తోంది. 

గ్లోబల్‌‌ ట్రేడ్ ఎనాలసిస్ కంపెనీ కెప్లర్‌‌‌‌ లిమిటెడ్‌‌ ప్రకారం, అక్టోబర్‌‌లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రోజుకు సగటున 1.7 మిలియన్ బ్యారెల్స్‌‌కి చేరొచ్చని అంచనా. ఇది గత నెలతో పోలిస్తే 6 శాతం ఎక్కువ. కానీ గత ఏడాది ఇదే నెల స్థాయితో పోలిస్తే కొద్దిగా తక్కువ. 

ఒత్తిడి పెరుగుతున్నా..

రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు ఇండియాపై 25 శాతం అదనపు పెనాల్టీ టారిఫ్‌ను అమెరికా వేసిన విషయం తెలిసిందే.  రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని ఒత్తిడి పెంచుతోంది. అయితే మరో ప్రధాన కొనుగోలుదారు చైనాపై మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోలేదు.  భారత్ మాత్రం క్రూడ్ ధరలను బట్టి రష్యన్ ఆయిల్ కొంటున్నామని స్పష్టం చేసింది.  అలాగే, వాషింగ్టన్‌‌తో చర్చల నేపథ్యంలో అమెరికా నుంచి కూడా ఆయిల్  కొనుగోళ్లు పెంచుతామని తెలిపింది. 

అమెరికాతో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియన్  రిఫైనరీలు డిస్కౌంట్‌‌ ధరకు దొరికే  రష్యా క్రూడ్‌‌ను భారీగా కొనుగోలు చేస్తాయా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. అమెరికా, ఇండియా మధ్య వాణిజ్య  చర్చలు సానుకూలంగా జరిగాయని  గత నెలలో ప్రభుత్వ అధికారులు ప్రకటించినా,  వాషింగ్టన్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లు ఇండియాపై ఒత్తిడి పెంచుతోంది.  

ఇదిలా ఉండగా, భారత ప్రభుత్వ చమురు సంస్థలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లోని నేషనల్ ఆయిల్ కంపెనీలతో 2026 కోసం లాంగ్‌‌టెర్మ్‌‌ ఒప్పందాలపై చర్చలు ప్రారంభించాయి.  కానీ, ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ప్రతినిధులు ఈ విషయంపై స్పందించలేదు.