‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ దేశం మొత్తం నిరూపితమైంది: రాహుల్ గాంధీ

‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ దేశం మొత్తం నిరూపితమైంది: రాహుల్ గాంధీ
  • లోక్​సభ ఎన్నికల్లో ఓట్​ చోరీ జరిగింది: రాహుల్​గాంధీ
  • మహారాష్ట్ర, కర్నాటకలో నకిలీ ఓట్లతో బీజేపీ గెలిచిందని విమర్శ
  • దేశవ్యాప్తంగా ఇలాంటివి జరిగాయని వెల్లడి
  • రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలిలో లోక్​సభ ప్రతిపక్ష నేత రెండు రోజుల పర్యటన

రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలి: ‘ఓట్ చోర్, గద్దీ చోడ్’ నినాదం దేశవ్యాప్తంగా ఆదరణ పొందిందని.. ఇకపై మరింత బలంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తామని లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఆయన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలిలో రెండు రోజుల పర్యటనలో భాగంగా,  లక్నో విమానాశ్రయంలో ల్యాండ్​ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఇతర నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం హర్చంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ విధానసభలో జరిగిన కార్యకర్తల కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ, మహారాష్ట్ర, కర్నాటక ఎన్నికల్లో ఓట్ల చోరీకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. మహారాష్ట్రలో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గెలిచిన 4 నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాయని, ఈ లోపు కోటి కొత్త ఓటర్లను చేర్పించారని చెప్పారు. ఈ కొత్త ఓట్లన్ని బీజేపీకి పడ్డాయని, కాంగ్రెస్, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీపీ, శివసేన ఓట్లలో మార్పు లేదని ఆయన తెలిపారు.

ఈసీ ఆధారాలు ఇవ్వడం లేదు
కర్నాటకలోని బెంగళూరు సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ కార్యకర్తలు 4 నెలల పాటు దర్యాప్తు చేసి, 2 లక్షల నకిలీ ఓటర్లను గుర్తించారని రాహుల్ వెల్లడించారు. ఈ ఓట్ల చోరీ ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కూడా జరిగిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో దర్యాప్తు చేయడానికి నిరాకరించిందని, ఓటర్ల జాబితా లేదా వీడియో ఆధారాలు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. అనంతరం రాహుల్ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలిలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని, అభివృద్ధి పనులను సమీక్షించారు.