- కంటోన్మెంట్ ఏరియాలో ఐదు రోడ్లు రీఓపెన్
- రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు
- కేంద్ర నిర్ణయంపై కంటోన్మెంట్ ప్రజల హర్షం
కంటోన్మెంట్, వెలుగు : కంటోన్మెంట్ బోర్డు పరిధిలో లోకల్ మిలటరీ అథారిటీ మూసివేసిన 6 రోడ్లలో 5 రోడ్లను త్వరలోనే రీ-ఓపెన్ చేయనున్నారు. దీనిపై కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోడ్లను అందుబాటులోకి తేవడం వల్ల సుమారు 3.5లక్షల మంది ప్రజలకు ఊరట కలగనుంది. తమ ఆందోళనపై రక్షణ శాఖ సానుకూలంగా స్పందించడంపై కంటోన్మెంట్ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఏండ్లుగా సమస్య
కంటోన్మెంట్ బోర్డులో రోడ్ల సమస్య ఏండ్లుగా కొనసాగుతున్నది. పారా మిలటరీ దళాలు, రక్షణ దళాలు, ఇతర డిఫెన్స్ అంశాల దృష్ట్యా తమకు అంతరాయం కలుగుతుందని లోకల్ మిలటరీ అథారిటీ 2014లో కంటోన్మెంట్ ఏరియాలోని రోడ్లను మూసివేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి కొన్ని రోడ్లు మూస్తూ కొన్నింటిని తెరుస్తూ వస్తున్నారు. దీని వల్ల స్థానిక ప్రజలు తమ ఇబ్బందులపై ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. రోడ్లు మూసివేసే ముందు తమ నుంచి అనుమతులు పొందాలని 2021లో డిఫెన్స్ మినిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా కొనసాగుతుండగానే 2022 అక్టోబర్లో కంటోన్మెంట్ పరిధిలోని రిచర్డ్ సన్ రోడ్, ప్రోటినీ రోడ్, బైమ్ రోడ్, అమ్ముగూడ రోడ్, అల్బియన్ రోడ్, ఎంప్రెస్ రోడ్డు అనే ఆరు రోడ్లను మిలటరీ అథారిటీ శాశ్వతంగా మూసివేసింది. మూసివేసింది కేవలం ఆరు రోడ్లలాగే కనిపిస్తున్నా వీటితో కంటోన్మెంట్ పరిధిలోని కాలనీలు, బస్తీలను కలుపుతూ ఉన్న 21 రోడ్లు మూసివేతకు గురయ్యాయి. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజల ఆందోళనలు.. త్రిసభ్య కమిటీ నివేదిక
కంటోన్మెంట్పరిధిలో రోడ్ల మూసివేతతో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ కాలనీ సంక్షేమ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కొంత కాలం రోడ్లను తాత్కాలికంగా ఓపెన్ చేసిన మిలటరీ అధికారులు ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను రోడ్ల మూసివేయాలా..? వద్దా..? అనే దానిపై నోటీసులు జారీ చేసిప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. దీనిపై స్పందించిన స్థానిక ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాలు పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి రోడ్ల మూసివేతకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టి.. వాటిని సమర్పించారు. అలాగే దీనిపై కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ఫిబ్రవరిలో సమావేశమై రోడ్లను తిరిగి తెరవాలన్న ప్రజల డిమాండ్ సరైందేనని తేల్చింది. దీనిపై కేంద్ర రక్షణ శాఖకు ఒక రిపోర్టు అందజేశారు.
త్వరలో గోడలు తొలగించి రోడ్లు ఓపెన్
కంటోన్మెంట్ పరిధిలో రిచర్డ్‌సన్ రోడ్, ప్రోటీనీ రోడ్, బైమ్ రోడ్, అమ్ముగూడ రోడ్, అల్బియన్ రోడ్, ఎంప్రెస్ రోడ్లు మూసివేయగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలలో ఐదు రోడ్లను తెరిచేందుకు మిటలరీ అథారిటీ అంగీకరించింది. అయితే ఎంప్రెస్రోడ్డును తెరవడానికి మాత్రం ఇంకా సమయం పడుతుందని తెలిసింది. ఈ రోడ్డు మిలటరీ క్వార్టర్లకు అతి సమీపంలో ఉండటం అలాగే అల్బెన్ రోడ్డుకు లింక్ రోడ్డుగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు సరిచూసుకుని దీనిని ఓపెన్చేసే దిశగా మిలటరీ అథారిటీ ప్రయత్నాలు చేస్తున్నది.
కాగా రోడ్లను మూసివేసిన సమయంలో మిలటరీ అధికారులు రిచర్డ్ సన్ రోడ్డు, ప్రోటినీ రోడ్లకు అడ్డంగా గోడలు నిర్మించారు. త్వరలోనే గోడలను తొలగించి రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కంటోన్మెంట్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఎన్నో ఏండ్లుగా కొనసాగిన కంటోన్మెంట్ ప్రజల ఆందోళనల ఫలితమే ఈ రోడ్ల రీఓపెన్ అని, అందుకు రక్షణ శాఖకు ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని వికాస్ మంచ్స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ తెలిపారు.
