సాయంత్రం కూడా అవుట్‌పేషెంట్‌(ఓపీ) సేవలు

సాయంత్రం కూడా అవుట్‌పేషెంట్‌(ఓపీ) సేవలు
  • 4 నుంచి 6 గంటల వరకు సేవలు
  • వచ్చే వారం నుంచి ప్రారంభం
  • ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ
  • భవిష్యత్తులో అన్ని దవాఖాన్లలో పెట్టే ఆలోచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని టీచింగ్​ హాస్పిటళ్లలో సాయంత్రం కూడా అవుట్‌పేషెంట్‌(ఓపీ) సేవలను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని టీచింగ్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌, డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ ఓపీ సేవలు అందించాలని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని వాటిలో పేర్కొన్నారు. సాయంత్రం ఓపీ టైమ్‌లో డాక్టర్లు సూచించిన టెస్టులు చేసి, మందులు ఇచ్చేందుకు ల్యాబ్, ఫార్మసీ కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వానాకాలంలో సీజనల్​ వ్యాధులు పెరగడం, ప్రభుత్వ దవాఖాన్లకు పేషెంట్లు ఎక్కువ మంది వస్తుండడంతో సాయంత్రం కూడా ఓపీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

పొద్దున ఏడున్నర నుంచే రిజిస్ట్రేషన్‌

ఓపీ రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రతి టీచింగ్​ హాస్పిటళ్లలో  పొద్దున ఏడున్నర నుంచే ఓపీ రిజిస్ట్రేషన్‌ ప్రారంభించాలని ఆదేశించింది. ఉదయం 9 గంటలకల్లా ఓపీలో డాక్టర్లు తప్పనిసరిగా ఉండాలని సూచించింది. డాక్టర్లు రాసిన టెస్టుల రిపోర్టులను అదే రోజు సాయంత్రాని కల్లా పేషెంట్లకు ఇవ్వాలని డీఎంఈ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులతో ఓపీ స్లిప్‌ కోసం గంటలకొద్ది వేచి ఉండే బాధ, టెస్టు రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురుచూసే బాధ రోగులకు తప్పుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న టైమింగ్స్‌తో చికిత్స ప్రారంభించే సరికే రెండ్రోజులు పడుతోందని, ఈ విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు. రెగ్యులర్ ఓపీ లెక్కనే సాయంత్రం ఓపీలోనూ అన్ని స్పెషాలిటీల డాక్టర్లు అందుబాటులో ఉంటారని డాక్టర్ రమేశ్​రెడ్డి వెలుగుకు తెలిపారు. సాయంత్రం ఓపీకి డాక్టర్ల కొరత అడ్డంకి కాదని, అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో సరిపడా డాక్టర్లు ఉన్నారని చెప్పారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా సూపరింటెండెంట్లు ఏర్పాట్లు చేస్తున్నారని, వచ్చే వారం రోజుల్లో అన్ని టీచింగ్‌ హాస్పిటళ్లలో సాయంత్రం ఓపీ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం టీచింగ్ హాస్పిటళ్లలోనే సాయంత్రం ఓపీ పెడుతున్నప్పటికీ, భవిష్యత్‌లో అన్ని హాస్పిటళ్లలోనూ సాయంత్రం ఓపీ అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.

అదనంగా చెల్లిస్తే ఓకే

సర్కార్ తీసుకున్న సాయంత్రం ఓపీ నిర్ణయంపై డాక్టర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పని వేళలు(డ్యూటీ హవర్స్) దాటిన తర్వాత పనిచేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తే, దానికి అనుగుణంగా అలవెన్స్‌లు ఇవ్వాలని కొంత మంది డాక్టర్లు అంటున్నారు. నిమ్స్‌, సెంట్రల్‌ ఇన్​స్టిట్యూట్స్‌లో ఇచ్చినట్టు, సాయంత్రం ఓపీ చేసే డాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయాలని డాక్టర్ నరహరి అభిప్రాయపడ్డారు. కొంత మంది డాక్టర్లు మాత్రం సాయంత్రం ఓపీ సాధ్యం కాదంటున్నారు. తమ డ్యూటీ సాయంత్రం 4 గంటల వరకేనని, 4 నుంచి 6 గంటల వరకూ ఓపీ సాధ్యం కాదు అని గవర్నమెంట్ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది.